న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం ‘పీప్లీ లైవ్’ కో–డైరెక్టర్ మహ్మూద్ ఫరూఖీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 2015లో ఓ అమెరికా పరిశోధకురాలి(30)పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను కొట్టివేసింది. అలాగే రూ.50 వేల జరిమానానూ రద్దు చేసింది. బాధితురాలి వాంగ్మూలం విశ్వసనీయంగా లేదన్న జడ్జి జస్టిస్ అశుతోష్ కుమార్ ఫరూఖీపై నమోదైన అభియోగాలను సంశయలాభం కింద కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘మహిళల ప్రవర్తన ప్రకారం భాగస్వామితో అస్పష్టంగా శృంగా రం వద్దు అంటే దానర్థం కావాలని కూడా కావచ్చు. లైంగిక చర్యలో మహిళలు వద్దు అనడం, సంకోచం, అయిష్టత చూపడం వంటివి వారి అంగీకారానికి సూచన కాదు. మహిళలు నిశ్చయాత్మకంగా, స్పష్టంగా తమ సమ్మతి తెలిపినప్పుడే వారు అంగీకరించినట్లు. ఇద్దరూ ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నప్పుడు, విద్యావంతులైనప్పుడు, గతంలో శారీరక సంబంధం కలిగి ఉన్నప్పుడు.. లైంగిక చర్యకు మహిళ వద్దు అని అస్పష్టం గా చెబితే దానిని అసమ్మతిగా పరిగణించడం చాలా కష్టమవుతుంది.
లైంగిక చర్యల్లో పాల్గొనే మహిళల్లో చాలామంది చేతల ద్వారానే తమ సమ్మతిని తెలియజేస్తారని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఫిర్యాదిపై లైంగికదాడి జరిగిందా? ఒకవేళ నిజంగా జరిగితే ఆమె అంగీకారం లేకుండానే జరిగిందా? తనతో శృంగారం ఫిర్యాదికి ఇష్టం లేదని నిందితుడికి స్పష్టంగా అర్థమైందా? అన్న విషయాల్లో వాస్తవాలు ఇద్దరికే తెలుసు’ అని తీర్పులో జస్టిస్ కుమార్ పేర్కొన్నారు.