Una incident
-
'ఐదెకరాలు ఇవ్వకుంటే రైళ్లు ఆపుతాం'
గాంధీనగర్: వూనా ఘటన బాధితులతోపాటు దళితులకు ఐదు ఎకరాల భూమి ఇవ్వకుంటే తాము ఈ నెలాఖరున రైల్ రోకో నిర్వహిస్తామని పలువురు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గుజరాత్ లోని వూనాలో వేలమంది దళితులు చేరి పెద్ద బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల తల్లి రాధిక వేముల హాజరయ్యారు. ఈ సందర్భంగా దళిన ఉద్యమకారుడు, న్యాయవాది అయిన జిగ్నేశ్ మేవాని మాట్లాడుతూ ఆగస్టు 22-23న గుజరాత్ అసెంబ్లీలో దళితులకు భూమిని ఇచ్చే విషయాన్ని చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న ఐదు ఎకరాల డిమాండ్ నెరవేర్చకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 'హార్థిక్ పటేల్ ఏడు నెలలపాటు జైలుకు వెళితే.. నేను 27 నెలలు జైలుకు వెళ్లేందుకైనా సిద్దం' అంటూ ఆయన ప్రకటించారు. అనంతరం రాధిక వేముల మాట్లాడుతూ కుల వివక్ష దేశమంతటా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశం అందరిదని, ఏ ఒక్క కులానికి చెందినవారిదో.. మతానికి చెందినవారిదో కాదని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిని గద్దె దించిన దళితులందరికీ అభినందనలు అంటూ ఆమె చెప్పారు. -
'చంపింది దళితులు కాదు.. సింహాలు'
అహ్మదాబాద్: పార్లమెంటును కుదిపేలా చేసినా గుజరాత్ లోని వూనా ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. వూనాలో ఆవును దళితులు వదించలేదని, సింహాలు చంపేశాయని, అలా సింహాల చేతిలో చనిపోయన గోవు చర్మాన్ని మాత్రమే దళితులు తీసుకొచ్చుకున్నారని సీఐడీ అధికారులు చెప్పారు. తమ దర్యాప్తులో ఓ ప్రత్యక్ష సాక్షి ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. ఈ ఘటనపై వివరాలను సీఐడీ ప్రధాన అధికారి ఎస్ఎస్ త్రివేది వెల్లడిస్తూ 'దర్యాప్తు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే జూలై 10, 11న సింహాలు వేర్వేరు ప్రాంతంలో నాలుగు ఆవులుపై దాడులు చేసి చంపేశాయి. వీటిల్లో మోటా సమాదియాల చచ్చిపడివున్న ఆవు వద్దకు వెళ్లిన దళితులు దాని మృత కళేబరాన్ని తీసుకొచ్చుకున్నారు. అంతేగానీ, వారే స్వయంగా ఆ గోవును చంపలేదు' అని ఆయన వివరించారు. -
‘ఉనా’ మరో పీప్లీ లైవ్ అవుతోందా?
దాదాపు ఆరేళ్ల క్రితం.. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఓ సినిమా నిర్మించారు. అంతా చిన్న చిన్న నటులతోనే వచ్చిన ఆ సినిమా పేరు ‘పీప్లీ లైవ్’. అప్పట్లో అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కష్టాలు తట్టుకోలేక ఇక తనకు చావే శరణ్యం అంటూ ఏదో మాటవరసకి టీ దుకాణం వద్ద ఓ రైతు అన్న మాటలను పట్టుకుని గ్రామీణ విలేకరి చిన్న కథనం రాస్తాడు. ఫలానా రైతు ఆత్మహత్య చేసుకోబోతున్నాడంటూ వచ్చిన ఈ వార్తతో.. ఒక్కసారిగా జాతీయ మీడియా చానళ్లన్నీ ఉలిక్కి పడతాయి. ఆ రైతు ఎవరు, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు.. ఆ ఘటనను తాము లైవ్ కవరేజిలో చూపించాలని వాళ్లు పడే అత్యుత్సాహం నవ్వు పుట్టిస్తుంది. చివరకు ఆ రైతు కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్తున్నా.. అతడి వెంట కెమెరాలు పట్టుకుని పరుగులు పెడతారు. ఇప్పుడు గుజరాత్లోని ఉనా గ్రామం మరో పీప్లీ అవుతోంది. ఆవు మాంసం తరలిస్తున్నారని కొంతమంది దళితులను కర్రలతో కొట్టిన ఘటన నేపథ్యంలో రాజకీయ నాయకులు, మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. దళితులపై దాడి అంశం గురించి పార్లమెంటులో వాడివేడి చర్చ జరుగుతున్న సమయంలో ఎంచక్కా ఏసీ గాలికి కునుకు తీసిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మీడియాను వెంటబెట్టుకుని మరీ వెళ్లి బాధితుల కుటుంబాలను పరామర్శించారు. నిరంతరం మోదీ ప్రభుత్వం మీద ఏదో ఒక రూపంలో బురద చల్లడానికే ప్రయత్నాలు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జాతీయ మీడియా సాక్షిగా ఉనా గ్రామానికి వెళ్లి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. పోలీసులు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికే ఆ ఘటనకు సంబంధించి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామంటూ ఇంతకుముందే పోలీసులు ప్రకటించిన విషయం మాత్రం సదరు ముఖ్యమంత్రి గారికి గుర్తుకు రాలేదు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. అప్పటివరకు ఆస్పత్రిలో ఎంచక్కా చికిత్స తీసుకుంటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటున్న బాధితులను ఈ నాయకులు వెళ్లగానే ఒక్కసారిగా వీళ్ల చుట్టూ ఉన్న వందిమాగధులు, వీడియో కెమెరాల వాళ్లు చుట్టుముడతారు. వాళ్ల దగ్గర మైకులు పెట్టి, దాడి ఎలా జరిగిందో చెప్పమంటారు. వాళ్లు నిజంగా లేచి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా లేదా అని కూడా ఈ నాయకులెవరూ చూడటం లేదు. సర్వయ్య అనే వ్యక్తి జంతువుల చర్మం ఒలిచే పని చేస్తుంటాడు. అతడిమీద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయడంతో తలమీద తొమ్మిది కుట్లు పడ్డాయి. అతడిని పరామర్శించడానికి వరుసపెట్టి గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్.. ఇలా అందరూ వెళ్లారు. మీడియాతో మాట్లాడుతుండగా అతడికి ఒక్కసారిగా విపరీతమైన నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. నాయకులు వరుసపెట్టి దండయాత్ర చేయడంతో బాధితులు అసలు విశ్రాంతి తీసుకోడానికి వీలు కుదరడం లేదు. అసలు ముందు జరిగిన దాడి కంటే.. వీళ్లందరి ప్రచార దాడితో వాళ్ల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన కూడా వాళ్ల కుటుంబ సభ్యులలో వ్యక్తమవుతోంది. -
'పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు?'
-
'పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు?'
రాజ్కోట్: గుజరాత్ లో దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. రాజ్కోట్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉనా ఘటన బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఉనాలో దళితులపై దాడి చేసిన వారిపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు నిష్క్రియతో ప్రభుత్వం ప్రమేయం ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. గుజరాత్ సర్కారుకు దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ మండిపడ్డారు. గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న ఉనాలో జులై 11న కొందరు దళితులు చనిపోయిన ఒక ఆవు చర్మాన్ని వలుస్తుండగా.. గమనించిన గో పరిరక్షణ సమితి సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఆవులను చంపి మరీ చర్మాన్ని వలుస్తున్నారంటూ వారిని బంధించారు. చనిపోయిన ఆవు చర్మాన్నే తీస్తున్నామన్నా వినిపించుకోకుండా వారి చేతులను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత బాధితుల్లో ఏడుగురు ఆత్మాహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. విపక్షాలు ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాయి. -
వారి భావజాలమే ఇందుకు కారణం: రాహుల్ గాంధీ
రాజ్ కోట్: దళితులను చితక్కొట్టిన ఘటనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై గురువారం విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఆయనకు గట్టిగా బదులిచ్చింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుని గుజరాత్ పర్యటన రాజకీయ యాత్ర అని ఘాటుగా స్పందించింది. గుజరాత్ లో ఒకరోజు పర్యటించిన రాహుల్ చనిపోయిన ఆవు చర్మాని ఒలిచినందుకు దెబ్బలుతిన్న దళిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో ఉన్న బాధితుల వద్దకు వెళ్లిన రాహుల్ కేవలం గుజరాత్ లోనే కాక, దేశం మొత్త ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని ఆరోపించారు. మోదీ గుజరాత్ మోడల్ గురించి తరచూ ప్రస్తావిస్తారని వారికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతుకను నొక్కొస్తారని అన్నారు. దేశంలో ప్రస్తుతం రెండు భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. ఒకటి గాంధీ, సర్దార్ పటేల్, నెహ్రూ, అంబేద్కర్ లు పాటించిన మార్గమైతే.. రెండోది ఆర్ఎస్ఎస్, గోల్వాకర్, నరేంద్ర మోదీలు అనుసరిస్తున్న మార్గం అని ఆయన అన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య నుంచి మొదలుకుంటే ప్రస్తుతం గుజరాత్ లో దళితుల నిరసనలకు కారణం వీరి భావజాలమే అని చెప్పారు. కాగా, ఉనా ఘటనలో 16 మందిని అరెస్టు చేశారని, నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేశారు.