
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్ష ఆరోపణలపై స్పందించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న రోహిత్ వేముల, పాయల్ తాడ్విల మాతృమూర్తులు రాధిక, అబేదా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు శుక్రవారం జస్టిస్ ఎన్.వి.రమణ, అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది.
కుల వివక్ష నివారణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను వర్సిటీలు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు, జీవించే హక్కు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2004 నుంచి దాదాపు 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలు ఈ కోవలోనివే అని న్యాయవాది వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల (2016), ముంబైకి చెందిన వైద్య విద్యార్థిని పాయల్ తాడ్వి(2019, మే) ఆత్మహత్యలకు కులవివక్షే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
అయోధ్యపై వాదనలకు మరో గంట
బాబ్రీ మసీదు భూవివాద కేసుకు సంబంధించి ఈనెల 23న వాదనలు వినడానికి అదనంగా గంట సమయం కేటాయిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా, కేసుల భారాన్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇకపై అప్పీళ్లు, బెయిళ్లు, యాంటిసిపేటరీ బెయిళ్లకు సంబంధించిన 7ఏళ్ల వరకు జైలు శిక్ష విధించగలిగే కేసులను ఒకే న్యాయమూర్తి విచారించేలా నిబంధనలను సవరించింది.