cow vigilantism
-
యోగి రాజ్యంలో మరో ఉన్మాదం
ఈమధ్య దాదాపు చడీచప్పుడూ లేదనుకున్న గోరక్షక ముఠా మళ్లీ జూలు విదిల్చింది. ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ సమీప గ్రామంలో సోమవారం ఆవు కళేబరాలు కనిపించడంతో రెచ్చిపోయి పోలీస్ ఇన్స్పెక్టర్పై దాడి చేసి హతమార్చడమేకాక మరో నలుగురు కానిస్టేబుళ్లను తీవ్రంగా గాయపరిచింది. పోలీస్ ఔట్పోస్టుతో పాటు పలు వాహనాలకు కూడా నిప్పెట్టింది. తిండి పేరు చెప్పి, మతం పేరు చెప్పి, గోరక్షణ పేరు చెప్పి హత్యలు జరగడమే తప్ప, ఆ ఉదంతాల్లో హంత కులకు శిక్ష పడిన దాఖలాలు కనబడని యోగి ఆదిత్యనాథ్ రాజ్యంలో చివరకు పోలీసు ప్రాణాలకు కూడా భరోసా లేదని తాజా ఉదంతం నిరూపిస్తోంది. ఇంతక్రితం జరిగిన ఘటనలకూ, ఇప్పుడు జరిగినదానికీ కొంత వ్యత్యాసం ఉంది. మిగిలిన ఉదంతాలన్నిటిలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమో లేక ఘటన జరిగిన తర్వాత అక్కడికి రావడమో మాత్రమే జరిగేది. కానీ బులం ద్షహర్ సమీపాన జరిగిన ఉదంతంలో మూక పోలీస్ ఔట్‌పోస్టు ముట్టడించినప్పుడు ఇన్స్పెక్టర్ సుబోద్‌కుమార్ చొరవ తీసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అందుకు కారణం ఉంది. అంత కంతకు జనం పెరగడం, ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకూ కదలబోమని రహదారిపై బైఠాయించడం వల్ల అది శాంతిభద్రతల సమస్యగా మారొచ్చునని ఆయన అంచనా వేశారు. ఇదే ఆయన ప్రాణా లమీదకు తెచ్చింది. రాళ్ల దాడిలో గాయపడిన సుబో«ద్‌ను ఆసుపత్రికి తరలించేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తుండగా ఉన్మాద మూక ఆయన్ను గురిచూసి కాల్చి చంపింది. మరో యువకుడు కూడా బుల్లెట్ గాయాలతో మరణించాడు. అతని ప్రాణం తీసిన బుల్లెట్ ఎవరిదో తేలాల్సి ఉంది. పోలీ సులు నలుగురిని అరెస్టు చేయగా, సూత్రధారిగా భావిస్తున్న బజరంగ్దళ్ స్థానిక నాయకుడు పరారీలో ఉన్నాడు. ఆవు కళేబరాలు కనబడటం మొదలుకొని ఇన్స్పెక్టర్ హత్య, విధ్వంసం వరకూ గమనిస్తే ఇదంతా ఒక పథకం ప్రకారం చేసినట్టు కనబడుతుంది. ఘటన జరిగిన ప్రాంతానికి 50 కిలో మీటర్ల దూరంలో, అదే జిల్లాలో ముస్లింల మతపరమైన కార్యక్రమం వరసగా మూడురోజులు జరిగి ఆరోజే పూర్తయింది. బులంద్‌షహర్ జిల్లా, దాని పొరుగునున్న అలీగఢ్, మీరట్, ముజఫర్‌నగర్ తదితర జిల్లాలు మతపరమైన ఘర్షణలకు పెట్టింది పేరు. అలాంటిచోట ఉన్నట్టుండి కళేబరాలు కనబడటం, దానిపై ఇంత భారీయెత్తున హింస, విధ్వంసం చోటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తున్నది. నేర ప్రపంచాన్ని అణిచేయడానికి కంకణం కట్టుకున్నానని చెప్పి ఎన్కౌంటర్ల పరంపర కొనసాగిస్తున్న యోగి ప్రభుత్వం నిద్రపోయిందో, కావాలని దీన్ని ఉపేక్షించిందో తెలియదు. ఉన్మాద మూకకు కళేబరాలు దొరకడం ఒక సాకు మాత్రమే. గతంలో ఇంట్లో ఆవు మాంసం ఉందని వదంతులు సృష్టించి దాద్రిలో అఖ్లాక్ అనే వ్యక్తిని కొట్టి చంపిన కేసును తన సోదరుడే దర్యాప్తు చేశాడని ఇన్స్పెక్టర్ సోదరి చెబుతున్నారు. ఆ కేసు దర్యాప్తులో ఒత్తిళ్లకు లొంగనందుకే ఇప్పుడు పొట్టనబెట్టుకున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇందులో ఆయన సహచరుల పాత్ర కూడా ఉన్నదని అనుమానిస్తున్నారు. ఆమె సందేహాలు కొట్టిపారేయదగ్గవి కాదు. ఉత్తరప్రదేశ్ చట్టం ప్రకారం ఆవును చంపడం నేరం. నిజంగా గోరక్షణ కోసం పాటుబడేవారు ఆ చట్టం కింద కేసు నమోదు చేయమని కోరవచ్చు. అక్కడున్నది బీజేపీ సర్కారే తప్ప వేరే పార్టీ ప్రభుత్వం కాదు. అందుకు భిన్నంగా అనవసర ఆవేశాన్ని ప్రదర్శించి, దాన్ని ఉన్మాద స్థాయికి తీసుకుపోయి హింసకు పాల్పడటం ఏ ప్రయోజనాన్ని ఆశించి అనుకోవాలి? మతపరమైన ఘర్షణలు చెలరేగడానికి ఆస్కారమున్నచోట ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంతగా చేష్టలుడిగిపోవడం దిగ్భ్రాంతికరం. దాదాపు నాలుగేళ్లుగా గోరక్షణ పేరిట సాగుతున్న దాడుల వెనక సంఘ్ పరివార్ సంస్థలకు చెందినవారిపైనే ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నవారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలే. వదంతుల్ని నమ్మి, ఉన్మాదం ప్రకోపించి మూకలు ఈ దాడులకు పాల్పడుతున్నట్టు కనిపిస్తున్నా వీటిని అరికట్టడానికి ఇంతవరకూ పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జార్ఖండ్‌లో నిరుడు పశు మాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో వందమంది గుంపు అన్సారీ అనే యువకుణ్ణి కొట్టి చంపాక ఆ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారించి ఒక బీజేపీ సభ్యుడితోపాటు 8మందికి యావజ్జీవ శిక్ష విధించింది. అటుతర్వాత వారంతా హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. వారికి బెయిల్ లభించింది. ఈ తరహా ఉన్మాద మూకలను నియంత్రించడానికి పటిష్టమైన చట్టం తీసుకురావడంపై పార్లమెంటు ఆలోచించాలని గత జూలైలో అప్పటి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని ధర్మాసనం సూచించింది. మూక దాడుల సందర్భంగా ప్రేక్షక పాత్ర వహించే పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లో ఉన్మాద మూకలకు వర్తింప జేయగల 34, 147, 148, 120బీ వంటి అనేక సెక్షన్లు ఉన్నాయి. దుండగానికి ఒడిగట్టే మూకపై నేర స్వభావాన్ని బట్టి హత్య, హత్యాయత్నం, మరణానికి దారితీసిన చర్య, తీవ్రంగా గాయపరచడం వంటి నేరాలతోపాటు ఈ సెక్షన్లను కూడా ప్రయోగించవచ్చు. వీటన్నిటినీ చేర్చి సమగ్ర చట్టం తీసు కొచ్చినా లేక ఈ సెక్షన్లనే నేరుగా వినియోగించుకున్నా ఉన్మాదంతో చెలరేగే ముఠాలకు గట్టి హెచ్చ రికగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఈ రెండింటిలో ఏదీ జరగకపోగా దుండగులకు రాజకీయ ప్రాపకం సులభంగా దొరుకుతోంది. పర్యవసానంగా ఈ విష సంస్కృతి విస్తరిస్తోంది. ఇప్పుడది కర్తవ్యనిష్టతో విధులు నిర్వర్తించిన ఒక పోలీసు అధికారినే పొట్టనబెట్టుకుంది. కనీసం ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదిలి మూకదాడుల విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోతే అంత ర్జాతీయంగా మన పరువు మరింతగా దిగజారుతుంది. -
హిందువుపైనే గోరక్షకుల దాడి!
లక్నో: ఒక వైపు మూక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా అలాంటి ఘటనలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ హిందువుపైనే మూక దాడి చోటు చేసుకుంది. బ్రాహ్మణుడైన ఓ వృద్ధుడు తన ఆవును ముస్లింలకు అమ్ముతున్నాడనే అనుమానంతో గోరక్షకులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటన బల్రాంపుర్ జిల్లాలోని లక్ష్మణ్పూర్లో గత ఆగస్టు 31న చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన కైలాష్ నాథ్ శుక్లా(70) అనే బ్రాహ్మణ వృద్దుడు ఆనారోగ్యంతో బాధపడుతున్న తన ఆవును సమీప గ్రామంలోని వెటర్నరీ డాక్టర్ తీసుకెళ్తున్నాడు. దారి మధ్యలో గోరక్షకుల పేరిట ఓ మూక అతన్ని చుట్టుముట్టింది. తాను హిందువునని, బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడనని చెప్పినా పట్టించుకోకుండా కొంత మంది అతనిపై దాడి చేశారు. అంతేకాకుండా అతని మొహానికి మసి పూసి కొట్టుకుంటూ ఉరేగించారు. ఎవరైనా ఆవులను అమ్మినా, వాటిని బాధపెట్టినా వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. అనంతరం ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. తొలుత అతని ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు. అనంతరం ఈ ఘటన గురించి స్వయంగా తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాజేశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు తీసుకోని అధికారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. -
మూకహత్యలపై హైలెవల్ కమిటీ
న్యూఢిల్లీ/జైపూర్: దేశంలో పెరిగిపోతున్న మూకహత్యలను నియంత్రించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇందులోభాగంగా ఈ హత్యల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సలహాలిచ్చేందుకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల్ని పరిశీలించేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం(జీవోఎం)ను ఏర్పాటు చేసింది. రాజీవ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీలో న్యాయశాఖ, శాసన విభాగం, సామాజిక న్యాయం–సాధికారత విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. జీవోఎంలో విదేశాంగ శాఖ, న్యాయ శాఖ, రవాణా శాఖ, జలవనరుల శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా తన నివేదికను జీవోఎంకు సమర్పిస్తుంది. మూకహత్యల నియంత్రణపై ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సుల్ని జీవోఎం అధ్యయనం చేసి తుది నివేదికను ప్రధానికి అందజేస్తుంది. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమనీ, కాబట్టి నేరాలను అదుపు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకహత్యల ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. జూలై 20న ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో రాజస్తాన్‌లోని ఆల్వార్‌లో అక్బర్(28) అనే ముస్లిం యువకుడ్ని గోరక్షక ముఠా కొట్టింది. ఈ దాడి తర్వాత కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అక్బర్‌ను 6 కి.మీ దూరంలోని ఆస్పత్రికి పోలీసులు మూడు గంటల తర్వాత తీసుకెళ్లారనీ, మార్గమధ్యంలో టీ తాగారనీ వార్తలొచ్చాయి. దీంతో ఈ ఘటనపై నివేదిక అందజేయాలని రాజస్తాన్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. కాగా, ఆల్వార్ మూకహత్య విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ఒకరు లోక్‌సభలో ప్రస్తావించగా, బీజేపీ ఎంపీలందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు ఆళ్వార్ పోలీసుల అలసత్వం విషయమై విచారణ జరిపేందుకు రాజస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక డీజీపీ ఎన్ఆర్కే రెడ్డి నేతృత్వంలో నలుగురు సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గోరక్షక ముఠాల ఆగడాలను అరికట్టడానికి అన్నిరాష్ట్రాలకు ఇప్పటికే మార్గదర్శకాలను జారీచేశామని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మానవత్వం స్థానంలో విద్వేషం.. ఆల్వార్ మూకహత్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రధాని లక్ష్యంగా విరుచుకుపడ్డారు. మోదీ క్రూర భారత్‌లో మానవత్వం స్థానాన్ని విద్వేషం ఆక్రమించుకుందని విమర్శించారు. ‘గోరక్షక ముఠా బాధితుడు అక్బర్ అలియాస్ రక్బర్ ఖాన్‌ను ఆరు కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి తరలించడానికి ఆల్వార్ పోలీసులకు 3 గంటలు ఎందుకు పట్టింది? వాళ్లు బాధితుడ్ని ఆస్పత్రికి తరలించకుండా టీ తాగుతూ కూర్చున్నారు. మానవత్వం స్థానాన్ని విద్వేషం ఆక్రమించుకున్న మోదీ సరికొత్త క్రూర భారతం ఇదే’ అని ట్విట్టర్లో మండిపడ్డారు. మరోవైపు కేంద్ర మంత్రి గోయల్ రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘నేరం జరిగిన ప్రతిసారీ ఆనందంతో గంతులు వేయడం ఆపు రాహుల్. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాజకీయ లబ్ధి కోసం సమాజాన్ని ఇష్టానుసారం విభజించే మీరు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. మీరొక విద్వేష వ్యాపారి’ అని ఘాటుగా విమర్శించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే: కమిటీ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అక్బర్ చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రాజస్తాన్ ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ మీడియాకు తెలిపింది. బాధితుడి గాయాల తీవ్రతను అంచనా వేయడంలో విఫలమైన పోలీసులు తొలుత ఆస్పత్రికి తరలించకుండా, పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంతో అతను చనిపోయినట్లు ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ప్రత్యేక డీజీపీ ఎన్ఆర్కే రెడ్డి వెల్లడించారు. పోలీసుల కస్టడీలో దెబ్బల కారణంగా చనిపోయాడన్న ఆరోపణల్ని ఖండించారు. అల్వార్‌లో జరిగిందిదీ హరియాణాకు చెందిన అక్బర్, అస్లామ్‌లు రాజస్తాన్‌లో ఆవుల్ని కొనుగోలు చేసి తమ గ్రామానికి జూలై 20న తీసుకెళ్తున్నారు. ఆల్వార్‌లోని లాలావండి గ్రామ సమీపానికి రాగానే వీరిని ఆవుల స్మగ్లర్లుగా భావించిన గోరక్షక ముఠా విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో అక్బర్(28) దుండగుల చేతిలో చిక్కుకోగా, అస్లామ్ తప్పించుకున్నాడు. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) రామ్‌గఢ్ గోరక్ష విభాగం చీఫ్ కిశోర్ పోలీసులకు ఈ ఘటనపై సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అక్బర్‌ను తొలుత ఆస్పత్రికి తరలించకుండా గోవుల్ని గోశాలకు తరలించడంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత బాధితుడ్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వాంగ్మూలం నమోదుచేసి ఆస్పత్రికి తరలించారు. బాధితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లే దారిలో పోలీస్ అధికారులు జీప్ నిలిపివేసి టీ కూడా తాగారు. చివరికి 6 కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి మూడు గంటలు ఆలస్యంగా జూలై 21న ఉదయం 4 గంటలకు తీసుకెళ్లడంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అక్బర్‌ను గోరక్షక ముఠా హత్యచేసిందో, పోలీసులు కొట్టిచంపారో జ్యుడీషియల్ విచారణ జరపాలని రామ్‌గఢ్ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహుజా డిమాండ్ చేశారు. -
గోమాతకేనా రక్షణ.. మాతృమూర్తికి లేదా?
ముంబై : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై శివసేన మరోసారి నిప్పులు చెరిగింది. గోవుల సంరక్షణ పేరుతో దేశంలో జరుగుతున్న గుంపు దాడులు, మూక హత్యలు, మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే మహిళలకు ఏమాత్రం భద్రత లేని దేశంగా ఇండియా మారుతోందని, ఇది సిగ్గు చేటని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ‘గోమాతలను(ఆవులను) రక్షించుకోవడం మంచిదే కానీ మాత(మహిళ) సంగతేమిటి? ఇదేనా హిందుత్వం? ఇలాంటి వారు హిందువులే కాదు’ అని పార్టీ పత్రిక ‘సామ్నా’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘మేము ప్రభుత్వంలో భాగస్వామ్యులమే. కానీ తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం. మేము భారతీయ జనతా(భారత ప్రజల)కు స్నేహితులం. అంతే కానీ ఏ పార్టీకి స్నేహితులం కాదు’ అని బీజేపీని ఉద్దేశించి అన్నారు. దేశంలో మహిళల కంటే ఆవులకే భద్రత ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. గో రక్షణ పేరిట గోవులను కాపాడేదానికంటే బీఫ్ ఎవరు తింటున్నారు, ఎవరు తినడం లేదు అనే దానిపైనే కొంత మంది దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఇదే హిందుత్వం అంటే నేను అంగీకరించను’ అని ఠాక్రే అన్నారు. దేశంలో మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు జాతీయ వాదులు,ఎవరు కాదో నిర్ణయించే హక్కు బీజేపీకి లేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే జాతీయవాదులు కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం(యూపీఏ) చేసిన తప్పిదాలనే ఎన్డీయే ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. -
మూక హింస
-
గోరక్షక్ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
-
ఆ దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కొంత మంది వ్యక్తులు సమూహంగా ఏర్పడి ప్రజలపై దాడిచేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోడానికి వీల్లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దాడులను అరికట్టేందుకు చట్టాన్ని రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఎలాంటి చట్టం చేస్తున్నారో నాలుగు వారాల్లో తమకు నివేదించాలని సుప్రీంకోర్టు కోరింది. ప్రజల హక్కులకు భంగం కలిగించే చర్యలను నివారించడానికి ప్రతి జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని గతంలోనే రాష్ట్రాలను ఆదేశించినట్లు న్యాయస్థానం గుర్తుచేసింది. రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు గోరక్షణ పేరుతో జరగుతున్న దాడులను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తమకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. సమాజంలో హింసకు తావులేదన్న ప్రధాన న్యాయమూర్తి తదుపరి విచారణను ఆగస్ట్ 28కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
గోరక్షకులకు సుప్రీం వార్నింగ్
న్యూఢిల్లీ : గోరక్షణ పేరిట చట్టాన్ని ఎవరు చేతులోకి తీసుకోవద్దని మంగళవారం సుప్రీం కోర్టు మరోసారి హెచ్చరించింది. గోరక్షణతో హింసాత్మక ఘటనలు చెలరేగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఇక గతేడాది నవంబర్లోనే ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఈ హింసకు చెక్ పెట్టాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేయాలని అప్పట్లో ఆదేశించింది. ఓ సీనియర్ పోలీసు అధికారి నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తూ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కూడా తేల్చిచెప్పింది. అయితే ఈ తీర్పుకు రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లు కట్టుబడి లేవని జాతిపిత మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వాదనలు విన్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇది లా అండ్ ఆర్డర్ విషయమని, ప్రతి రాష్ట్రం బాధ్యతగా తీసుకోవాలని హెచ్చరించింది. గోరక్షణ పేరుతో దాడులు చేయడం హింసను ప్రేరిపించడమేనని, ఇది క్రైమ్ అని పిటిషనర్ తరపు వాదనలు విన్న ధర్మాసనం.. ఏ ఒక్కరు కూడా చట్టాన్ని చేతులోకి తీసుకోవద్దని, ఈ విషయంలో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
గోరక్షకులపై సుప్రీంకోర్టు ఉక్కుపాదం!
న్యూఢిల్లీ: గో రక్షకుల ఆగడాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు చెక్ పెట్టాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేయాలని బుధవారం ఆదేశించింది. సీనియర్ పోలీసు అధికారి నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తూ వారంలోగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని తేల్చిచెప్పింది. గో రక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై అరాచకాలు, హింసాత్మక దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్ ఎస్ పూనావాలా గత ఏడాది అక్టోబర్ 21న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. దీనిపై ప్రతిస్పందన తెలియజేయాలని ఆరు రాష్ట్రాలను ఆదేశించింది. గత జూలై 21న వాదనల సందర్భంగా దాడులకు దిగుతున్న గో రక్షకులను కాపాడాలని చూడొద్దని, గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలేమిటో తెలుపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజా విచారణ సందర్భంగా గో రక్షణ దాడులకు వ్యతిరేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలకు ఏడురోజుల గడువు ఇచ్చింది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించవద్దని, గోరక్షణ దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. -
గోరక్షకులపై మరోసారి మోదీ ఫైర్!
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ న్యూఢిల్లీ: గో రక్షణ పేరిట దాడులకు తెగబడుతున్న మూకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దంటూ ఆయన తేల్చిచెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో గోరక్షక దాడులపై ఆయన మరోసారి స్పందించారు. 'గో రక్షణ పేరిట చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. ఏ వ్యక్తి కానీ, గ్రూప్ కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు' అని ప్రధాని మోదీని ఉటంకిస్తూ కేంద్రమంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్షం భేటీ అనంతరం ప్రధాని మోదీ, బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోరక్షణ పేరిట దాడులు, కొట్టిచంపడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈమేరకు త్రీవంగా స్పందించారు. గోరక్షణ పేరుతో హింసాత్మక దాడులకు తెగబడుతున్న వారిపై ప్రధాని మోదీ గతంలోనూ మండిపడ్డ సంగతి తెలిసిందే. ‘గో (ఆవుల) భక్తి పేరిట ప్రజలను చంపడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. ఇలాంటి చర్యలను మహాత్మాగాంధీ ఎంతమాత్రం ఆమోందించి ఉండేవారు కాదు. అహింసకు నెలవైన నేల మనది. మహాత్మాగాంధీ పుట్టిన నేల మనది. ఈ విషయాన్ని ఎందుకు మరిచిపోతున్నారు? చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారం ఈ దేశంలోకి ఎవరికీ లేదు' అంటూ గుజరాత్ పర్యటన సందర్భంగా మోదీ స్వయంప్రకటిత గోరక్షకులకు వ్యతిరేకంగా గట్టి సందేశాన్ని ఇచ్చారు. -
గోరక్షకులకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!
అహ్మదాబాద్: గోరక్షణ పేరుతో హింసాత్మక దాడులకు తెగబడుతున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. ‘గో (ఆవుల) భక్తి పేరిట ప్రజలను చంపడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. ఇలాంటి చర్యలను మహాత్మాగాంధీ ఎంతమాత్రం ఆమోందించి ఉండేవారు కాదు’ అని ఆయన అన్నారు. గురువారం గుజరాత్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘ అహింసకు నెలవైన నేల మనది. మహాత్మాగాంధీ పుట్టిన నేల మనది. ఈ విషయాన్ని ఎందుకు మరిచిపోతున్నారు?’ అని ఆయన ఆవేదనగా ప్రశ్నించారు. ‘చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారం ఈ దేశంలోకి ఎవరికీ లేదు’ అంటూ స్వయంప్రకటిత గోరక్షకులకు వ్యతిరేకంగా గట్టి సందేశాన్ని ఇచ్చారు. అంతకుముందు సబర్మతీ ఆశ్రమం వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆశ్రమంలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘హింస వల్ల ఎలాంటి సమస్యకు పరిష్కారం లభించబోదు’ అని ఆయన పేర్కొన్నారు. -
ఆరు బీజేపీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: బీజేపీ పాలిత ఆరు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గో సంరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాజస్థాన్‌లోని అల్వార్ లో ఓ ముస్లిం వ్యక్తిపై గో సంరక్షకులు దాడి చేయగా అతడు చనిపోయాడు. ఈ విషయం ఇప్పుడు అటు పార్లమెంటును కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు సైతం అధికార పక్షంపై దీనితో దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్వార్ ఘటనపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజేకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. పెహ్లూ ఖాన్ అనే వ్యక్తి గోవులను ట్రక్కులో తీసుకొని వెళుతుండగా ఎక్కడ కొనుగోలు చేశావని, ఎందుకు తీసుకెళుతున్నావని ప్రశ్నించి అనంతరం దాడి చేయడంతో అతడు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం మాత్రం అలాంటి ఘటనేది జరగలేదని రాజ్యసభలో చెప్పడంతో పెద్ద ధుమారం చెలరేగింది. -
అనుకున్నదొక్కటి.. అయ్యో రాహుల్!
ఉనా: పార్లమెంటులో కాస్తా తల ముందుకువాల్చి.. కళ్లు మూసి రిలాక్స్ అవుతున్నట్టు కెమెరాకు రాహుల్‌గాంధీ చిక్కడం పెద్ద వివాదమే రేపింది. దళితులపై దాడి అంశం మీద లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతుండగా.. అదేమీ పట్టనట్టు రాహుల్ కునుకు తీశారని విపక్షాలు విరుచుకుపడ్డాయి. సహజంగానే ఇరుకునపడ్డ కాంగ్రెస్ పార్టీ తమ ఉపాధ్యక్షుడిని వెనకేసుకొచ్చేందుకు తంటాలు పడింది. రాహుల్ పడుకోలేదని, రిలాక్స్ అయినట్టు పేర్కొంది. ఈ వివాదం జరిగిన వెంటనే రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటన చేపట్టారు. గుజరాత్‌లోని ఉనాలో చనిపోయిన ఆవు చర్మం వలిచారని దళిత యువకులపై గోరక్షక దళాలు దాడి చేశారు. వారి బట్టలూడదీసి కారుకు కట్టేసి.. కిరాతకంగా కొట్టారు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగా రాహుల్ పడుకున్నారని విమర్శలు రావడంతో వాటిని తిప్పికొట్టడానికి (?) ఆ వెంటనే ఆయన ఉనాకు చేరుకొని దళిత యువకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఓ దళిత మహిళను ఆయన ఆలింగనం చేసుకొని పరామర్శించారు. నిజానికి ఆమె బాధిత దళిత యువకులకు బంధువు కాదు. వారితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. 55 ఏళ్ల ఆ మహిళకు క్రిమినల్ రికార్డు కూడా ఉంది. బలవంతపు వసూళ్లు, అల్లర్లకు పాల్పడిన నేరచరిత్ర ఉంది. బాధితులను పరామర్శించడానికి ఆమె ఆస్పత్రికి వచ్చిందట. కానీ, ఆమె నకిలీ పేరుతో ఆస్పత్రిలోకి వచ్చినట్టు తర్వాత తేలింది. అయితే, రాహుల్ మాత్రం ఆమెను బాధితుల బంధువు అనుకొని ఆలింగనం చేసుకొని ఏకంగా పరామర్శ కూడా చేశారు. ఇది కూడా రాహుల్‌కు బ్యాక్‌ఫైర్ అయింది. ఈ విషయంలోనూ ఆయనను విమర్శలు వెంటాడుతున్నాయి. ‘రాహుల్‌గాంధీ ఏం చేసినా ఇలాగే అవుతుంది. ఆయన తీరే అంతా. ఆయన ప్రతిసారి సొంత పార్టీని ఇరకాటంలో నెడుతుంటారు’ అని బీజేపీ అధికార ప్రతినిధి రాజు ధ్రువ్ పేర్కొన్నారు.