Radhika Vemula
-
వర్సిటీల్లో కులవివక్ష నిర్మూలించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్ష ఆరోపణలపై స్పందించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న రోహిత్ వేముల, పాయల్ తాడ్విల మాతృమూర్తులు రాధిక, అబేదా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు శుక్రవారం జస్టిస్ ఎన్.వి.రమణ, అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. కుల వివక్ష నివారణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను వర్సిటీలు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు, జీవించే హక్కు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2004 నుంచి దాదాపు 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలు ఈ కోవలోనివే అని న్యాయవాది వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల (2016), ముంబైకి చెందిన వైద్య విద్యార్థిని పాయల్ తాడ్వి(2019, మే) ఆత్మహత్యలకు కులవివక్షే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయోధ్యపై వాదనలకు మరో గంట బాబ్రీ మసీదు భూవివాద కేసుకు సంబంధించి ఈనెల 23న వాదనలు వినడానికి అదనంగా గంట సమయం కేటాయిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా, కేసుల భారాన్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇకపై అప్పీళ్లు, బెయిళ్లు, యాంటిసిపేటరీ బెయిళ్లకు సంబంధించిన 7ఏళ్ల వరకు జైలు శిక్ష విధించగలిగే కేసులను ఒకే న్యాయమూర్తి విచారించేలా నిబంధనలను సవరించింది. -
‘ఆ తల్లి ప్రకటన చూసి చలించిపోయా’
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు తప్పుడ వాగ్ధానాలు చేస్తున్నాయని, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రోహిత్ ఆత్మహత్య తరువాత తన కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం ఇరవై లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారని, రెండేళ్ల గడిచిన వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఇటీవల ఆమె తెలిపారు. రాజకీయ లబ్ధికోసమే తనకు తప్పుడు వాగ్ధానాలు చేశారని వాపోయారు. రాధిక వ్యాఖ్యలపై పియూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. ‘రోహిత్ తల్లి రాధిక ప్రకటనను చూసి నేను చలించిపోయాను. రాధికను ప్రతిపక్ష పార్టీలు రాజకీయ బంటుగా వాడుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి చిల్లర రాజకీయలు మానుకోవాలి. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పలు ర్యాలీలో రోహిత్ వేముల కుటుంబానికి పలు హామీలు ఇచ్చారు. ఆ తల్లికి అబద్ధపు ప్రకటను చేసినందుకు రాహుల్ క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంద’ని గోయల్ అన్నారు. తనకు ఇంటి నిర్మాణం కోసం ప్రకటించిన ఇరవై లక్షలకు ముస్లిం లీగ్ నుంచి రెండు చెక్కులు వచ్చాయని, అవి రెండు బౌన్స్ అయ్యాయని ఆమె చేసిన ఆరోపణలపై ఐయూఎమ్ఎల్ నేత ఎమ్కే మునీర్ స్పందించారు. ‘రాధిక వేములకు ఇరవైలక్షలు ఆర్థిక సహయం చేస్తామన్నది వాస్తవం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం. పొరపాటు వల్ల రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఇదివరకే ఇంటి నిర్మాణ స్థలం కోసం ఐదు లక్షలు చెల్లించామ’ని ముస్లిం లీగ్ నేత మునీర్ పేర్కొన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే వాగ్ధానం: రాధిక వేముల
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ లబ్ది కోసమే తనకు ఇరవై లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకులు తప్పుడు వాగ్ధానం చేశారని రోహిత్ వేముల తల్లి రాధిక ఆరోపించారు. దీనిపై రాధిక సోమవారం కొన్ని విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్ధి వేముల రోహిత్ 2016లో యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ ఆత్మహత్య తరువాత కేరళ నుంచి ముస్లిం లీగ్ తరుపున కొంత మంది నాయకులు వచ్చి రోహిత్‌కు మద్దతుగా కేరళలో భారీ సభను ఏర్పాటు చేస్తున్నామని, ఆ సభకు ముఖ్య అతిధిగా తనను ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు. వేముల కుటుంబం ఆర్థికంగా వెనుకబడిందిగా గుర్తించిన ముస్లిం లీగ్ నాయకులు విజయవాడలో ఇంటి నిర్మాణం కోసం ఇరవైలక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆ మీటింగ్‌లో ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికి వరకు రెండు చెక్కులు పంపారని అవి రెండు బౌన్స్ అయినట్లు ఆమె వెల్లడించారు. విజయవాడ, గుంటూరు మధ్య ఇంటి నిర్మాణం కోసం స్థలం కూడా చూపించారని అన్నారు. దీనిపై రాధిక తీవ్రంగా మండిపడ్డారు. చెక్కు ఇచ్చే ఉద్దేశం లేకుండా ఇలా తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉండాలని, కేవలం రాజకీయం లబ్ధి కోసమే తనకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారని ఆమె పేర్కొన్నారు. చెక్ బౌన్స్‌పై స్పందించిన ముస్లిం లీగ్ సభ్యులు పొరపాటు వల్ల ఇలా జరిగిందని, ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉంటామని అన్నారు. -
దత్తాత్రేయకు రోహిత్ వేముల తల్లి సానుభూతి
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్(21) హఠార్మణం పట్ల రోహిత్ వేముల తల్లి రాధిక వేముల సంతాపం ప్రకటించారు. దత్తాత్రేయకు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘కొడుకును కోల్పోయిన వారి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. జరిగిన విషాదానికి చింతిస్తున్నాను. మీరు త్వరగా ఈ ఘటన నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నాను...జై భీమ్’ అంటూ తన ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. దత్తాత్రేయ కుమారుడు వైష్టవ్ మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయారు. హెచ్‌సీయూ విద్యార్ధి రోహిత్ వేముల 2016, జనవరి 17న హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో రోహిత్‌ను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన వారిలో దత్తాత్రేయ కూడా ఉన్నాడరనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ కార్యకర్తపై దాడి చేశారనే అభియోగంతో రోహిత్ వేములతోపాటు మరో నలుగురు విద్యార్థులను వీసీ యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. దాంతో మనస్తాపం చెందిన రోహిత్ వేముల హస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయారు. అయితే ఈ వ్యవహారంలో అప్పట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న దత్తాత్రేయపై కూడా ఆరోపణలు వచ్చాయి. హెచ్‌సీయూ కులవాదులు, ఉగ్రవాదులు, జాతి వ్యతిరేకుల అడ్డాగా మారిందంటూ కేంద్రమంత్రి దత్తాత్రేయ అప్పటి హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. దీనికి స్పందనగా వీసీ అప్పారావుతో రోహిత్ వేములతో పాటు మరో నలుగురు విద్యార్ధులను బహిష్కరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఆందోళనలు రేగాయి. దీంతో ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే రూపన్వాల్ నేతృత్వంలో ఏక సభ్య కమిటీని వేసింది. ఈ కమిటీ దత్తాత్రేయను నిర్ధోషిగా ప్రకటించి క్లీన్ చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఆ పరిహారం వీసీ అప్పారావు సొత్తు కాదు
సాక్షి, హైదరాబాద్ : జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాలతో తన కుమారుడు రోహిత్ వేముల మృతికి పరిహారంగా సెంట్రల్ వర్సిటీ అందజేసిన రూ.8 లక్షలను తాను స్వీకరించినట్లు రోహిత్ తల్లి రాధిక వేముల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమకు పరిహారంగా ఇచ్చిన డబ్బులు సెంట్రల్ యూనివర్సిటీ వీసీ పొదిలి అప్పారావు సొత్తు కాదని అన్నారు. తన కుమారుడి ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేవరకు ఆందోళన విరమించబోమని తెలిపారు. వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులపై తాము చేపట్టిన న్యాయపోరాటాన్ని చివరివరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
రోహిత్ వేముల తల్లికి విజ్ఞప్తి
రాజేంద్ర నగర్ : దళిత యువ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని.. రోహిత్ వేముల తల్లి రాధికకు ఓ విజ్ఞప్తి చేశాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఆమెను కోరుతున్నాడు. తద్వారా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పాలని జిగ్నేష్ ఆకాంక్షిస్తున్నాడు . ‘‘దళిత పోరాటంలో మా అందరికీ ప్రేరణగా నిలుస్తున్న రాధికమ్మకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. మీరు 2019 ఎన్నికల్లో పోటీ చేయాలి. తద్వారా పార్లమెంట్లో ‘మను’స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పించాలి’’ అని జిగ్నేష్ ఈ ఉదయం తన ట్విటర్లో ట్వీట్ చేశాడు. దళితులనే లక్ష్యంగా చేసుకుని వ్యవహరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీరుకు వ్యతిరేకంగా.. ఆమె పేరు ముందు మనుస్మృతిని చేర్చి అప్పట్లో పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. I strongly appeal to our inspiration Radhika(amma)Vemula to contest in 2019 elections and teach a lesson to Manusmriti Irani in Parliament. — Jignesh Mevani (@jigneshmevani80) 18 January 2018 రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ సెంట్రల్‌యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ రెండో వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన జిగ్నేష్.. రాధికమ్మను కలిసి సంఘీభావం తెలిపాడు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాధిక పాల్గొంటారని.. బీజేపీ ఓటమినే తమ అంతిమ లక్ష్యమని జిగ్నేష్ ఈ సందర్భంలో వెల్లడించారు. దళిత ఉద్యమం దేశంలోని ప్రతీమూలా విస్తరించాల్సిన అవసరం ఉందని.. దళిత వ్యతిరేక చర్యలకు మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని జిగ్నేష్ వెల్లడించాడు. -
రోహిత్ ఘటనలో నిజాల సమాధికి కుట్ర
తల్లి రాధికా వేముల ఆరోపణ సాక్షి, బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వెనుక అసలు నిజాలను సమాధి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలూ కుతంత్రాలకు పాల్పడుతున్నాయని రోహిత్ తల్లి రాధికా వేముల ఆరోపించారు. శనివారం బహుజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళితులను సమాజం నుంచి వేరు చేస్తోందని ఆరోపించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నిజంగా దళితుల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే రోహిత్ ఆత్మహత్య వెనుక నిజాలను ప్రపంచానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. -
వారు దర్జాగా తిరుగుతున్నారు
రోహిత్ వేముల తల్లి రాధిక ఆవేదన విజయవాడ: కుమారుడిని పోగొట్టుకొని తాను కుమిలిపోతుంటే, తన బిడ్డ చావుకు కారణమైన వారు మాత్రం దర్జాగా తిరుగుతున్నారని రోహి త్ వేముల తల్లి రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వాలు ఏమని సమాధానం చెబుతాయని ప్రశ్నించా రు. గవర్నర్‌పేట మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 5వ ఆలిండియా మహిళా సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా..రాధిక వేముల, ఢిల్లీ జేఎన్‌యూ ఉపా«ధ్యక్షురాలు దీప్సి తాదర్, కార్యదర్శి శత్రుభ, మహిళా సెల్ కన్వీనర్ ఉమారాణి తదితరులు ప్రసంగించారు. దళితులకు, మహిళలకు ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో వారిపై దాడులు జరుగుతున్నాయని రాధిక వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ ఐ ఆలిండియా అధ్యక్ష కార్యదర్శులు వీపీ సాను, విక్రంసింగ్, త్రిపుర మహిళా కన్వీనర్ సౌదా, ఏపీ మహిళా కన్వీనర్ చిన్నారి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై ఒక్క దెబ్బపడినా
నిరాహార దీక్ష చేస్తా సాక్షి, సిటీబ్యూరో: రోహిత్ స్థూపాన్ని సైతం జైల్లో బంధించినట్టు బంధించి, నా కొడుకుకి నేను నివాళ్లర్పించకుండా అడ్డుకోవడం ఇదెక్కడి న్యాయం అని రోహిత్ తల్లి రాధిక సూటిగా ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీలోకి ఎవరినీ అనుమతించకుండా, ఓ వైపు పోలీసులు, మరోవైపు ఫైరింజన్లు పెట్టి ఇక్కడేదో పెద్ద గొడవ జరగబోతున్నట్టు పోలీసులు చిత్రీకరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రోహిత్ వర్ధంతి సభను కులనిర్మూలనా దినంగా ప్రకటిస్తూ కులనిర్మూలనా పోరాట సమితి నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. ఇంత నిర్బంధం మధ్య హెచ్‌సీయూ విద్యార్థులు సమానత్వం కోసం పోరాడుతున్నారు. వారికి అండగా నేను అక్కడికే వెళ్తున్నాను. ఏ విద్యార్థిపైనైనా ఒక్క లాఠీ దెబ్బ పడినా నేను నిరాహార దీక్ష చేస్తాను అని రాధిక హెచ్చరించారు. ‘నా కొడుకు రోహిత్ విగ్రహానికి దండ వేసి, నివాళులర్పించే వరకు నాకు అండగా ఉండాలని’ ఆమె కోరారు. చాలా మాట్లాడాలని ఉందని, ఈ ఒత్తిడితో మాట్లాడలేకపోతున్నానని, అనారోగ్యం ఉన్నా విద్యార్థులకు, పోరాటాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలియజేయడానికే ఇక్కడికి వచ్చానని రాధిక అన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కెవై రత్నం, ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత. ప్రొఫెసర్ విజయ్, సతీష్, బిజూ మాచ్యూస్ తదితరులు మాట్లాడారు. దుఃఖానికి సైతం ఆంక్షలా: శేషు అంబేడ్కర్ భావజాలం పునాదిగా సమసమాజాన్ని కోరుకున్న రోహిత్ అనంతర ఉద్యమం చారిత్రాత్మకమైందన్నారు. రోహిత్ తల్లి రాధికమ్మ కొడుకు మరణంలోని దుఃఖాన్ని సైతం ప్రకటించుకునే స్వేచ్ఛ ఈ దేశంలో లేదని అన్నారు. దుఃఖానికి సైతం ఆంక్షలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్ దోషులను శిక్షించాలని యావత్ సమాజం కోరకుంటుంటే.. దోషులకు అవార్డులు ప్రకటించి గౌరవిస్తున్నారని, సైన్స్ జీనియస్‌గా కితాబులిస్తున్నారని, పరిశోధనా వ్యాసాలు కాపీ కొట్టిన వ్యక్తికి, ఓ హంతకుడికి అవార్డులా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. -
'ఐదెకరాలు ఇవ్వకుంటే రైళ్లు ఆపుతాం'
గాంధీనగర్: వూనా ఘటన బాధితులతోపాటు దళితులకు ఐదు ఎకరాల భూమి ఇవ్వకుంటే తాము ఈ నెలాఖరున రైల్ రోకో నిర్వహిస్తామని పలువురు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గుజరాత్ లోని వూనాలో వేలమంది దళితులు చేరి పెద్ద బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల తల్లి రాధిక వేముల హాజరయ్యారు. ఈ సందర్భంగా దళిన ఉద్యమకారుడు, న్యాయవాది అయిన జిగ్నేశ్ మేవాని మాట్లాడుతూ ఆగస్టు 22-23న గుజరాత్ అసెంబ్లీలో దళితులకు భూమిని ఇచ్చే విషయాన్ని చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న ఐదు ఎకరాల డిమాండ్ నెరవేర్చకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 'హార్థిక్ పటేల్ ఏడు నెలలపాటు జైలుకు వెళితే.. నేను 27 నెలలు జైలుకు వెళ్లేందుకైనా సిద్దం' అంటూ ఆయన ప్రకటించారు. అనంతరం రాధిక వేముల మాట్లాడుతూ కుల వివక్ష దేశమంతటా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశం అందరిదని, ఏ ఒక్క కులానికి చెందినవారిదో.. మతానికి చెందినవారిదో కాదని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిని గద్దె దించిన దళితులందరికీ అభినందనలు అంటూ ఆమె చెప్పారు. -
బౌద్ధం స్వీకరించిన రోహిత్ తల్లి, సోదరుడు
ముంబై: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ తల్లి రాధిక, అతని సోదరుడు రాజా మతం మారారు. ముంబైలో బౌద్ధమత గురువు సమక్షంలో వీరు బౌద్ధమతాన్ని స్వీకరించారు. రోహిత్ దళితుడు కావడం వల్లే వివక్షకు గురై వెలివేయబడ్డాడని.. అటువంటి వెలివేతకు అవకాశంలేని బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు రోహిత్ సోదరుడు అన్నారు. అసమానతలకు తావులేనిదిగా భావించి అంబేద్కర్ బౌద్ధం మతం స్వీకరించారని, అటువంటి సమానత్వాన్ని కాంక్షిస్తూ అంబేద్కర్ చూపిన మార్గంలో ఆయన జయంతిని పురస్కరించుకుని తాము బౌద్ధాన్ని స్వీకరించినట్లు ఆయన తెలిపారు. కొంతకాలంగా దేశంలో 'ఘర్ వాపసీ' గో మాంసం వివాదం, విద్యావ్యవస్థ కషాయీకరణ తదితర అంశాలపై దళిత, మైనారిటీ వర్గాలు ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇదే క్రమంలో అంబేద్కర్ విద్యార్థి సంఘం సభ్యుడు, హెచ్ సీయూ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడటంతో నిరసనలు, ఆందోళలు వెల్లువెత్తాయి. -
బౌద్ధం స్వీకరించనున్న రోహిత్ తల్లి, సోదరుడు
హైదరాబాద్: యూనివర్సిటీలు కేంద్రంగా కొద్ది నెలలుగా సాగుతోన్న ఆందోళనల్లో భాగంగా రేపు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హిందూ మంతంలో దళితులపై కొనసాగుతున్న వివక్షను నిరసిస్తూ బౌద్ధాన్ని స్వీకరించిన బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ బాటలోనే రోహిత్ వేముల కుటుంబం కూడా పయనించనుంది. దళితుడు కావడం వల్లే తన కుమారుడు వివక్షకు గురయ్యాడని, విద్యాలయం నుంచి వెలివేశారని, తనకు న్యాయం చేయాలంటూ కొద్ది నెలలుగా ఆందోళన కొనసాగిస్తోన్న రోహిత్ వేముల తల్లి రాధిక హిందూ మతాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించనున్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారం ముంబై మహానంగరంలో జరిగే కార్యక్రమంలో రోహిత్ తల్లి రాధికతోపాటు సోదరుడు రాజాకూడా బౌద్ధం స్వీకరిస్తారు. ఈ మేరకు వారిద్దరూ కొద్దిమంది స్నేహితులతో కలిసి బుధవారం హైదరాబాద్ నుంచి ముంబై పయనమయ్యారు. బౌద్ధ ధర్మం అసమానతలకు తావులేనిదిగా భావించడం వల్లే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆ మతాన్ని స్వీకరించాడని, అటువంటి సమాన త్వాన్ని కాంక్షించే తాము కూడా అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించేందుకు నిర్ణయించుకున్నట్లు వేముల రాజా మీడియాకు తెలిపారు. రెండేళ్ల కిందట కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే సంఘ్ పరివార్ 'ఘర్ వాపసీ' కార్యక్రమాన్ని ప్రారంభించడం, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు, ఒక పార్టీకి చెందిన ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాటిపై దేశవ్యాప్తంగా ఆందోళనలను చెలరేగటం విదితమే. ఆ తర్వాత గో మాంసం వివాదం, విద్యావ్యవస్థ కషాయీకరణ తదితర అంశాలపై దళిత, మైనారిటీ వర్గాలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టడం తెలిసిందే. ఈ క్రమంలోనే అంబేద్కర్ విద్యార్థి సంఘం సభ్యుడు, హెచ్ సీయూ స్కారల్ రోహిత్ వేముల సంఘంసంఘ్ అనుబంధ ఏబీవీపీ విద్యార్థి సంఘంతో గొడవపడి, ఆత్మహత్యకు పాల్పడటం, అనంతరం దళితులపై వివక్షను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు పుట్టుకురావటం చూశాం. రోహిత్ కుటుంబం బౌద్ధమత స్వీకారంతో వర్సిటీల్లోని వేలమంది అణగారిన విద్యార్థులు కూడా అదే బాటపట్టే అవకాశం లేకపోలేదు.