
ముంబై : గతేడాది జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తాను కలసి ఉంటే బీజేపీ గెలవకపోయుండేదని పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ శనివారం వ్యాఖ్యానించారు. ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను రాహుల్‌ను కలవలేదు. మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, ఉద్ధవ్ ఠాక్రేలతో నేను భేటీ అయ్యాను. రాహుల్ గాంధీని కలిసినా సమస్యేమీ ఉండేది కాదు.
ఆయనను కలసి మాట్లాడకపోవడం నా తప్పే. ఆ తప్పు జరగకుండా ఉండి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యం వచ్చి ప్రభుత్వంలో ఉండేది. బీజేపీ ఓడిపోయేది’అని హార్దిక్ అన్నారు. 2014లో తాము కూడా మోదీకే ఓటేశామనీ, ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధర తదితర మంచి పనులన్నీ జరుగుతాయనీ ఆశించామనీ, కానీ అవన్నీ అడియాసలయ్యాయన్నారు. విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం దేశంలో అనేక మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వలస వెళ్లి రాత్రికిరాత్రి ఐశ్వర్యవంతులయ్యారని అన్నారు.