'ఐదెకరాలు ఇవ్వకుంటే రైళ్లు ఆపుతాం'
గాంధీనగర్: వూనా ఘటన బాధితులతోపాటు దళితులకు ఐదు ఎకరాల భూమి ఇవ్వకుంటే తాము ఈ నెలాఖరున రైల్ రోకో నిర్వహిస్తామని పలువురు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గుజరాత్ లోని వూనాలో వేలమంది దళితులు చేరి పెద్ద బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల తల్లి రాధిక వేముల హాజరయ్యారు.
ఈ సందర్భంగా దళిన ఉద్యమకారుడు, న్యాయవాది అయిన జిగ్నేశ్ మేవాని మాట్లాడుతూ ఆగస్టు 22-23న గుజరాత్ అసెంబ్లీలో దళితులకు భూమిని ఇచ్చే విషయాన్ని చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న ఐదు ఎకరాల డిమాండ్ నెరవేర్చకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 'హార్థిక్ పటేల్ ఏడు నెలలపాటు జైలుకు వెళితే.. నేను 27 నెలలు జైలుకు వెళ్లేందుకైనా సిద్దం' అంటూ ఆయన ప్రకటించారు. అనంతరం రాధిక వేముల మాట్లాడుతూ కుల వివక్ష దేశమంతటా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశం అందరిదని, ఏ ఒక్క కులానికి చెందినవారిదో.. మతానికి చెందినవారిదో కాదని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిని గద్దె దించిన దళితులందరికీ అభినందనలు అంటూ ఆమె చెప్పారు.