సాక్షి, న్యూఢిల్లీ : ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతో అల్వార్‌లో 28 ఏళ్ల అక్రం ఖాన్‌పై అల్లరి మూకల దాడిపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు ఎదురవుతున్నాయి. మూకల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో చోటుచేసుకున్న జాప్యంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఆపద సమయంలో పోలీసులు టీ విరామం తీసుకోవడంపై విచారణకు ఆదేశించింది.
మరోవైపు బాధితుడిని ఆస్పత్రికి తరలించడంలో జాప్యంపై రాజస్తాన్ పోలీసులు సైతం విచారణకు అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన లాలావండి గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంఘర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌కు బాధితుడిని తీసుకువెళ్లేందుకు పోలీసులకు మూడు గంటలు పైగా సమయం పట్టడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చావుబతుకుల్లో ఉన్న బాధితుడిని ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లడంతో.. అక్రం ఖాన్ ప్రాణాలు విడిచాడు. ఖాన్ తన స్నేహితుడు అస్లాంతో కలిసి హర్యానాలోని తమ గ్రామానికి రెండు ఆవులను తీసుకువెళుతుండగా, రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లా లాలావండి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద వీరిపై మూక దాడి జరిగింది. ఈ ఘటనలో అక్రం ఖాన్ ప్రాణాలు విడువడంతో మూక హత్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment