అమెరికన్పై రేప్: దోషిగా తేలిన దర్శకుడు
న్యూఢిల్లీ: అమెరికన్ మహిళపై అత్యాచారం కేసులో బాలీవుడ్ దర్శక రచయిత మహమూద్ ఫారూఖీ దోషిగా తేలాడు. ఏడాది విచారణ అనంతరం శనివారం తీర్పు వెల్లడించిన ఢిల్లీ స్థానిక కోర్టు.. రేప్ చేసినట్లు అన్ని ఆధారాలు లభించడంతో ఫారూఖీని దోషిగా నిర్ధారించింది. ఆగస్టు 2న శిక్షను ఖరారుచేయనుంది. బాలీవుడ్ సినిమాల గతిని మార్చిన 'పీప్లీ లైవ్' చిత్రానికి కో-డైరెక్టర్ గా పనిచేసిన ఫారూఖీ.. ఆ సినిమాను రూపొందించిన అనూషా రిజ్వీ భర్త కూడా కావడం గమనార్హం.
కేసు నేపథ్యం..
న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ విద్యార్థిని అయిన 34 ఏళ్ల మహిళ.. తన రిసెర్చ్ కోసం 2015లో ఇండియా వచ్చారు. కొన్ని రిఫరెన్సుల కోసం చారిత్రక పరిశోధక రచయిత అయిన మహమూద్ ఫారూఖీని ఆమె కలిశారు. అలా వారి మధ్య పరిచయం ఏర్పడింది. 2015 మార్చి 28న ఫారూఖీ ఇంట్లో(ఢిల్లీ)లో జరిగిన పార్టీకి ఆమె కూడా హజరైంది. అదే రోజు రాత్రి అమెరికన్ మహిళను ఓ గదిలోకి తీసుకెళ్లిన ఫారూఖీ.. ఆమెపై అత్యాచారం చేశాడు.
సంఘటన జరిగిన తర్వాత అమెరికా వెళ్లిపోయిన బాధిత మహిళ.. కొంతకాలం ఫారూఖీతో ఉత్తరప్రత్యుత్తరాలు నెరిపింది. ఈ క్రమంలోనే తన తప్పును క్షమించాలంటూ దర్శకుడు ఆమెను వేడుకున్నాడు. తర్వాత ఏమైందోగానీ ఆమె.. రాయబార కార్యాలయం సహకారంతో ఫారూఖీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2015, జూన్ 21న దర్శకుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాదిపాటు సాగిన విచారణలో ఫారూఖీ అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. పరిశోధక రచయిత అయిన ఫారూఖీ.. విలియం డార్లింపుల్ ప్రఖ్యాత రచన 'వైట్ మొఘల్స్' కు సహకారం అందించారు.
'పీప్లీ లైవ్' ప్రమోషన్ సందర్భంగా ఆ సినిమా దర్శకురాలు, తన భార్య అయిన అనూషా రిజ్వీ, నిర్మాత అమీర్ ఖార్ లతో మహమూద్ ఫారూఖీ(ఫైల్ ఫొటో)