
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందన
అహ్మదాబాద్: కొందరు కాంగ్రెస్ నేతలు.. బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల ఆ పార్టీకి కలిసొచ్చే ఏమీ లేదని, వాళ్లని వారే ట్రోల్ చేసుకుంటున్నారంటూ గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల్లా విమర్శించారు. ‘ రాహుల్ గాంధీ మిమ్మల్ని మీరే ట్రోల్ చేసుకుంటున్నారు. మీ పార్టీని కూడా బానే ట్రోల్ చేస్తున్నారు.
ఆయన్ని ఆయన అద్దంలో చూసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ గుజరాత్ లో గెలవలేకపోతుందనే అసహనం. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వివాహాల్లో గుర్రాల చేత డ్యాన్స్ చేయించే వారి మాదిరిగా ఉన్నారని, మరి కొంతమంది పోటీల్లో పరుగెత్తే పెళ్లి గుర్రాల్లా ఉన్నారని రాహుల్ అంటున్నారు. అంటే మీ పార్టీ కార్యకర్తలు జంతువులా? అని ప్రశ్నించారు షెహజాద్. కనీసం మీ పార్టీ కార్యకర్తల్ని మనుషుల మాదిరి చూడండి.. అంతే కానీ వారిని గుర్రాలతో పోలుస్తారా? అంటూ నిలదీశారు.
కాగా, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్‌లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు’ అని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు.