
న్యూఢిల్లీ : ఓ అత్యాచార కేసులో వాదనల తీర్పు సందర్భంగా ఢిల్లీ న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళల గౌరవ, హక్కులు, ప్రతిష్ట కోసం పోరాటాలు చేసే వాళ్లు.. మరి మగవాళ్ల విషయంలో ఆ పని ఎందుకు చెయ్యరంటూ ప్రశ్నించింది.
‘‘ఇక ఇప్పుడు మగవాళ్ల కోసం పోరాడాల్సిన తరుణం వచ్చేసింది’’ అని పోస్కో యాక్ట్ కోర్టు న్యాయమూర్తి నివేదిత అనిల్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల క్రితం నమోదైన ఓ అత్యాచార కేసులో నిందితుడి నిర్దోషిగా రుజువు కావటంతో కోర్టు అతన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీర్పునిస్తూ... అత్యాచార కేసుల్లో చేసే తప్పుడు ఆరోపణలు మగవారికి చాలా నష్టం చేకూరుస్తున్నాయన్నారు. కొందరు మహిళలు తమకు రక్షణగా ఉన్న చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె చెప్పారు. వాటిని (ఆరోపణలు) ఎదుర్కుని.. తమ నిర్దోషిత్వం నిరూపించుకుని బయటకు వచ్చినప్పటికీ.. సమాజం దృష్టిలో మాత్రం అతనిపై అత్యాచార ఆరోపితుడిగానే ముద్ర పడిపోతుందని.. ఆ అవమానం అతను జీవితాంతం మోస్తున్నాడని ఆమె అన్నారు.
మహిళ అత్యాచారానికి గురైన సమయంలో ఆమెకు అండగా ప్రజలు, మహిళా సంఘాలు పోరాటాలు చేస్తుంటాయి. నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తుంటాయి. అలాంటి కేసుల్లో బాధిత వ్యక్తి అమాయకుడని ఆధారాలు ఉన్నప్పుడు వారు మౌనంగా ఎందుకు ఉంటున్నారు? మద్దతుగా ఎందుకు నిలవటం లేదు? అని ప్రశ్నించారు. మగవారి గౌరవ, మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని, మహిళా సంఘాలు కూడా అందుకు ముందుకు రావాలని.. అవసరమైతే న్యాయస్థానాలు జోక్యం కల్పించుకుని బాధిత వ్యక్తులకు పరిహారం ఇప్పించేలా చూడాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 18, 1997న పట్టపగలే ఇంట్లో ఒంటరిగా ఉన్న తనను అపహరించి మరీ అత్యాచారం చేశాడంటూ ఓ మైనర్ ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, పైగా మెడికల్ నివేదికలు కూడా ఆమెపై లైంగిక దాడి జరగలేదనే తేల్చాయి. దీంతో అతన్ని నిరపరాధిగా తేలుస్తూ న్యాయస్థానం విడుదల లభించింది.
Comments
Please login to add a commentAdd a comment