GOM Members
-
మూకహత్యలపై హైలెవల్ కమిటీ
న్యూఢిల్లీ/జైపూర్: దేశంలో పెరిగిపోతున్న మూకహత్యలను నియంత్రించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇందులోభాగంగా ఈ హత్యల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సలహాలిచ్చేందుకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల్ని పరిశీలించేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం(జీవోఎం)ను ఏర్పాటు చేసింది. రాజీవ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీలో న్యాయశాఖ, శాసన విభాగం, సామాజిక న్యాయం–సాధికారత విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. జీవోఎంలో విదేశాంగ శాఖ, న్యాయ శాఖ, రవాణా శాఖ, జలవనరుల శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా తన నివేదికను జీవోఎంకు సమర్పిస్తుంది. మూకహత్యల నియంత్రణపై ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సుల్ని జీవోఎం అధ్యయనం చేసి తుది నివేదికను ప్రధానికి అందజేస్తుంది. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమనీ, కాబట్టి నేరాలను అదుపు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకహత్యల ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. జూలై 20న ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో రాజస్తాన్‌లోని ఆల్వార్‌లో అక్బర్(28) అనే ముస్లిం యువకుడ్ని గోరక్షక ముఠా కొట్టింది. ఈ దాడి తర్వాత కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అక్బర్‌ను 6 కి.మీ దూరంలోని ఆస్పత్రికి పోలీసులు మూడు గంటల తర్వాత తీసుకెళ్లారనీ, మార్గమధ్యంలో టీ తాగారనీ వార్తలొచ్చాయి. దీంతో ఈ ఘటనపై నివేదిక అందజేయాలని రాజస్తాన్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. కాగా, ఆల్వార్ మూకహత్య విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ఒకరు లోక్‌సభలో ప్రస్తావించగా, బీజేపీ ఎంపీలందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు ఆళ్వార్ పోలీసుల అలసత్వం విషయమై విచారణ జరిపేందుకు రాజస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక డీజీపీ ఎన్ఆర్కే రెడ్డి నేతృత్వంలో నలుగురు సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గోరక్షక ముఠాల ఆగడాలను అరికట్టడానికి అన్నిరాష్ట్రాలకు ఇప్పటికే మార్గదర్శకాలను జారీచేశామని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మానవత్వం స్థానంలో విద్వేషం.. ఆల్వార్ మూకహత్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రధాని లక్ష్యంగా విరుచుకుపడ్డారు. మోదీ క్రూర భారత్‌లో మానవత్వం స్థానాన్ని విద్వేషం ఆక్రమించుకుందని విమర్శించారు. ‘గోరక్షక ముఠా బాధితుడు అక్బర్ అలియాస్ రక్బర్ ఖాన్‌ను ఆరు కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి తరలించడానికి ఆల్వార్ పోలీసులకు 3 గంటలు ఎందుకు పట్టింది? వాళ్లు బాధితుడ్ని ఆస్పత్రికి తరలించకుండా టీ తాగుతూ కూర్చున్నారు. మానవత్వం స్థానాన్ని విద్వేషం ఆక్రమించుకున్న మోదీ సరికొత్త క్రూర భారతం ఇదే’ అని ట్విట్టర్లో మండిపడ్డారు. మరోవైపు కేంద్ర మంత్రి గోయల్ రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘నేరం జరిగిన ప్రతిసారీ ఆనందంతో గంతులు వేయడం ఆపు రాహుల్. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాజకీయ లబ్ధి కోసం సమాజాన్ని ఇష్టానుసారం విభజించే మీరు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. మీరొక విద్వేష వ్యాపారి’ అని ఘాటుగా విమర్శించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే: కమిటీ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అక్బర్ చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రాజస్తాన్ ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ మీడియాకు తెలిపింది. బాధితుడి గాయాల తీవ్రతను అంచనా వేయడంలో విఫలమైన పోలీసులు తొలుత ఆస్పత్రికి తరలించకుండా, పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంతో అతను చనిపోయినట్లు ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ప్రత్యేక డీజీపీ ఎన్ఆర్కే రెడ్డి వెల్లడించారు. పోలీసుల కస్టడీలో దెబ్బల కారణంగా చనిపోయాడన్న ఆరోపణల్ని ఖండించారు. అల్వార్‌లో జరిగిందిదీ హరియాణాకు చెందిన అక్బర్, అస్లామ్‌లు రాజస్తాన్‌లో ఆవుల్ని కొనుగోలు చేసి తమ గ్రామానికి జూలై 20న తీసుకెళ్తున్నారు. ఆల్వార్‌లోని లాలావండి గ్రామ సమీపానికి రాగానే వీరిని ఆవుల స్మగ్లర్లుగా భావించిన గోరక్షక ముఠా విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో అక్బర్(28) దుండగుల చేతిలో చిక్కుకోగా, అస్లామ్ తప్పించుకున్నాడు. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) రామ్‌గఢ్ గోరక్ష విభాగం చీఫ్ కిశోర్ పోలీసులకు ఈ ఘటనపై సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అక్బర్‌ను తొలుత ఆస్పత్రికి తరలించకుండా గోవుల్ని గోశాలకు తరలించడంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత బాధితుడ్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వాంగ్మూలం నమోదుచేసి ఆస్పత్రికి తరలించారు. బాధితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లే దారిలో పోలీస్ అధికారులు జీప్ నిలిపివేసి టీ కూడా తాగారు. చివరికి 6 కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి మూడు గంటలు ఆలస్యంగా జూలై 21న ఉదయం 4 గంటలకు తీసుకెళ్లడంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అక్బర్‌ను గోరక్షక ముఠా హత్యచేసిందో, పోలీసులు కొట్టిచంపారో జ్యుడీషియల్ విచారణ జరపాలని రామ్‌గఢ్ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహుజా డిమాండ్ చేశారు. -
టీ బిల్లుపై చర్చలో పాల్గొనండి: రాహుల్‌గాంధీ
-
టీ బిల్లుపై చర్చలో పాల్గొనండి: రాహుల్‌గాంధీ
* సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు రాహుల్‌గాంధీ సూచన * సీమాంధ్రకు న్యాయం చేస్తామని హామీ * విభజనకే ఒప్పుకున్నాం.. హైదరాబాద్‌ను తాత్కాలిక యూటీ అయినా చేయమని సీమాంధ్ర నేతల విన్నపం * భేటీలో పాల్గొన్న జీవోఎం సభ్యులు న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలకు స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికే కట్టుబడి ఉన్నామన్నారు. వాస్తవాలను అర్థం చేసుకుని విభజనపై పార్లమెంట్లో జరిగే చర్చలో పాల్గొని సీమాంధ్రుల సమస్యలను లేవనెత్తాలని వారికి సూచించారు. సోమవారం సాయంత్రం తన నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కిశోర్‌చంద్రదేవ్, కావూరి సాంబశివరావు, ఎం.ఎం.పల్లంరాజు, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, చిరంజీవి, పనబాక లక్ష్మి, ఎంపీలు హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరి బాపిరాజులతో రాహుల్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించినా వారు గైర్హాజరయ్యారు. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశానికి జీవోఎం సభ్యులు కూడా హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న కొందరు నేతలు చెప్పిన వివరాల ప్రకారం.. రాష్ట్ర విభజనపై లోక్‌సభలో మంగళవారం జరిగే చర్చలో పాల్గొని సీమాంధ్ర సమస్యలను లేవనెత్తాలని సీమాంధ్ర నేతలకు రాహుల్ సూచించారు. వాటి పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని, సీమాంధ్రకు అన్యాయం చేయబోమని హామీ ఇచ్చారు. అదే తనతో పాటు, సోనియాగాంధీ అభిమతమని వెల్లడించారు. అనంతరం జీవోఎంకు తాము గతంలో సమర్పించిన ప్రతిపాదనలను సీమాంధ్ర నేతలు రాహుల్ ముందుంచారు. మంత్రులు కావూరి, పల్లంరాజు, జేడీ శీలం మాట్లాడుతూ తాము చేసిన విజ్ఞప్తులేవీ జీవోఎం పట్టించుకోలేదని, అలాంటప్పుడు జనంలోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని ప్రశ్నించారు. రాష్ర్ట విభజనకే తాము ఒప్పుకుంటున్నప్పుడు హైదరాబాద్‌ను తాత్కాలిక కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. దీంతోపాటు కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరినా పట్టించుకోలేదని వాపోయారు. రాష్ర్టం విడిపోతే సీమాంధ్రలో రెవెన్యూ లోటు తీవ్రమవుతుందని, దీనిని అధిగమించేందుకు హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు వాటా ఇవ్వాలని, సీమాంధ్ర లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు రాయితీలివ్వాలని కోరారు. అనంతరం రాహుల్ జీవోఎం సభ్యుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అయితే హైదరాబాద్‌ను యూటీ చేయడం సాధ్యం కాదని, అలా చేయడానికి రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని తెలిపారు. పైగా ఎంఐఎం పార్టీ సహా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేలందరూ దీనిని తీవ్రంగా వ్యతిరేకి స్తున్నారని సీమాంధ్ర నేతలకు వివరించారు. అయితే, తాము కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునే వరకే హైదరాబాద్‌ను ఢిల్లీ తరహాలో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని మాత్రమే కోరుతున్నామని కేంద్ర మంత్రులు చెప్పడంతో.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళతానని రాహుల్ హామీ ఇచ్చారు. విడిపోయిన తరువాత సీమాంధ్రకు ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా ప్రత్యేక హోదా కల్పించాలని, తద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీమాంధ్ర నేతలు పేర్కొన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజల్లో అత్యధికులు తెలంగాణలో కలవాలని కోరుతున్నందున రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళతానని రాహుల్ వారికి చెప్పారు. ఆ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తేయండి సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని ఆ ప్రాంత నేతలు రాహుల్‌గాంధీకి విజ్ఞప్తి చేశారు. రాష్ర్ట విభజనపై చర్చ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంత ప్రతినిధుల ప్రాతినిధ్యం లేకపోతే అప్రజాస్వామికం అవుతుందని పేర్కొన్నారు. దీనిపై రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. సమావేశానంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడుతూ.. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను తాత్కాలిక యూటీ చేస్తే జనంలోకి వెళ్లి వారిని మెప్పించగలమని చెప్పామన్నారు. -
జిఓఎం సభ్యుల మధ్య విభేదాలు
రాష్ట్రాన్ని విభజించడానికి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. కేంద్రానికి నివేదిక సమర్పించే విషయంలో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వారు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. రాష్ట్రాన్ని విభజించడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. హైదరాబాద్, భద్రాచలం, నదీజలాలు, శాంతిభద్రతలు, విద్య, వైద్యం, సీమాంధ్రుల భద్రత.... ఇలా అనేక కీలక అంశాలు ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి తగిన పరిష్కారాలను కనుగొనడాని జిఓఎం తీవ్ర కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ శాంతిభద్రతలపై టాస్క్‌ఫోర్స్ చీఫ్ నుంచి జిఓఎం సమాచారం తెలుసుకుంటోంది. జిఓఎం సభ్యుల మధ్య సమన్వయం లోపించిన పరిస్థితులలో మరో పక్క రాష్ట్రాన్ని విభజించాలంటే రాజ్యంగంలోని 371(డి)ని తొలగించాల్సిందేనని అటార్నీ జనరల్ వాహనవతి స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ బిల్లుకు ముందు రాజ్యాంగ సవరణ చేయాలని, 371(డి) ఉండగా విభజన చేయడం కుదరదని ఆయన కేంద్రానికి నివేదిక ఇచ్చారు. విభజన జరిగితే రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక ప్రతిపత్తి ఉండదని వాహనవతి కేంద్రానికితెలిపారు. ఈ నేపధ్యంలో ఈరోజు కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ కేంద్ర హొం శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సిఫార్సులపై కసరత్తు చేశారు. సభ్యుల మధ్య వివిధ అంశాలలో ఏకాభిప్రాయం కుదరకపోవడమేకాక సమావేశాల విషయంలో కూడా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. జిఓఎం తుది సమావేశం విషయమై సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. రేపటి జిఓఎం సమావేశం చివరిది కాదని షిండే విలేకరులకు చెప్పారు. మరికొన్ని సమావేశాలు జరుగుతాయని కూడా ఆయన తెలిపారు. జైరాం రమేష్ అందుకు భిన్నంగా చెప్పారు. రేపటి జిఓఎం సమావేశానికి ఏడుగురు సభ్యులూ హాజరవుతారని, ఇదే తుది సమావేశమని చెప్పారు. కీలకంగా విభజన అంశాలు - అనివార్యంగా రాజ్యాంగ సవరణ - జిఓఎం సభ్యుల భిన్నాభిప్రాయాలు - రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జాతీయ స్థాయిలో చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు - విభజనను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రజలు.... ఈ పరిస్థితులలో రాష్ట్ర విభజన సమస్య ఓ పట్టాన తేలేట్టుగా కనిపించడంలేదు.