
మృతుడు కేత్‌రామ్ బీమ్(ఫైల్ ఫొటో)
జైపూర్ : ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని ఓ ముస్లింను కొట్టి చంపిన ఘటన మరవక ముందే రాజస్తాన్‌లో మరో మూక హత్య చోటుచేసుకుంది. బార్మర్‌లో ఓ దళిత యువకుడు ముస్లిం యువతిని ప్రేమిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. కేత్‌రామ్ బీమ్(22) అనే యువకుడు మెహబూబ్ ఖాన్ ఇంట్లో కొద్ది రోజులుగా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలో ఆ కుటుంబంలో ఉన్న ఓ యువతితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇది కాస్త ప్రేమకు దారితీయడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు అతన్ని పలుమార్లు హెచ్చరించారు. అయినా వినకపోవడంతో దారుణంగా కొట్టి చంపారు.
గత శుక్రవారం హయత్‌ఖాన్, సదామ్ ఖాన్‌లు వారి పోలానికి రావాలని తన సోదరున్ని పిలిచినట్లు కేత్‌రామ్ సోదరుడు హరిరామ్ మీడియాకు తెలిపారు. అప్పటికే అక్కడ ఉన్న మరికొందరు అతని చేతులు కట్టేసి చచ్చే వరకు తన తమ్ముడిని చితకబాదారని ఆరోపించారు. శవాన్ని కొంత దూరం తీసుకెళ్లి పడేయడంతో మూడు రోజులనంతరం అతని డెడ్‌బాడీ దొరికిందన్నారు. ఇక పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో సైతం కేత్‌రామ్ కొట్టడం వల్లనే చనిపోయాడని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఓ వైపు దేశవ్యాప్తంగా మూకదాడులపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేత్‌రామ్ మృతి ఈ ఆందోళనలకు అగ్గిరాజేసినట్లైంది. మరోవైపు అల్వార్ జిల్లాలో చోటు చేసుకున్న మూక దాడిలో పోలీసుల నిర్లక్ష్యమే వల్లే బాధితుడు రక్బర్ ఖాన్ మృతి చెందినట్లు తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment