సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా పౌరురాలిపై అత్యాచారం జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'పీప్లీ లైవ్' సినిమా సహ దర్శకుడు మహమూద్ ఫరుఖీకి ఢిల్లీ హైకోర్టులో విముక్తి లభించింది. ఈ రేప్ కేసులో ఆయనను నిర్దోషిగా హైకోర్టు తేల్చింది. ఈ కేసులో కింది కోర్టు ఆయనకు విధించిన ఏడేళ్ల జైలుశిక్షను హైకోర్టు కొట్టివేసింది.
భారత సంతతికి చెందిన అమెరికా పౌరురాలు ఫిర్యాదు మేరకు జూన్ 19, 2015న ఢిల్లీ పోలీసులు ఫరూఖీపై కేసు నమోదు చేశారు. కొలంబియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని అయిన సదరు మహిళ 2015 మార్చి 28న సుఖ్‌దేవ్ విహార్‌లోని నివాసంలో ఫరూఖీ తనపై అత్యాచారం జరిపాడని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే, సంశయలాభం కింద ఢిల్లీ హైకోర్టు ఈ అభియోగాలను కొట్టివేయడంతో ఫరూఖీకి విముక్తి లభించింది.