‘ఉనా’ మరో పీప్లీ లైవ్ అవుతోందా?
దాదాపు ఆరేళ్ల క్రితం.. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఓ సినిమా నిర్మించారు. అంతా చిన్న చిన్న నటులతోనే వచ్చిన ఆ సినిమా పేరు ‘పీప్లీ లైవ్’. అప్పట్లో అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కష్టాలు తట్టుకోలేక ఇక తనకు చావే శరణ్యం అంటూ ఏదో మాటవరసకి టీ దుకాణం వద్ద ఓ రైతు అన్న మాటలను పట్టుకుని గ్రామీణ విలేకరి చిన్న కథనం రాస్తాడు. ఫలానా రైతు ఆత్మహత్య చేసుకోబోతున్నాడంటూ వచ్చిన ఈ వార్తతో.. ఒక్కసారిగా జాతీయ మీడియా చానళ్లన్నీ ఉలిక్కి పడతాయి. ఆ రైతు ఎవరు, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు.. ఆ ఘటనను తాము లైవ్ కవరేజిలో చూపించాలని వాళ్లు పడే అత్యుత్సాహం నవ్వు పుట్టిస్తుంది. చివరకు ఆ రైతు కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్తున్నా.. అతడి వెంట కెమెరాలు పట్టుకుని పరుగులు పెడతారు.
ఇప్పుడు గుజరాత్లోని ఉనా గ్రామం మరో పీప్లీ అవుతోంది. ఆవు మాంసం తరలిస్తున్నారని కొంతమంది దళితులను కర్రలతో కొట్టిన ఘటన నేపథ్యంలో రాజకీయ నాయకులు, మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. దళితులపై దాడి అంశం గురించి పార్లమెంటులో వాడివేడి చర్చ జరుగుతున్న సమయంలో ఎంచక్కా ఏసీ గాలికి కునుకు తీసిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మీడియాను వెంటబెట్టుకుని మరీ వెళ్లి బాధితుల కుటుంబాలను పరామర్శించారు. నిరంతరం మోదీ ప్రభుత్వం మీద ఏదో ఒక రూపంలో బురద చల్లడానికే ప్రయత్నాలు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జాతీయ మీడియా సాక్షిగా ఉనా గ్రామానికి వెళ్లి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. పోలీసులు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికే ఆ ఘటనకు సంబంధించి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామంటూ ఇంతకుముందే పోలీసులు ప్రకటించిన విషయం మాత్రం సదరు ముఖ్యమంత్రి గారికి గుర్తుకు రాలేదు.
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. అప్పటివరకు ఆస్పత్రిలో ఎంచక్కా చికిత్స తీసుకుంటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటున్న బాధితులను ఈ నాయకులు వెళ్లగానే ఒక్కసారిగా వీళ్ల చుట్టూ ఉన్న వందిమాగధులు, వీడియో కెమెరాల వాళ్లు చుట్టుముడతారు. వాళ్ల దగ్గర మైకులు పెట్టి, దాడి ఎలా జరిగిందో చెప్పమంటారు. వాళ్లు నిజంగా లేచి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా లేదా అని కూడా ఈ నాయకులెవరూ చూడటం లేదు. సర్వయ్య అనే వ్యక్తి జంతువుల చర్మం ఒలిచే పని చేస్తుంటాడు. అతడిమీద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయడంతో తలమీద తొమ్మిది కుట్లు పడ్డాయి. అతడిని పరామర్శించడానికి వరుసపెట్టి గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్.. ఇలా అందరూ వెళ్లారు. మీడియాతో మాట్లాడుతుండగా అతడికి ఒక్కసారిగా విపరీతమైన నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. నాయకులు వరుసపెట్టి దండయాత్ర చేయడంతో బాధితులు అసలు విశ్రాంతి తీసుకోడానికి వీలు కుదరడం లేదు. అసలు ముందు జరిగిన దాడి కంటే.. వీళ్లందరి ప్రచార దాడితో వాళ్ల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన కూడా వాళ్ల కుటుంబ సభ్యులలో వ్యక్తమవుతోంది.