మూకహత్యలపై హైలెవల్‌ కమిటీ | Centre constitutes high-level committees to deal with mob violence, lynching | Sakshi
Sakshi News home page

మూకహత్యలపై హైలెవల్‌ కమిటీ

Published Tue, Jul 24 2018 2:16 AM | Last Updated on Tue, Jul 24 2018 4:52 AM

Centre constitutes high-level committees to deal with mob violence, lynching - Sakshi

మూకహత్యలను నిరసిస్తూ అహ్మదాబాద్‌లో ఆందోళనచేస్తున్న నిరసనకారులు

న్యూఢిల్లీ/జైపూర్‌: దేశంలో పెరిగిపోతున్న మూకహత్యలను నియంత్రించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇందులోభాగంగా ఈ హత్యల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సలహాలిచ్చేందుకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల్ని పరిశీలించేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్‌ ఆధ్వర్యంలో మంత్రుల బృందం(జీవోఎం)ను ఏర్పాటు చేసింది. రాజీవ్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీలో న్యాయశాఖ, శాసన విభాగం, సామాజిక న్యాయం–సాధికారత విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

  జీవోఎంలో విదేశాంగ శాఖ, న్యాయ శాఖ, రవాణా శాఖ, జలవనరుల శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా తన నివేదికను జీవోఎంకు సమర్పిస్తుంది. మూకహత్యల నియంత్రణపై ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సుల్ని జీవోఎం అధ్యయనం చేసి తుది నివేదికను ప్రధానికి అందజేస్తుంది. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమనీ, కాబట్టి నేరాలను అదుపు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకహత్యల ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది.

జూలై 20న ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్నాడన్న అనుమానంతో రాజస్తాన్‌లోని ఆల్వార్‌లో అక్బర్‌(28) అనే ముస్లిం యువకుడ్ని గోరక్షక ముఠా కొట్టింది. ఈ దాడి తర్వాత కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అక్బర్‌ను 6 కి.మీ దూరంలోని ఆస్పత్రికి పోలీసులు మూడు గంటల తర్వాత తీసుకెళ్లారనీ, మార్గమధ్యంలో టీ తాగారనీ వార్తలొచ్చాయి. దీంతో ఈ ఘటనపై నివేదిక అందజేయాలని రాజస్తాన్‌ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. కాగా, ఆల్వార్‌ మూకహత్య విషయాన్ని కాంగ్రెస్‌ ఎంపీ ఒకరు లోక్‌సభలో ప్రస్తావించగా, బీజేపీ ఎంపీలందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.

మరోవైపు ఆళ్వార్‌ పోలీసుల అలసత్వం విషయమై విచారణ జరిపేందుకు రాజస్తాన్‌ ప్రభుత్వం ప్రత్యేక డీజీపీ ఎన్‌ఆర్కే రెడ్డి నేతృత్వంలో నలుగురు సీనియర్‌ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోరక్షక ముఠాల ఆగడాలను అరికట్టడానికి అన్నిరాష్ట్రాలకు ఇప్పటికే మార్గదర్శకాలను జారీచేశామని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు.

మానవత్వం స్థానంలో విద్వేషం..
ఆల్వార్‌ మూకహత్యపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ప్రధాని లక్ష్యంగా విరుచుకుపడ్డారు. మోదీ క్రూర భారత్‌లో మానవత్వం స్థానాన్ని విద్వేషం ఆక్రమించుకుందని విమర్శించారు. ‘గోరక్షక ముఠా బాధితుడు అక్బర్‌ అలియాస్‌ రక్బర్‌ ఖాన్‌ను ఆరు కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి తరలించడానికి ఆల్వార్‌ పోలీసులకు 3 గంటలు ఎందుకు పట్టింది? వాళ్లు బాధితుడ్ని ఆస్పత్రికి తరలించకుండా టీ తాగుతూ కూర్చున్నారు.

మానవత్వం స్థానాన్ని విద్వేషం ఆక్రమించుకున్న మోదీ సరికొత్త క్రూర భారతం ఇదే’ అని ట్విట్టర్‌లో మండిపడ్డారు. మరోవైపు కేంద్ర మంత్రి గోయల్‌ రాహుల్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘నేరం జరిగిన ప్రతిసారీ ఆనందంతో గంతులు వేయడం ఆపు రాహుల్‌. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజస్తాన్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాజకీయ లబ్ధి కోసం సమాజాన్ని ఇష్టానుసారం విభజించే మీరు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు.  మీరొక విద్వేష వ్యాపారి’ అని ఘాటుగా విమర్శించారు.

పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే: కమిటీ
పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అక్బర్‌ చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రాజస్తాన్‌ ప్రభుత్వం నియమించిన హైలెవల్‌ కమిటీ మీడియాకు తెలిపింది. బాధితుడి గాయాల తీవ్రతను అంచనా వేయడంలో విఫలమైన పోలీసులు తొలుత ఆస్పత్రికి తరలించకుండా, పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంతో అతను చనిపోయినట్లు ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ప్రత్యేక డీజీపీ ఎన్‌ఆర్కే రెడ్డి వెల్లడించారు. పోలీసుల కస్టడీలో దెబ్బల కారణంగా చనిపోయాడన్న ఆరోపణల్ని ఖండించారు.

అల్వార్‌లో జరిగిందిదీ
హరియాణాకు చెందిన అక్బర్, అస్లామ్‌లు రాజస్తాన్‌లో ఆవుల్ని కొనుగోలు చేసి తమ గ్రామానికి జూలై 20న తీసుకెళ్తున్నారు. ఆల్వార్‌లోని లాలావండి గ్రామ సమీపానికి రాగానే వీరిని ఆవుల స్మగ్లర్లుగా భావించిన గోరక్షక ముఠా విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో అక్బర్‌(28) దుండగుల చేతిలో చిక్కుకోగా, అస్లామ్‌ తప్పించుకున్నాడు. విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) రామ్‌గఢ్‌ గోరక్ష విభాగం చీఫ్‌ కిశోర్‌  పోలీసులకు ఈ ఘటనపై సమాచారమిచ్చారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అక్బర్‌ను తొలుత ఆస్పత్రికి తరలించకుండా గోవుల్ని గోశాలకు తరలించడంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత బాధితుడ్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వాంగ్మూలం నమోదుచేసి ఆస్పత్రికి తరలించారు. బాధితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లే దారిలో పోలీస్‌ అధికారులు జీప్‌ నిలిపివేసి టీ కూడా తాగారు. చివరికి 6 కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి మూడు గంటలు ఆలస్యంగా జూలై 21న ఉదయం 4 గంటలకు తీసుకెళ్లడంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అక్బర్‌ను గోరక్షక ముఠా హత్యచేసిందో, పోలీసులు కొట్టిచంపారో జ్యుడీషియల్‌ విచారణ జరపాలని రామ్‌గఢ్‌ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్‌ అహుజా డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement