గోరక్షకులకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!
అహ్మదాబాద్: గోరక్షణ పేరుతో హింసాత్మక దాడులకు తెగబడుతున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. ‘గో (ఆవుల) భక్తి పేరిట ప్రజలను చంపడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. ఇలాంటి చర్యలను మహాత్మాగాంధీ ఎంతమాత్రం ఆమోందించి ఉండేవారు కాదు’ అని ఆయన అన్నారు. గురువారం గుజరాత్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘ అహింసకు నెలవైన నేల మనది. మహాత్మాగాంధీ పుట్టిన నేల మనది. ఈ విషయాన్ని ఎందుకు మరిచిపోతున్నారు?’ అని ఆయన ఆవేదనగా ప్రశ్నించారు.
‘చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారం ఈ దేశంలోకి ఎవరికీ లేదు’ అంటూ స్వయంప్రకటిత గోరక్షకులకు వ్యతిరేకంగా గట్టి సందేశాన్ని ఇచ్చారు. అంతకుముందు సబర్మతీ ఆశ్రమం వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆశ్రమంలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘హింస వల్ల ఎలాంటి సమస్యకు పరిష్కారం లభించబోదు’ అని ఆయన పేర్కొన్నారు.