గోరక్షకులపై సుప్రీంకోర్టు ఉక్కుపాదం!
న్యూఢిల్లీ: గో రక్షకుల ఆగడాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు చెక్ పెట్టాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేయాలని బుధవారం ఆదేశించింది. సీనియర్ పోలీసు అధికారి నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తూ వారంలోగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని తేల్చిచెప్పింది.
గో రక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై అరాచకాలు, హింసాత్మక దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్ ఎస్ పూనావాలా గత ఏడాది అక్టోబర్ 21న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. దీనిపై ప్రతిస్పందన తెలియజేయాలని ఆరు రాష్ట్రాలను ఆదేశించింది. గత జూలై 21న వాదనల సందర్భంగా దాడులకు దిగుతున్న గో రక్షకులను కాపాడాలని చూడొద్దని, గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలేమిటో తెలుపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
తాజా విచారణ సందర్భంగా గో రక్షణ దాడులకు వ్యతిరేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలకు ఏడురోజుల గడువు ఇచ్చింది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించవద్దని, గోరక్షణ దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.