అనుకున్నదొక్కటి.. అయ్యో రాహుల్!
ఉనా: పార్లమెంటులో కాస్తా తల ముందుకువాల్చి.. కళ్లు మూసి రిలాక్స్ అవుతున్నట్టు కెమెరాకు రాహుల్‌గాంధీ చిక్కడం పెద్ద వివాదమే రేపింది. దళితులపై దాడి అంశం మీద లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతుండగా.. అదేమీ పట్టనట్టు రాహుల్ కునుకు తీశారని విపక్షాలు విరుచుకుపడ్డాయి. సహజంగానే ఇరుకునపడ్డ కాంగ్రెస్ పార్టీ తమ ఉపాధ్యక్షుడిని వెనకేసుకొచ్చేందుకు తంటాలు పడింది. రాహుల్ పడుకోలేదని, రిలాక్స్ అయినట్టు పేర్కొంది.
ఈ వివాదం జరిగిన వెంటనే రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటన చేపట్టారు. గుజరాత్‌లోని ఉనాలో చనిపోయిన ఆవు చర్మం వలిచారని దళిత యువకులపై గోరక్షక దళాలు దాడి చేశారు. వారి బట్టలూడదీసి కారుకు కట్టేసి.. కిరాతకంగా కొట్టారు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగా రాహుల్ పడుకున్నారని విమర్శలు రావడంతో వాటిని తిప్పికొట్టడానికి (?) ఆ వెంటనే ఆయన ఉనాకు చేరుకొని దళిత యువకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఓ దళిత మహిళను ఆయన ఆలింగనం చేసుకొని పరామర్శించారు.
నిజానికి ఆమె బాధిత దళిత యువకులకు బంధువు కాదు. వారితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. 55 ఏళ్ల ఆ మహిళకు క్రిమినల్ రికార్డు కూడా ఉంది. బలవంతపు వసూళ్లు, అల్లర్లకు పాల్పడిన నేరచరిత్ర ఉంది. బాధితులను పరామర్శించడానికి ఆమె ఆస్పత్రికి వచ్చిందట. కానీ, ఆమె నకిలీ పేరుతో ఆస్పత్రిలోకి వచ్చినట్టు తర్వాత తేలింది. అయితే, రాహుల్ మాత్రం ఆమెను బాధితుల బంధువు అనుకొని ఆలింగనం చేసుకొని ఏకంగా పరామర్శ కూడా చేశారు. ఇది కూడా రాహుల్‌కు బ్యాక్‌ఫైర్ అయింది. ఈ విషయంలోనూ ఆయనను విమర్శలు వెంటాడుతున్నాయి. ‘రాహుల్‌గాంధీ ఏం చేసినా ఇలాగే అవుతుంది. ఆయన తీరే అంతా. ఆయన ప్రతిసారి సొంత పార్టీని ఇరకాటంలో నెడుతుంటారు’ అని బీజేపీ అధికార ప్రతినిధి రాజు ధ్రువ్ పేర్కొన్నారు.