బ్రాహ్మణ వృద్ధుడిపై గోరక్షకుల దాడి
లక్నో: ఒక వైపు మూక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా అలాంటి ఘటనలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ హిందువుపైనే మూక దాడి చోటు చేసుకుంది. బ్రాహ్మణుడైన ఓ వృద్ధుడు తన ఆవును ముస్లింలకు అమ్ముతున్నాడనే అనుమానంతో గోరక్షకులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటన బల్‌రాంపుర్ జిల్లాలోని లక్ష్మణ్‌పూర్‌లో గత ఆగస్టు 31న చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన కైలాష్ నాథ్ శుక్లా(70) అనే బ్రాహ్మణ వృద్దుడు ఆనారోగ్యంతో బాధపడుతున్న తన ఆవును సమీప గ్రామంలోని వెటర్నరీ డాక్టర్ తీసుకెళ్తున్నాడు. దారి మధ్యలో గోరక్షకుల పేరిట ఓ మూక అతన్ని చుట్టుముట్టింది. తాను హిందువునని, బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడనని చెప్పినా పట్టించుకోకుండా కొంత మంది అతనిపై దాడి చేశారు. అంతేకాకుండా అతని మొహానికి మసి పూసి కొట్టుకుంటూ ఉరేగించారు. ఎవరైనా ఆవులను అమ్మినా, వాటిని బాధపెట్టినా వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
అనంతరం ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. తొలుత అతని ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు. అనంతరం ఈ ఘటన గురించి స్వయంగా తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాజేశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు తీసుకోని అధికారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment