సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. బీజేపీ విజయం సాధించినా.. నైతిక విజయం మాత్రం కాంగ్రెస్‌దేనని ఆయన చెప్పారు. విశ్లేషకులు, మీడియా ఊహకు అందని రీతిలో కాంగ్రెస్ సీట్లను కైవసం చేసుకుందని రాహుల్ హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... మోదీ మోడల్ అన్నది ఓ ప్రచార స్టంట్‌గానే మిగిపోయిందన్నారు. ‘‘బీజేపీ వెన్నులో వణుకు పుట్టించాం. మేం బాగా పుంజుకున్నాం. మూడు, నాలుగు నెలల క్రితం గుజరాత్‌కు మేం వెళ్లే ముందు కొందరు మా పార్టీని అవహేళన చేశారు. పది స్థానాల్లో కూడా గెలవలేదంటూ జోస్యం చెప్పారు. కానీ, మా కఠోర శ్రమ పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టింది. ఈ ఫలితాలు బీజేపీకి పెద్ద దెబ్బ’’ అని రాహుల్ తెలిపారు.
ఈ ఫలితంతో ప్రధాని మోదీ సామర్థ్యంపైనే ఇప్పుడు అనుమానాలు మొదలు అయ్యాయని రాహుల్ చెప్పుకొచ్చారు. ప్రచారంలో మోదీ అభివృద్ధి గురించి ఒక్క మాటా మాట్లాడలేదని... కానీ, ఇప్పుడు గెలిచాక అభివృద్ధి వల్లే తాము గెలిచామంటూ చెప్పుకుంటున్నారన్నారు. ఈ లెక్కన మోదీ విశ్వసనీయత కోల్పోయినట్లేనని రాహుల్ పేర్కొన్నారు. తమ పార్టీపై, ప్రచారంపై వ్యాఖ్యలు చేసేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పరోక్షంగా విమర్శకులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ ప్రజలు తనకు ఎంతో ప్రేమను పంచారని.. అవసరమైనప్పుడు రాష్ట్రానికి తన సేవలు అందిస్తానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment