సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కొంత మంది వ్యక్తులు సమూహంగా ఏర్పడి ప్రజలపై దాడిచేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోడానికి వీల్లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దాడులను అరికట్టేందుకు చట్టాన్ని రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఎలాంటి చట్టం చేస్తున్నారో నాలుగు వారాల్లో తమకు నివేదించాలని సుప్రీంకోర్టు కోరింది. ప్రజల హక్కులకు భంగం కలిగించే చర్యలను నివారించడానికి ప్రతి జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని గతంలోనే రాష్ట్రాలను ఆదేశించినట్లు న్యాయస్థానం గుర్తుచేసింది. రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు గోరక్షణ పేరుతో జరగుతున్న దాడులను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తమకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. సమాజంలో హింసకు తావులేదన్న ప్రధాన న్యాయమూర్తి తదుపరి విచారణను ఆగస్ట్ 28కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment