జిఓఎం సభ్యుల మధ్య విభేదాలు | Differences among GOM Members | Sakshi
Sakshi News home page

జిఓఎం సభ్యుల మధ్య విభేదాలు

Published Wed, Nov 20 2013 5:43 PM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

జిఓఎం సభ్యుల మధ్య విభేదాలు

జిఓఎం సభ్యుల మధ్య విభేదాలు

రాష్ట్రాన్ని విభజించడానికి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి.  కేంద్రానికి నివేదిక సమర్పించే విషయంలో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వారు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. రాష్ట్రాన్ని విభజించడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. హైదరాబాద్, భద్రాచలం, నదీజలాలు, శాంతిభద్రతలు, విద్య, వైద్యం, సీమాంధ్రుల భద్రత.... ఇలా అనేక కీలక అంశాలు ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి తగిన పరిష్కారాలను కనుగొనడాని జిఓఎం తీవ్ర  కసరత్తు చేస్తోంది.  హైదరాబాద్ శాంతిభద్రతలపై టాస్క్ఫోర్స్ చీఫ్ నుంచి జిఓఎం సమాచారం తెలుసుకుంటోంది.

జిఓఎం సభ్యుల మధ్య సమన్వయం లోపించిన పరిస్థితులలో  మరో పక్క రాష్ట్రాన్ని విభజించాలంటే  రాజ్యంగంలోని 371(డి)ని తొలగించాల్సిందేనని అటార్నీ జనరల్ వాహనవతి స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ బిల్లుకు ముందు రాజ్యాంగ సవరణ చేయాలని, 371(డి) ఉండగా విభజన చేయడం కుదరదని ఆయన కేంద్రానికి నివేదిక ఇచ్చారు.  విభజన జరిగితే రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక ప్రతిపత్తి ఉండదని  వాహనవతి  కేంద్రానికితెలిపారు.

ఈ నేపధ్యంలో ఈరోజు కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ కేంద్ర హొం శాఖ అధికారులతో  సమావేశమయ్యారు.  రాష్ట్ర విభజన సిఫార్సులపై కసరత్తు చేశారు. సభ్యుల మధ్య వివిధ అంశాలలో ఏకాభిప్రాయం కుదరకపోవడమేకాక సమావేశాల విషయంలో కూడా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు.  జిఓఎం తుది సమావేశం విషయమై సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు.  రేపటి జిఓఎం సమావేశం చివరిది కాదని షిండే విలేకరులకు చెప్పారు. మరికొన్ని సమావేశాలు జరుగుతాయని కూడా ఆయన తెలిపారు. జైరాం రమేష్ అందుకు భిన్నంగా చెప్పారు. రేపటి జిఓఎం సమావేశానికి  ఏడుగురు సభ్యులూ హాజరవుతారని, ఇదే తుది సమావేశమని  చెప్పారు.  

కీలకంగా విభజన అంశాలు  -  అనివార్యంగా రాజ్యాంగ సవరణ - జిఓఎం సభ్యుల భిన్నాభిప్రాయాలు - రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జాతీయ స్థాయిలో చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు - విభజనను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రజలు.... ఈ పరిస్థితులలో రాష్ట్ర విభజన సమస్య ఓ పట్టాన తేలేట్టుగా కనిపించడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement