Peepli Live
-
‘ఒకసారి ముద్దులు కూడా పెట్టుకున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో పీప్లీ లైవ్ చిత్ర దర్శకుడు మహ్మద్ ఫరూఖికి మరోసారి ఊరట లభించింది. గతంలో ఆయన నిర్దోషి అంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ కేసు ఇద్దరు కొత్త వ్యక్తులకు సంబంధించినది కాదని, ఇది వరకే సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తుల మధ్య కేసు అని, వారు ఇద్దరు ఒకరికి ఒకరు తెలిసిన వారేనని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఇది చాలా కఠినమైన కేసు అని అయినప్పటికీ హైకోర్టు తుది తీర్పును చాలా బాగా ఇచ్చిందని కొనియాడింది. అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్‌గా ఉన్న ఓ 30 ఏళ్ల మహిళ తనపై ఫరూఖి లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు పెట్టింది. అయితే, ఈ కేసును తొలిసారి విచారించిన కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50వేల ఫైన్ వేయగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసుపై ఆ మహిళ తరుపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, ఆరోపణలు చేసిన తర్వాత కూడా డైరెక్టర్ ఫరూఖికి సదరు మహిళ ఓ మెయిల్ పంపిందని, అందులో ‘ఐలవ్ యూ’ అంటూ ఆయనకు చెప్పిందనే విషయాన్ని ఫరూఖి తరుపు న్యాయవాది సుప్రీంకోర్టుకు ఆధారాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కోర్టు ఆ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చి ఆమె తరుపు న్యాయవాదిని ప్రశ్నిస్తూ ‘మీరు ఎన్నో కేసులు వాధించారు. కానీ, బాధితురాలు ‘ఐలవ్ యూ’ చెప్పిన సంఘటనలు ఎన్ని జరిగాయి’ అని అడిగింది. దీనికి బదులిచ్చిన ఆయన తన ఫిటిషనర్ గతంలోనే ఫరూఖికి మంచి స్నేహితురాలు అని, వారు మంచి స్నేహితులు అని ఆయనపై ఎంతో నమ్మకం ఆమెకు అని చెప్పారు. అనంతరం ఫరూఖిని పిటిషనర్ ఎన్నిసార్లు కలిసి మద్యం సేవించింది అని మరో ప్రశ్న వేయగా బహుశా రెండుసార్లు అని, ఒకసారి మాత్రం ఒకరికొకరు ముద్దులు కూడ పెట్టుకున్నారని చెప్పారు. అనంతరం కాసేపు వాదనలు జరిగిన తర్వాత తాము హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నామని ఫరూఖిని నిర్దోషిగా మరోమారు ప్రకటించింది. -
దర్శకుడికి ఊరట: రేప్ కేసులో శిక్ష కొట్టివేత
న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం ‘పీప్లీ లైవ్’ కో–డైరెక్టర్ మహ్మూద్ ఫరూఖీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 2015లో ఓ అమెరికా పరిశోధకురాలి(30)పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను కొట్టివేసింది. అలాగే రూ.50 వేల జరిమానానూ రద్దు చేసింది. బాధితురాలి వాంగ్మూలం విశ్వసనీయంగా లేదన్న జడ్జి జస్టిస్ అశుతోష్ కుమార్ ఫరూఖీపై నమోదైన అభియోగాలను సంశయలాభం కింద కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహిళల ప్రవర్తన ప్రకారం భాగస్వామితో అస్పష్టంగా శృంగా రం వద్దు అంటే దానర్థం కావాలని కూడా కావచ్చు. లైంగిక చర్యలో మహిళలు వద్దు అనడం, సంకోచం, అయిష్టత చూపడం వంటివి వారి అంగీకారానికి సూచన కాదు. మహిళలు నిశ్చయాత్మకంగా, స్పష్టంగా తమ సమ్మతి తెలిపినప్పుడే వారు అంగీకరించినట్లు. ఇద్దరూ ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నప్పుడు, విద్యావంతులైనప్పుడు, గతంలో శారీరక సంబంధం కలిగి ఉన్నప్పుడు.. లైంగిక చర్యకు మహిళ వద్దు అని అస్పష్టం గా చెబితే దానిని అసమ్మతిగా పరిగణించడం చాలా కష్టమవుతుంది. లైంగిక చర్యల్లో పాల్గొనే మహిళల్లో చాలామంది చేతల ద్వారానే తమ సమ్మతిని తెలియజేస్తారని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఫిర్యాదిపై లైంగికదాడి జరిగిందా? ఒకవేళ నిజంగా జరిగితే ఆమె అంగీకారం లేకుండానే జరిగిందా? తనతో శృంగారం ఫిర్యాదికి ఇష్టం లేదని నిందితుడికి స్పష్టంగా అర్థమైందా? అన్న విషయాల్లో వాస్తవాలు ఇద్దరికే తెలుసు’ అని తీర్పులో జస్టిస్ కుమార్ పేర్కొన్నారు. -
రేప్ కేసులో కో డైరెక్టర్‌కు విముక్తి!
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా పౌరురాలిపై అత్యాచారం జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'పీప్లీ లైవ్' సినిమా సహ దర్శకుడు మహమూద్ ఫరుఖీకి ఢిల్లీ హైకోర్టులో విముక్తి లభించింది. ఈ రేప్ కేసులో ఆయనను నిర్దోషిగా హైకోర్టు తేల్చింది. ఈ కేసులో కింది కోర్టు ఆయనకు విధించిన ఏడేళ్ల జైలుశిక్షను హైకోర్టు కొట్టివేసింది. భారత సంతతికి చెందిన అమెరికా పౌరురాలు ఫిర్యాదు మేరకు జూన్ 19, 2015న ఢిల్లీ పోలీసులు ఫరూఖీపై కేసు నమోదు చేశారు. కొలంబియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని అయిన సదరు మహిళ 2015 మార్చి 28న సుఖ్‌దేవ్ విహార్‌లోని నివాసంలో ఫరూఖీ తనపై అత్యాచారం జరిపాడని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే, సంశయలాభం కింద ఢిల్లీ హైకోర్టు ఈ అభియోగాలను కొట్టివేయడంతో ఫరూఖీకి విముక్తి లభించింది. -
డిన్నర్‌కు పిలిచి నమ్మకద్రోహం చేశాడు!
న్యూఢిల్లీ: అమెరికా మహిళపై అత్యాచారం కేసులో ‘పీప్లి లైవ్’ సినిమా కో-డైరెక్టర్ మహమూద్ ఫారుఖీకి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. కొలంబియా యూనివర్సిటీకి చెందిన 35 ఏళ్ల మహిళను ఫారుఖీ రేప్ చేసినట్టు అభియోగాలు రుజువయ్యాయి. దీంతో ఢిల్లీ కోర్టు గురువారం ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఒక స్నేహితుడి తరహాలో విదేశీ మహిళను డిన్నర్‌కు పిలిచిన ఫారుఖీ.. ఆ తర్వాత నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని, ఆమెపై అత్యాచారం జరిపిన ఆయనకు జీవితఖైదు విధించాలని ప్రాసిక్యూషన్ లాయర్ కోర్టును కోరారు. గత మంగళవారం ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్ల వాదనలు విన్న అడిషనల్ సెషన్స్ జడ్జి సంజీవ్ జైన్.. దోషికి శిక్ష విధింపును గురువారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చిలో ఆమెపై ఢిల్లీలో ఫారుఖీ అత్యాచారానికి పాల్పడ్డాడు. కొలంబియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అయిన బాధితురాలు.. రీసెర్చ్ పనిమీద తాను ఫారుఖీని కలిశానని, ఆ తర్వాత 2015 మార్చి 28న తన ఇంటికి డిన్నర్ కోసం అని పిలిచి.. తనపై అత్యాచారం అతను జరిపాడని పోలీసులకు తెలిపింది. ఈ కేసులో తాను అమాయకుడినని ఫారుఖీ వాదించాడు. అయితే, గత నెల ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. రైతు ఆత్మహత్యలపై తెరకెక్కిన సెటైరికల్ మూవీ ‘పీప్లిలైవ్’కు ఫారుఖీ సహా దర్శకుడిగా వ్యవహరించగా.. ఆయన భార్య అనూష రిజ్వీ ఈ సినిమాకు దర్శకురాలు. -
దర్శకురాలి భర్తకి జీవితఖైదు!
న్యూఢిల్లీ: అమెరికా మహిళపై అత్యాచారం కేసులో ‘పీప్లి లైవ్’ సినిమా సహా దర్శకుడు మహమూద్ ఫారుఖీకి జీవితఖైదు విధించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఫారుఖీని ఇప్పటికే దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. నిందితుడికి ఈ నెల 4న శిక్ష విధించనున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సంజీవ్ జైన్ తెలిపారు. దోషిగా తేలిన ఫారుఖీకి శిక్ష విధింపుపై మంగళవారం కోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లు తమ వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసుల తరఫున ప్రాసిక్యూషన్ లాయర్ వాదనలు వినిపిస్తూ దోషికి గరిష్ట శిక్ష అయిన జీవితఖైదు విధించాలని జడ్జిని కోరారు. గత ఏడాది మార్చిలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ లైంగిక దాడి ఘటన జరిగింది. తనపై ఫారుఖీ అత్యాచారం జరిపినట్టు కొలంబియా యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ అయిన 35 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రీసెర్చ్ పనిమీద తాను ఫారుఖీని కలిశానని, ఆ తర్వాత 2015 మార్చి 28న తన ఇంటికి డిన్నర్ కోసం అని పిలిచి.. తనపై అత్యాచారం జరిపాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ కేసులో తాను అమాయకుడినని ఫారుఖీ పేర్కొన్నాడు. గత నెల ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. రైతు ఆత్మహత్యలపై తెరకెక్కిన సెటైరికల్ మూవీ ‘పీప్లిలైవ్’కు ఫారుఖీ సహ దర్శకుడిగా వ్యవహరించగా.. ఆయన భార్య అనూష రిజ్వీ ఈ సినిమాకు దర్శకురాలు. -
అమెరికన్‌పై రేప్: దోషిగా తేలిన దర్శకుడు
న్యూఢిల్లీ: అమెరికన్ మహిళపై అత్యాచారం కేసులో బాలీవుడ్ దర్శక రచయిత మహమూద్ ఫారూఖీ దోషిగా తేలాడు. ఏడాది విచారణ అనంతరం శనివారం తీర్పు వెల్లడించిన ఢిల్లీ స్థానిక కోర్టు.. రేప్ చేసినట్లు అన్ని ఆధారాలు లభించడంతో ఫారూఖీని దోషిగా నిర్ధారించింది. ఆగస్టు 2న శిక్షను ఖరారుచేయనుంది. బాలీవుడ్ సినిమాల గతిని మార్చిన 'పీప్లీ లైవ్' చిత్రానికి కో-డైరెక్టర్ గా పనిచేసిన ఫారూఖీ.. ఆ సినిమాను రూపొందించిన అనూషా రిజ్వీ భర్త కూడా కావడం గమనార్హం. కేసు నేపథ్యం.. న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ విద్యార్థిని అయిన 34 ఏళ్ల మహిళ.. తన రిసెర్చ్ కోసం 2015లో ఇండియా వచ్చారు. కొన్ని రిఫరెన్సుల కోసం చారిత్రక పరిశోధక రచయిత అయిన మహమూద్ ఫారూఖీని ఆమె కలిశారు. అలా వారి మధ్య పరిచయం ఏర్పడింది. 2015 మార్చి 28న ఫారూఖీ ఇంట్లో(ఢిల్లీ)లో జరిగిన పార్టీకి ఆమె కూడా హజరైంది. అదే రోజు రాత్రి అమెరికన్ మహిళను ఓ గదిలోకి తీసుకెళ్లిన ఫారూఖీ.. ఆమెపై అత్యాచారం చేశాడు. సంఘటన జరిగిన తర్వాత అమెరికా వెళ్లిపోయిన బాధిత మహిళ.. కొంతకాలం ఫారూఖీతో ఉత్తరప్రత్యుత్తరాలు నెరిపింది. ఈ క్రమంలోనే తన తప్పును క్షమించాలంటూ దర్శకుడు ఆమెను వేడుకున్నాడు. తర్వాత ఏమైందోగానీ ఆమె.. రాయబార కార్యాలయం సహకారంతో ఫారూఖీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2015, జూన్ 21న దర్శకుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాదిపాటు సాగిన విచారణలో ఫారూఖీ అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. పరిశోధక రచయిత అయిన ఫారూఖీ.. విలియం డార్లింపుల్ ప్రఖ్యాత రచన 'వైట్ మొఘల్స్' కు సహకారం అందించారు. 'పీప్లీ లైవ్' ప్రమోషన్ సందర్భంగా ఆ సినిమా దర్శకురాలు, తన భార్య అయిన అనూషా రిజ్వీ, నిర్మాత అమీర్ ఖార్ లతో మహమూద్ ఫారూఖీ(ఫైల్ ఫొటో) -
‘ఉనా’ మరో పీప్లీ లైవ్ అవుతోందా?
దాదాపు ఆరేళ్ల క్రితం.. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఓ సినిమా నిర్మించారు. అంతా చిన్న చిన్న నటులతోనే వచ్చిన ఆ సినిమా పేరు ‘పీప్లీ లైవ్’. అప్పట్లో అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కష్టాలు తట్టుకోలేక ఇక తనకు చావే శరణ్యం అంటూ ఏదో మాటవరసకి టీ దుకాణం వద్ద ఓ రైతు అన్న మాటలను పట్టుకుని గ్రామీణ విలేకరి చిన్న కథనం రాస్తాడు. ఫలానా రైతు ఆత్మహత్య చేసుకోబోతున్నాడంటూ వచ్చిన ఈ వార్తతో.. ఒక్కసారిగా జాతీయ మీడియా చానళ్లన్నీ ఉలిక్కి పడతాయి. ఆ రైతు ఎవరు, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు.. ఆ ఘటనను తాము లైవ్ కవరేజిలో చూపించాలని వాళ్లు పడే అత్యుత్సాహం నవ్వు పుట్టిస్తుంది. చివరకు ఆ రైతు కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్తున్నా.. అతడి వెంట కెమెరాలు పట్టుకుని పరుగులు పెడతారు. ఇప్పుడు గుజరాత్‌లోని ఉనా గ్రామం మరో పీప్లీ అవుతోంది. ఆవు మాంసం తరలిస్తున్నారని కొంతమంది దళితులను కర్రలతో కొట్టిన ఘటన నేపథ్యంలో రాజకీయ నాయకులు, మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. దళితులపై దాడి అంశం గురించి పార్లమెంటులో వాడివేడి చర్చ జరుగుతున్న సమయంలో ఎంచక్కా ఏసీ గాలికి కునుకు తీసిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మీడియాను వెంటబెట్టుకుని మరీ వెళ్లి బాధితుల కుటుంబాలను పరామర్శించారు. నిరంతరం మోదీ ప్రభుత్వం మీద ఏదో ఒక రూపంలో బురద చల్లడానికే ప్రయత్నాలు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జాతీయ మీడియా సాక్షిగా ఉనా గ్రామానికి వెళ్లి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. పోలీసులు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికే ఆ ఘటనకు సంబంధించి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామంటూ ఇంతకుముందే పోలీసులు ప్రకటించిన విషయం మాత్రం సదరు ముఖ్యమంత్రి గారికి గుర్తుకు రాలేదు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. అప్పటివరకు ఆస్పత్రిలో ఎంచక్కా చికిత్స తీసుకుంటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటున్న బాధితులను ఈ నాయకులు వెళ్లగానే ఒక్కసారిగా వీళ్ల చుట్టూ ఉన్న వందిమాగధులు, వీడియో కెమెరాల వాళ్లు చుట్టుముడతారు. వాళ్ల దగ్గర మైకులు పెట్టి, దాడి ఎలా జరిగిందో చెప్పమంటారు. వాళ్లు నిజంగా లేచి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా లేదా అని కూడా ఈ నాయకులెవరూ చూడటం లేదు. సర్వయ్య అనే వ్యక్తి జంతువుల చర్మం ఒలిచే పని చేస్తుంటాడు. అతడిమీద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయడంతో తలమీద తొమ్మిది కుట్లు పడ్డాయి. అతడిని పరామర్శించడానికి వరుసపెట్టి గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్.. ఇలా అందరూ వెళ్లారు. మీడియాతో మాట్లాడుతుండగా అతడికి ఒక్కసారిగా విపరీతమైన నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. నాయకులు వరుసపెట్టి దండయాత్ర చేయడంతో బాధితులు అసలు విశ్రాంతి తీసుకోడానికి వీలు కుదరడం లేదు. అసలు ముందు జరిగిన దాడి కంటే.. వీళ్లందరి ప్రచార దాడితో వాళ్ల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన కూడా వాళ్ల కుటుంబ సభ్యులలో వ్యక్తమవుతోంది. -
కో డైరెక్టర్ పై రేప్ కేసు.. అరెస్టు
న్యూఢిల్లీ: కామెడీతోపాటు ఆత్మహత్యలు ప్రధానంగా చేసుకొని వచ్చిన 'పీప్లీ లైవ్' చిత్రానికి సహ దర్శకుడిగా పనిచేసిన మహ్మద్ ఫారూకీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై లైంగిక దాడి ఆరోపణలు నమోదయినట్లు పోలీసులు తెలియజేశారు. 35 ఏళ్ల ఓ అమెరికన్ వనితపై ఫారూకీ లైంగిక దాడికి పాల్పడినట్లు ఈకేసులో పేర్కొన్నారు. 2015 మర్చి 28న పీప్లీ లైవ్ కో డైరెక్టర్ అమెరికన్ వనితపై లైంగికదాడికి పాల్పడ్డాడని, జూన్ 19న కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన అతడిని సాకేత్ కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు అతడికి జూలై 6వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న అమెరికన్ మహిళ ఓ పనిపై భారత్ వచ్చిన సమయంలో అతడు ఈ పని చేసినట్లు తెలిసింది. ఈ చిత్రానికి నిర్మాతగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ వ్యవహరించారు. -
పసిడి తవ్వకాలు - ఉన్నవ్ లో 'పీప్లీ లైవ్'
గుప్త నిధుల కోసం వేట, తవ్వకాలు అనే అంశాలతో అంతర్జాతీయ సినిమాతోపాటు, భారతీయ తెరపైన కూడా బోలెడన్న చిత్రాలు రూపోంది.. కనక వర్షాన్ని కురిపించిన సంఘటనలు మనకు తెలిసిందే. నిధులు వేట కథా నేపథ్యంతో హాలీవుడ్ లో రూపొందిన 'మెకనాస్ గోల్డ్', చార్లీ చాప్లిన్ ను ప్రసిద్ధుడిని చేసిన 1925 మూకీ చిత్రం 'గోల్డ్ రష్' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పటికి 'మెకనాస్ గోల్డ్' చిత్రం చూడటానికి ఎందరో కాచుకుచుంటారనేది కాదనలేని వాస్తవం. అలాంటి కథను మైమరిపించే రీతిలో ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నవ్ గ్రామంలో పసిడి వేట దేశ ప్రజలందర్ని ఆకర్షిస్తోంది. ఈ సంఘటనలతో ఉన్నట్టుండి ఉన్నవ్ గ్రామం పరిస్థితులు, వాతావరణంలో ఒక్కసారిగా ఊహించని మార్పుల చోటు చేసుకుంటున్నాయి. ఎప్పడు టెలివిజన్ రేటింగ్ ల కోసం పాకులాడే దేశీయ, అంతర్జాతీయ మీడియా అక్కడ తిష్టవేసుకోవడం నిధుల తవ్వకానికి మరింత ప్రచారాన్ని తీసుకువచ్చింది. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో పక్కా గ్రామీణ వాతావరణం కనిపించే అక్కడ అధునిక వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సంఘటనా స్థలానికి సందర్శకులు, వీఐపీలు తాకిడి ఎక్కువ కావడంతో కొత్తగా షాపులు, హోటళ్లు వెలిసి.. సరికొత్త వాతావారణాన్ని సంతరించుకుంది. స్వామి కల నిజమైతే గ్రామానికి, స్థానికంగా కూడా మంచి జరుగుతుందని ఆ ప్రాంత మహిళలు శివుడి ఆలయంలో పూజలు, ప్రార్ధనలు మొదలెట్టినారట. శివలింగానికి పాలతో పూజలు, అర్చనలు ప్రారంభించారట. ఇలాంటి సంఘటనలు విదేశీ మీడియాను అమితంగా ఆకర్షించడంతో వాళ్లు కూడా లైవ్ లతో పండగ చేసుకుంటున్నారని సమాచారం. ఇదంతా చూస్తుంటే.. ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన పీప్లీ లైవ్ అనే సినిమా తప్పకుండా గుర్తురాక ఉండదు. ఓ గ్రామీణ ప్రాంతంలో రైతు అప్పుల బారిన పడుతాడు. ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని తెలుసుకున్న రైతు.. ఓ టీస్టాల్ వద్ద ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టు చెబుతాడు. ఆ పక్కనే ఉన్న ఓ రిపోర్టర్ కథనాన్ని ప్రచురిస్తాడు. ఆ కథనం మీడియాను ఆకర్షించడంతో దేశీయ, అంతర్జాతీ మీడియా తమ వాహనాలతో అక్కడ హంగామా చేస్తాయి. రైతు ఎప్పుడూ, ఎలా ఆత్మహత్య చేసుకుంటాడనే కోణంలో మీడియా అత్యుత్సాహాంపై 'పీప్లీ లైవ్' సెటైర్ వేసింది. ఇదంతా జరగడం వెనుక ఓ స్వామి కల దాగి ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లా దాండియాఖేరా గ్రామంలో 19వ శతాబ్దానికి చెందిన రాజా రావ్ రామ్‌బక్ష్ సింగ్ నిర్మించిన రాజకోటలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు తాను కలగన్నానని స్వామి శోభన్ సర్కార్ అనే సాధువు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏం జరుగుతుందోనన్న కుతూహలంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. వారిని నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సాధువు కల ఆధారంగానే తవ్వకాలు చేస్తున్నారా అని ప్రశ్నించగా.. ‘ఈ ప్రాంతంలో బంగారం లేదా వెండి ఉండొచ్చని భారత భూగర్భ పరిశోధన విభాగం (జీఎస్ఐ) తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ సాధువు కన్న కల అటు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుండగా.. ఇటు ప్రజల్లో అమితాసక్తిని రేపుతోంది. మరోవైపు దీనిపై రాజకీయ వర్గాలూ మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. నిధుల వేటపై ఉన్న శ్రద్ధ..విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనం తెప్పించడంలో యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు. నిధి మాట దేవుడెరుగు.. మరో నెల రోజులపాటు జరిగే ఈ తంతు మీడియాకే కాకుండా...ఉన్నవ్ గ్రామానికి పండగ వాతావరణంతోపాటు చేతినిండ పని కల్పించింది.