Supreme Court Asks UGC What Action Taken Against Caste Discrimination In Campuses - Sakshi
Sakshi News home page

Caste Discrimination: వాటిల్లో కుల వివక్ష తీవ్రమైన అంశం

Published Fri, Jul 7 2023 4:53 AM | Last Updated on Fri, Jul 7 2023 12:07 PM

Supreme Court asks UGC what action taken against caste discrimination - Sakshi

న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్‌సీ, ఎస్టీ విద్యార్థులపై కుల వివక్షను ప్రదర్శించడం అత్యంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమని సుప్రీం కోర్టు పేర్కొంది. కుల వివక్షను రూపుమాపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో , ఏయే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో తెలపాలని  యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)ని ఆదేశించింది.

కులపరమైన వివక్షను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన  హైదరాబాద్‌కు చెందిన రోహిత్‌ వేముల, ముంబైకు చెందిన పాయల్‌ తాడ్విల తల్లులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎ.ఎస్‌. బొపన్న, ఎంఎం. సంద్రేశ్‌లతో కూడిన సుప్రీం డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారించింది.

ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఈ వివక్షను పారద్రోలడానికి చేపట్టిన చర్యలేంటో వెల్లడించాలని యూజీసీకి ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఇది  తీవ్రమైన అంశం. వారి ఆందోళల్ని మీరు ఎలా చూస్తున్నారు ? కులవివక్షకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టారు ? ఈ సమస్య పరిష్కారానికి యూజీసీ నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలి. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి’ కోర్టు∙యూజీసీ తరఫు∙లాయర్‌కు చెప్పింది. రోహిత్‌ వేముల, తాడ్వి తల్లుల తరఫున వాదించిన సీనియర్‌ అడ్వకేట్‌ ఇందిర కొడుకు, కూతురిని పోగొట్టుకున్న వారి మనోవేదన తీర్చలేదని అన్నారు. వీరిద్దరే కాకుండా గత ఏడాది కాలంలో మరో ముగ్గురు విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షను తట్టుకోలేక నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement