
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్(21) హఠార్మణం పట్ల రోహిత్ వేముల తల్లి రాధిక వేముల సంతాపం ప్రకటించారు. దత్తాత్రేయకు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘కొడుకును కోల్పోయిన వారి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. జరిగిన విషాదానికి చింతిస్తున్నాను. మీరు త్వరగా ఈ ఘటన నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నాను...జై భీమ్’ అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. దత్తాత్రేయ కుమారుడు వైష్టవ్ మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయారు.
హెచ్‌సీయూ విద్యార్ధి రోహిత్ వేముల 2016, జనవరి 17న హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో రోహిత్‌ను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన వారిలో దత్తాత్రేయ కూడా ఉన్నాడరనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ కార్యకర్తపై దాడి చేశారనే అభియోగంతో రోహిత్ వేములతోపాటు మరో నలుగురు విద్యార్థులను వీసీ యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. దాంతో మనస్తాపం చెందిన రోహిత్ వేముల హస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయారు. అయితే ఈ వ్యవహారంలో అప్పట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న దత్తాత్రేయపై కూడా ఆరోపణలు వచ్చాయి.
హెచ్‌సీయూ కులవాదులు, ఉగ్రవాదులు, జాతి వ్యతిరేకుల అడ్డాగా మారిందంటూ కేంద్రమంత్రి దత్తాత్రేయ అప్పటి హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. దీనికి స్పందనగా వీసీ అప్పారావుతో రోహిత్ వేములతో పాటు మరో నలుగురు విద్యార్ధులను బహిష్కరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఆందోళనలు రేగాయి. దీంతో ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే రూపన్‌వాల్ నేతృత్వంలో ఏక సభ్య కమిటీని వేసింది. ఈ కమిటీ దత్తాత్రేయను నిర్ధోషిగా ప్రకటించి క్లీన్ చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment