అయోధ్య వివాదంలో కొత్త మలుపు | Mallepalli Laxmaiah Article On Ayodhya History In sakshi | Sakshi
Sakshi News home page

అయోధ్య వివాదంలో కొత్త మలుపు

Published Thu, Aug 16 2018 1:26 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

Mallepalli Laxmaiah Article On Ayodhya History In sakshi - Sakshi

చరిత్రను తవ్వడం, అన్వేషించడం, అందులో ఏది లభ్యమైనా జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలి. ఏ సంస్థకో, మతానికో దానిమీద గుత్తాధిపత్యం ఉండకూడదు. మత విశ్వాసాలు, రాజకీయ ఎత్తుగడలు, వారి వారి ప్రయోజనాలు బాబరీ మసీదు సమస్యకు  పరిష్కారం కావు. అట్లాగైతే చాలా మతాలకు చెందిన ప్రార్థనాలయాలు వేరే మతాల, సంస్థల పునాదులమీద నిర్మాణమై ఉన్నవేనన్న సత్యాన్ని ఒప్పుకోక తప్పదు. కూలగొట్టడం, తిరిగి నిర్మించడం ఎంత మాత్రం అభిలషణీయం కాదు. శాంతి సామరస్యం, ప్రేమ, కరుణల పుట్టినిల్లుగా భాసిల్లుతోన్న ఈ దేశంలో హింసకు తావుండకూడదు. ప్రజలు సృష్టించిన చరిత్రనీ, సంస్కృతినీ ప్రజలపరం చేయాలి.

‘‘అయోధ్యలో దాదాపు వంద బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. అందులో 3000 మందికి పైగా బౌద్ధబిక్కులు కార్యకలాపాలు నిర్వ హిస్తున్నారు. వారు మహాయాన, హీనయాన మార్గా లకు సంబం«ధించిన ఎన్నో విషయాలను నేర్చుకుం టున్నారు. ఈ నగరంలో పురాతన బౌద్ధారామం ఉంది. ఇందులో బౌద్ధ తాత్వికులలో ప్రముఖుడైన వసుబంధు ప్రసంగించేవారు. అనేక అంశాలపై అధ్యయనాలను కొనసాగించారు. అంతేకాకుండా ఎన్నో గ్రంథాలను ఆయన ఇక్కడే రచించారు’’ అని చైనా బౌద్ధ యాత్రికుడూ, చరిత్రకారుడూ అయిన హుయాన్‌త్సాంగ్‌ తన యాత్ర డైరీలో పేర్కొన్నారు. క్రీస్తు శకం 629 నుంచి 645 వరకు ఆయన భారత దేశంలో పర్యటించారు. అంతకుముందు కూడా చైనాకి చెందిన పాహియాన్‌ భారతదేశంలోని అనేక బౌద్ధ ప్రదేశాలను సందర్శించారు. ఆయన సైతం తన డైరీలో కోసల రాజ్యం గురించీ, అందులో ఉన్న శ్రావస్తి, సాకేత పట్టణాలను గురించీ ప్రస్తావించడం మనం గమనించవచ్చు. అయోధ్యకు మరో పేరు సాకేతనగరమని చరిత్రకారులు నిర్ధారించారు. కోసల రాజ్యం బుద్ధుడి తాత్వికతను అందిపుచ్చుకు న్నట్టు బౌద్ధగ్రంథాలు చెపుతున్నాయి. గౌతమ బుద్ధుడు కోసల రాజ్యంలో ఎక్కువ సమయాన్ని గడి పినట్టు కూడా ఆ గ్రంథాల ప్రస్తావనవల్ల తెలుస్తు న్నది. వీటన్నింటి రీత్యా కోసల రాజ్యంలోని సాకేత (అయోధ్య) పట్టణం బౌద్ధం విస్తరణలో, బౌద్ధ భావ నల సంరక్షణలో కీలకపాత్ర పోషించింది.

సరిగ్గా ఇదే విషయం బాబ్రీమసీదు వివాదం కొత్త మలుపునకు దారితీస్తున్నదనడానికి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషనే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత నెల 23వ తేదీన వినీత్‌ కుమా ర్‌మౌర్య దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. అయోధ్యలో ప్రస్తుత వివాదాస్పద స్థలంలో బౌద్ధ ఆరామం ఉండేదని, దానిని పరి రక్షించి, చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని వినీత్‌ కుమార్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. వినీత్‌ కుమార్‌ మౌర్య ఫైజాబాద్‌ జిల్లా కజియానాకు చెంది నవాడు. గతంలో లక్నో హైకోర్టులో ఈ విషయమై విచారణ జరుగుతున్న సమయంలో కూడా కొన్ని బౌద్ధ సంఘాలు, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశ యాల వెలుగులో పనిచేస్తున్న కొన్ని సంస్థలు కూడా పిటిషన్లు సమర్పించాయి. వీటిని ఆనాడు పరిగణన లోనికి తీసుకోలేదు. వినీత్‌ కుమార్‌ పట్టుదల పరి శోధనల ఆధారంగా ఒక సమగ్రమైన పిటిషన్‌ను తయారుచేసి దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను ఈ విచారణలో భాగం చేసింది. ఇది ఈ రోజు చరిత్ర మరుగున పడిన ఒక ముఖ్యౖ మెన అంశాన్ని బహిర్గతం చేసేందుకు తోడ్పడుతుం దని చాలామంది ఎదురుచూస్తున్నారు.

వినీత్‌ కుమార్‌ సమర్పించిన పిటిషన్‌లో ఒక చరిత్ర క్రమం మనకు దర్శనమిస్తుంది. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత ఎక్కువ కాలం కోసల దేశంలోని శ్రావస్తిలో, సాకేతలో గడిపిన ట్టు ఆయన తన పిటిషన్‌లో కూడా పేర్కొన్నారు. చైనా బౌద్ధ యాత్రికులు పాహియాన్, హుయాన్‌ త్సాంగ్‌లు రాసిన డైరీలలో కూడా ఈ విషయాలు న్నాయి. ఈ విషయాలన్నీ ముందుగా చైనా భాషలో లిఖతమైనాయి. ఆ తర్వాత ఇంగ్లీషులోకి అనువాదం జరిగింది. పాహియాన్‌ రాసిన ‘‘ఎ రికార్డ్‌ ఆఫ్‌ బుద్ధిస్ట్‌ కింగ్‌డమ్‌’’ అనే పుస్తకంలోని 20వ అధ్యా యంలో ఈ విషయాలున్నాయి. ఆయన తన ప్రయా ణంలో కోసలను సందర్శించినట్టు, అక్కడ బౌద్ధం గొప్పతనాన్ని చూసినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా హుయాన్‌త్సాంగ్‌ రాసిన ‘‘బుద్ధిస్ట్‌ రికార్డ్‌ ఆఫ్‌ ద వెస్టర్న్‌ వరల్డ్‌’’లోని అయోధ్య అనే అధ్యాయంలో కూడా చాలా వివరాలున్నాయి. అయోధ్యలోని ఒక పెద్ద బౌద్ధ ఆరామం పక్కన పడిపోయిన గోడలు కనిపించాయనీ, అవి వసుబంధు నివసించిన స్థల మని కూడా ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయోధ్య పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో అశో కుడు నిర్మించిన  200 అడుగుల స్తూపమున్నదని కూడా అందులో ఉదహరించారు. ఈ స్తూపం నిర్మిం చిన చోటనే గౌతమ బుద్ధుడు ఏడు రోజుల పాటు తన బోధనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళా డనీ, అందుకు గుర్తుగానే అశోకుడు ఈ స్తూపాన్ని సైతం నిర్మించారనీ ఆయన పేర్కొన్నాడు. అదే విధంగా సంఘారామానికి రెండు న్నర కిలోమీటర్ల దూరంలో తథాగత గౌతమబుద్ధుని అస్థికలతో నిర్మిం చిన స్తూపమున్నది. ఆరామానికి వాయవ్యంలో బుద్ధుని అస్థికలతో మరొక స్తూపం నిర్మాణం జరిగి నట్టు, దాని ఆనవాళ్ళను సైతం హుయాన్‌త్సాంగ్‌ కనుగొనడం విశేషం. అదే దిశలో మరొక బోధనా సమావేశ మందిరం ఉన్నట్టు కూడా ఆయన తన పుస్త కంలో పేర్కొన్నారు. ఇలా ఒకటేమిటి.. అయోధ్యలో నడ యాడిన బుద్ధుడి ఆనవాళ్ళెన్నింటినో పట్టిఇ చ్చిన ఘనత హుయాన్‌త్సాంగ్‌కే దక్కుతుంది.

పాహియాన్, హుయాన్‌త్సాంగ్‌ డైరీల్లోని చారి త్రక విషయాల ఆధారంగా బ్రిటిష్‌ పురాతత్వ శాస్త్ర వేత్త కన్నింగ్‌హామ్‌ చేపట్టిన తవ్వకాల్లో ఎన్నో బౌద్ధ అవశేషాలు బయటపడ్డాయి. అయోధ్యలో కూడా బౌద్ధ అవశేషాలున్నాయని కన్నింగ్‌హామ్‌ తన పరి శోధనలో తేల్చారు. 1862–63లో జరిగిన ఈ సర్వే తర్వాత మళ్ళీ 1889–1891 కాలంలో మరో అధ్య యనానికి కన్నింగ్‌హామ్‌ నడుంకట్టారు. అప్పుడు సైతం అదే నిర్ధారణకు వచ్చారు. మరో పురాతత్వ శాస్త్రవేత్త ఎ.కె.నారాయణ్‌ చేసిన సర్వే కూడా వీటినే ధ్రువపరిచింది. అంతే కాకుండా, బాబ్రీమసీదు వివా దాస్పద స్థలంలో లభించిన 14 స్తంభాలను బౌద్ధాన్ని ఆదరించి, ఆచరించిన, బుద్ధుడి అనుయాయులైన రాజులు నిర్మించినట్టు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ స్థలంలో దొరికిన మరొక శిల్పం ఈ వాదనలను బలపరు స్తున్నది.

అయోధ్యపైన ఎ.ఘోష్‌ సంపాదకత్వం వహిం చిన ‘‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఇండియన్‌ ఆర్కియా లజీ’’ పదకొండవ సంపుటిలో కూడా బౌద్ధ, జైన గ్రంథాల నుంచి ప్రస్తావనలున్నాయి. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాల్లో రాముడికి గానీ, హిందూ దేవాల యాలకు కానీ సంబంధించిన ఎటువంటి ఆధా రాలూ లభించలేదని పిటిషనర్‌ వినీత్‌ కుమార్‌ చాలా స్పష్టంగానే పేర్కొన్నారు. ఇటువంటి ముఖ్యమైన విషయాలను అలహాబాద్, లక్నో హైకోర్టు బెంచ్‌లు విస్మరించాయని కూడా వినీత్‌ పిటిషన్‌లో పేర్కొ న్నారు. సారనాథ్, కుషీనగర్, కపిలవస్తు, శ్రావస్తి లాగా వివాదాస్పదమైన స్థలాన్ని బౌద్ధవిహార్‌గా ప్రకటించి, పరిరక్షించాలని వినీత్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బౌద్ధతాత్వికత దీనిని ధ్వంసం చేసి, మరొక దానిని ఆక్రమించుకోవాలని భావించలేదని, ఇప్పుడు కూడా అక్కడ బౌద్ధ విహారాన్ని నిర్మించా లని తాము కోరడం లేదనీ, దానిని పరిరక్షించాలని మాత్రమే కోర్టును అభ్యర్థిస్తున్నామని, వినీత్‌ ఫోన్‌ సంభాషణలో వెల్లడించారు. అదేవిధంగా ఆ స్థలాన్ని ఎవరో ఒకరికి కేటాయించడం వల్ల వైషమ్యాలు పెరి గిపోయి, హింస ప్రజ్వరిల్లగలదని, దానిని నివారించ డానికి చారిత్రక ఆధారాలను మాత్రమే సత్యాలుగా స్వీకరించాలని ఆయన కోరుతున్నారు.

ఇదే సంవత్సరం జనవరిలో ‘సాక్షి’ ఎడిటోరి యల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తితో పాటు ఇంకా ఇద్దరు మిత్రులతో కలిసి నేపాల్‌లోని బుద్ధుని జన్మ స్థలమైన లుంబిని, ఆయన మహాపరినిర్వాణం పొందిన కుషినగర్‌తో సహా అయోధ్యలోని వివాదా స్పద స్థలాన్ని చూసే అవకాశం ఈ రచయితకు వచ్చింది. లుంబిని, కుషీనగర్‌లలో జరిగిన సంపూర్ణ తవ్వకాలవల్ల ఎన్నో చారిత్రక అవశేషాలు బయట పడ్డాయి. కానీ ఈ స్థలం 1885 నుంచి వివాదంలో ఉండటం వల్ల పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు నిర్వహించలేకపోయారు. దానివల్ల చరిత్ర భూగ ర్భంలోనే నిక్షిప్తమై ఉన్నది. ఈ వివాదంపై మహంత్‌ రఘుబర్‌ దాస్‌ ఫైజాబాద్‌ సబ్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ వేస్తూ, ఆ ప్రాంతంలో దేవాలయాలు కడతామని కోరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వివాదం సమసి పోలేదు.

క్రీ.శ.ఏడవ శతాబ్దంలో భారత ఉపఖండం మొత్తం పర్యటించిన హుయాన్‌త్సాంగ్‌ పేర్కొన్న అయోధ్య విశేషాల ఆధారంగా తవ్వకాలు నిర్వహిస్తే ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం వల్ల నేరుగా తవ్వకాలు చేయాల్సిన అవ సరంలేదు. హైదరాబాద్‌లోని ఎన్‌.జి.ఆర్‌.ఐ. లాంటి సంస్థలు తవ్వకాలు జరపకుండానే భూమిలోపల ఉన్న కట్టడాలు, నిర్మాణాల స్వరూపాలను కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నాయి. ప్రపంచంలో అన్ని ప్రాంతాలను గుప్పిట్లో పెట్టుకున్న గూగుల్‌ లాంటి సంస్థలు కూడా ఇటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి.

ఇప్పటికే పాహియాన్, హుయాన్‌త్సాంగ్‌ యాత్రలు, బౌద్ధ సాహిత్యంలోని పాళీగ్రంథాలు, కొన్ని సంస్కృత పుస్తకాలు, కన్నింగ్‌హామ్, కార్నైజ్, నారాయణ్‌లాంటి పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ విష యంలో మార్గనిర్దేశనం చేశారు. అటువంటి ఆధా రాల పునాదిగా చేసుకొని భారతదేశంలోని వారే కాకుండా, ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన పురాత త్వశాస్త్రవేత్తలతో ఒక కమిటీ వేసి, తవ్వకాలు జరిపిం చడం మంచిదేమో ఆలోచించాలి. దీనికి చరిత్రను తవ్వడం, అన్వేషించడం, అందులో ఏది లభ్యమైనా జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించడం జర గాలి. ఏ సంస్థకో, మతానికో దానిమీద గుత్తాధి పత్యం ఉండకూడదు. బాబరీ మసీదు వివాదానికి ఇది మాత్రమే పరిష్కారం. దీనికి మత విశ్వాసాలు, రాజకీయ ఎత్తుగడలు, ప్రయోజనాలు పరిష్కారం కావు. కూలగొట్టడం, నూతన కట్టడాలు తేవడం ఎంత మాత్రం అభిలషణీయం కాదు. శాంతి, సామ రస్యం, ప్రేమ, కరుణ పుట్టిన ఈ దేశంలో హింసకు తావుండకుండా, కలహాలకు స్థానం లేకుండా ప్రజలు సృష్టించిన చరిత్రనీ, సంస్కృతినీ,  వారసత్వ సంప దనూ ప్రజలపరం చేయాలి. వారికే వాటిపైన సర్వ హక్కులూ ఉండాలి.

మల్లెపల్లి లక్ష్మయ్య(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)
మొబైల్‌ : 97055 66213 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement