విశ్వమానవ మతం బౌద్ధం
కొత్త కోణం
‘నీకు నీవే యజమానివి. నీ భవిష్యత్‌ను నువ్వే నిర్మించుకో’ అన్న బుద్ధుని ప్రబోధం ప్రపంచం పట్ల మనిషి పట్ల ఆయన తాత్వికతకు అద్దం పడుతుంది. మనుషులు తమ జీవి తాలను తీర్చిదిద్దుకోవడానికి దేవుడు, లేదా అతీంద్రియ శక్తుల అవసరం లేదని, తద్వారా సమాజ పురోభివృద్ధి సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పాడు. బౌద్ధం మనిషి కేంద్రంగా రూపొందినది. దేవుడు, అదృశ్య శక్తుల ప్రమేయం లేనిది. తాను దేవుడిననో, దైవదూతననో, ప్రవక్తననో బుద్ధుడు చెప్పుకోలేదు. జ్ఞానం పొందిన వాడినని మాత్రమే అన్నాడు.
‘‘భావితరాల అవసరానికి సరిపోయే లక్షణాలున్న విశ్వమానవ మతం కావాలి. దేవుడు, మూఢనమ్మకాల పరిధులను అధిగమించి ప్రకృతిని, ఆధ్యా త్మికతను కలుపుకుని ఈ ప్రపంచంలో అన్నింటినీ ఒకేలా చూడగలిగే మతం నేటి అవసరం. ఇటువంటి శాస్త్రీయ పునాదిగల మతం బౌద్ధం ఒక్కటే’’ అని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్నాడు. ఆయన మాటలు బౌద్ధం విశ్వజనీన స్వభావాన్ని చాటుతాయి.
సమాజంలోని ప్రతిపార్శ్వాన్నీ బౌద్ధం తడిమింది. అల్లకల్లోలంగా ఉన్న ప్రజల జీవితాల్లోని ప్రతి అంశాన్నీ తట్టిలేపింది. 2,600 ఏళ్ల క్రితమే గౌతమ బుద్ధుడు విశ్వసృష్టిని ఒక గొప్ప తత్వవేత్తగా సమకాలీన సామాజిక, రాజకీ యాల నుంచి మాత్రమే గాక, వాస్తవిక దృష్టితో పరిశీలించాడు. దానినే ప్రబో ధించాడు. 19వ శతాబ్ది డార్విన్ కనిపెట్టిన జీవపరిణామ సిద్ధాంతాన్ని క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలోనే బుద్ధుడు ఆవిష్కరించడం ఆశ్చర్యకరం. బౌద్ధ గ్రంథం దిఘనికాయలోని అగ్గన్న సుత్తలో చెప్పిన విశ్వ పరిణామక్రమాన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. బుద్ధుని బోధనలలోని ఈ అంశా నికి తగు ప్రాధాన్యం లభించలేదు.
అగ్గన్న సుత్త
వాసెత్త, భరద్వాజ అనే ఇద్దరు శిష్యులతో బుద్ధుడు జరిపిన సంభాషణ సారాంశమే అగ్గన్న సుత్త. బుద్ధుడు శ్రావస్తి(సావత్తి) సమీపంలోని ఉత్తర వనంలో మిగారమాత భవనంలో ఉన్న సమయంలో వారిద్దరూ వచ్చి... ‘‘ఆర్యా! మమ్మల్నిద్దర్నీ బ్రాహ్మణులు తిడుతున్నారు. బ్రాహ్మణ కులంలో చెడపుట్టారని దూషిస్తున్నారు. ఇది మాకు బాగా బాధ కలిగిస్తున్నది’’ అంటూ వాపోయారు. ‘‘మంచిది, వాళ్లు ఏరకంగా మిమ్మల్ని దూషిస్తున్నారు?’’ అని బుద్ధుడు ప్రశ్నిస్తాడు. ‘‘బ్రాహ్మణ కులం అగ్రకులం. ఇతర కులాలు హీనమై నవి. బ్రాహ్మణ కులం తెలుపు, ఇతర కులాలు నలుపు. బ్రాహ్మణులు పరి శుద్ధులు, ఇతరులు కాదు. బ్రహ్మ నోటి నుంచి వచ్చిన వారు బ్రాహ్మణులు, మిగతావారు అలా కాదు. బ్రహ్మవారసులైన బ్రాహ్మణులను వదిలి మీరు నీచ యువ శ్రమణులు, సేవకులు, బ్రహ్మకాలి నుంచి పుట్టిన వారి దగ్గరకు వెళ్లారు. అటువంటి వారితో వెళ్లడం మంచిది కాదు’’ అని నిందిస్తున్నారని వాసెత్త, భరద్వాజలు చెబుతారు. అప్పుడు బుద్ధుడు వారితో ‘‘బ్రాహ్మణులు సత్యాలను మరుగుపరుస్తున్నారు. అందరిలాగానే బ్రాహ్మణ తల్లులు గర్భం దాల్చి సంతానాన్ని పొందుతారు. పిల్లలకు తల్లి పాలనే అమృతం లాగా అందిస్తారు’’. ఇటువంటి ప్రక్రియనే అన్ని కులాల తల్లులు నిర్వహిస్తున్నారు. వీటిని మరుగు పరిచి పురోహితులు అబద్ధాలు చెపుతున్నారు అంటూ ఆనాటి సామాజిక విభజనను, కులాల అంతరాలను బుద్ధుడు సవివరంగా వారికి తెలియజేస్తాడు. నలుపు, తెలుపు అనే శరీర వర్ణాలు అన్ని కులాల్లోనూ ఉన్నా యని చెపుతూ... నాలుగు కులాలలోనూ మంచివారు, చెడ్డవారు కూడా ఉన్నారు. అయితే ఈ కులాల నుంచి బిక్కుగా మారిన ప్రతి ఒక్కరూ తమ పాత జీవితాన్ని వదిలి పవిత్ర జీవితాన్ని ప్రారంభిస్తారని బుద్ధుడు చెబు తాడు. ఆ సందర్భంగా ఆయన విశ్వసృష్టిని క్రమానుగతంగా వివరించాడు.
బుద్ధుని విశ్వపరిణామవాదం
మొదట ఈ భూమి మీద కేవలం జలరాశి మాత్రమే ఉండేది. అంతా చిమ్మ చీకటి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లేవు. రాత్రీ, పగలు తేడా లేదు. వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాల లెక్కలు లేవు. జీవులుగా గుర్తించని కొన్ని అపరిపక్వమైన ప్రాణులు మాత్రమే ఉన్నాయి. చాలా కాలం తర్వాత భూమి మీద ఉన్న నీటి పైన ఒక రస పొర వ్యాపించింది. వేడి పాలు చల్లారు తున్నప్పుడు పైన ఏర్పడే పొరలాగా అది కనిపించింది. దానికి రంగు, రుచి, వాసన ఉన్నాయి. దాని రంగు మంచి నెయ్యి రంగు. దాని రుచి అడవి తేనె రుచి. ఒక జీవి ఆ రస పొరను రుచి చూసింది. అట్లా ఆ జీవులు క్రమంగా ఆ పొరను తిన్నాయి. దానితో ఆ రస పొర మాయమై సూర్యుడు, చంద్రుడు కనిపించారు. రాత్రి, పగలు ఏర్పడ్డాయి. ఆ విధంగానే ప్రపంచ గతి మొద లైంది. ఎప్పుడైతే రస పొర మాయమైందో పుట్టగొడుగుల్లాంటి శిలీంధ్రం పుట్టుకొచ్చింది. కాలక్రమేణా జీవులు కొంత పరిణామం చెందాయి. చెట్లు, చేమలు, నదీనదాలూ, కాల్వలూ ఏర్పడ్డాయి. జీవులు రకరకాల రూపాల్లో ఆవిర్భవించడం మొదలైంది. అట్లా కాలానుగతంగా, క్రమేణా మనిషి ఆకారం రూపుదాల్చింది. అలా క్రమంగా మనిషి పుట్టుక మరో నూతన ప్రపంచానికి అంకురార్పణ చేసింది. అప్పుడు మనుషులు, ఇతర జీవులూ ఆహారానికి ఆకులూ, అలమలపై ఆధారపడ్డారు. మొరటుదేలిన శరీరాలు క్రమంగా తమ అవసరాల కనుగుణంగా మార్పులకు లోనయ్యాయి. మానవ దేహాల్లోనూ ప్రకృతిసిద్ధమైన మార్పులు సంభవించాయి. ఆహారంలోనూ పెను మార్పులు వచ్చాయి. ఆకులు అలమల స్థానంలో పిండి, ఊకలేని మంచి వాసనతో కూడిన ధాన్యం పుట్టుకొచ్చింది. దానినే తినడం మొదలు పెట్టారు. అలా జీవిస్తుండగా పురుషుల, స్త్రీల శరీరాల్లో మార్పు వచ్చింది. క్రమంగా పునరుత్పత్తి ప్రారంభమైంది. లైంగిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఒకటి, రెండు నెలల పాటు బహిష్కరించారు. ఇట్లా ఎన్నో ఆచారాలు వచ్చాయి. అట్లా అప్పటికే ఏర్పడిన కులాల పుట్టుకను, దాని ఇతివృత్తాన్నీ గౌతమ బుద్ధుడు వివరించారు. బ్రాహ్మణ, ఖత్తియ (క్షత్రియ), విస్స(వైశ్య). సుద్ద(శూద్ర) అనే కులాల ప్రస్తావన, వాటి పుట్టుక వివరాలను కూడా అగ్గన్న సుత్తలో బుద్ధుడు వివరించాడు. బుద్ధుని అగ్గన్న సుత్త ప్రపంచ పరిణామ శీలతను, క్రమాన్ని వివరించింది.
మూఢనమ్మకాలకు తావులేని శాస్త్రీయ దృక్పథం
మనుషులలో ఏర్పడిన భేదాలు మనం సృష్టించుకున్నవేనని అది బోధిస్తుంది. అదేవిధంగా ఒకరు దేవుడి పుత్రులు, మరొకరు సామాన్యులు అనే అసమా నతలను తిరస్కరించి, సమానత్వాన్ని బోధించే నూత్న తాత్వికతను అభివృద్ధి పరుస్తుంది. ఇది ఎంతో వివేచనతో సమాజాన్ని ఆవిష్కరించిన ఘట్టం. బౌద్ధం విశ్వమానవ మతంగా రూపొందడానికి ఉన్న తాత్విక పునాది ఇది. ఇందులో ఎక్కడా మూఢనమ్మకాలకు తావు లేదు. విశ్వపరిణామ క్రమాన్ని ఎంతో సూక్ష్మదృష్టితో పరిశీలించిన బుద్ధుడు ఆ కాలపు విజ్ఞాన ఖనిగా దర్శన మిస్తాడు. బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసిన మాట నిజమే కావచ్చు. అక్కడ ఆయనకు జ్ఞానోదయం కలుగవచ్చు. కానీ అది కళ్లు మూసుకొని ధ్యానం చేయడం వల్ల సాధ్యమైందనేది అబద్ధం. ఆయన తన ఇంటిని వదిలిపెట్టి వెళ్లాక మనిషి పుట్టుక, జీవనం, మరణాలపై జరుగుతున్న చర్చలన్నింటినీ విన్నాడు. వాటన్నిటినీ అర్థం చేసుకుని, క్రోడీకరించి తన దైన ఒక తాత్వికతను సృష్టించుకున్నాడు. అందువల్లనే ఆనాటి సమాజంలో తప్పుగా ప్రచారమవుతున్న దేవుడు, సృష్టి, జననం, మరణం అనే అంశా లనూ, ప్రత్యేకించి ప్రముఖంగా ప్రచారమవుతున్న అసత్యాలనూ ఆయన తన తాత్విక పరిశోధనలో నిగ్గుతేలిన సత్యాలతో తిప్పికొట్టిన వైనానికి అగ్గన్న సుత్త అద్దం పడుతుంది.
మనిషి కేంద్రంగా సాగిన బౌద్ధ తత్వం
బుద్ధుని తర్వాత ప్రపంచం దాదాపు 2,600 సంవత్సరాలు ప్రయాణం చేసింది. జీవరాశుల పుట్టుక నుంచి మొదలుకొని మానవ పరిణామక్రమం, శతాబ్దాల క్రమంలో ప్రకృతిలో చోటుచేసుకున్న అనేక మార్పులపై, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం లాంటి ఎన్నో ఇతర అంశాలపై చాలా విస్తృత పరిశో ధనలు జరిగాయి. ఎన్నో నూతన అంశాలను ఆవిష్కరించారు. మనిషి క్రమంగా శాస్త్రీయ పరిశోధనా పునాదులపై ఆధారపడి అన్ని విషయాలను అర్థం చేసుకుంటున్నాడు. ఈ ప్రపంచాన్ని దేవుడే సృష్టించాడని, అంతా ఆయన కనుసన్నల్లోనే సాగుతుందని మనిషి విశ్వసించినట్టయితే, ప్రపంచ గమనం ఆగిపోయేది. అటువంటి విశ్వపరిణామాన్ని పరిశోధించే క్రమానికి శ్రీకారం చుట్టినది గౌతమ బుద్ధుడు. అందువలన ఆ తర్వాత ఎన్నో తాత్విక, శాస్త్రీయ ఆలోచనలకు అంకురార్పణ జరిగింది.
భూమి, విశ్వం, విశ్వాంతరాళాల గురించి ఎన్నో నూతన ఆవిష్కరణలు వచ్చాయి. ఖగోళ శాస్త్రంతోపాటు, ఎన్నో విషయాలపైన పరిశోధనలు జరి గాయి. మనిషి గ్రహాలనూ, గ్రహాంతరాలనూ తరచి చూశాడు. అసాధ్యాలను సాధ్యాలుగా మలిచాడు. శాస్త్రీయ ఆలోచనలతో తనను తాను పునరుజ్జీవిం పజేసుకున్నాడు. పాతకాలపు తిరోగమన భావజాలాన్ని వదిలించుకొని ఎప్ప టికప్పుడు తనను తాను నూతన మానవునిగా తీర్చిదిద్దుకునేందుకు వినూ త్నంగా ప్రయత్నించాడు. సరిగ్గా ఇక్కడే బుద్ధుని ఆలోచనలు మరొకసారి స్ఫురణకు వస్తాయి. ‘‘నీకు నీవే యజమానివి. నీ భవిష్యత్‌ను నువ్వే నిర్మిం చుకో’’ అన్న ఆయన ప్రబోధం ప్రపంచం పట,్ల మనిషి పట్ల ఆయన తాత్విక చింతనకు అద్దం పడుతుంది. మనిషి ఎప్పుడైనా తన శక్తి మీద ఆధారపడి మాత్రమే జీవించాలే తప్ప, ఎవరో ఆదుకుంటారనో, ఏ భగవంతుడో, ఏ మానవాతీత శక్తులో మనిషికి అన్నీ సమకూరుస్తాయనే భావనను తిరస్క రించాలని బుద్ధుడు బోధించాడు. మనుషులు తమ జీవితాలను తీర్చిదిద్దు కోవడానికి దేవుడు, లేదా అతీంద్రియ శక్తుల అవసరం లేదని, తద్వారా సమాజ పురోభివృద్ధి సాధ్యం కాదని ఆ రోజుల్లోనే ఆయన స్పష్టంగా తేల్చి చెప్పాడు.
బౌద్ధం మనిషి కేంద్రంగా రూపొందినది. దేవుడు, అదృశ్యశక్తుల ప్రమేయం అందులో లేదు. అదేవిధంగా గౌతమ బుద్ధుడు, తాను దేవుడి ననో, దైవదూతననో, ప్రవక్తననో చెప్పుకోలేదు. తాను జ్ఞానం పొందిన వాడి నని మాత్రమే చెప్పుకున్నాడు. తనలాగే ఎవరైనా ఇటువంటి జ్ఞానాన్ని పొంద వచ్చుననే విశ్వాసాన్ని కలిగించాడు. అందువల్లనే బౌద్ధాన్ని అనుసరిస్తున్న దేశాల్లో మావన సంపద చాలా శక్తిమంతంగా రూపొందుతున్నది. అక్కడి వారు తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే శక్తిని కలిగి ఉంటున్నారు. ఇది బౌద్ధం తాత్వికతకు ఉన్న బలంగా మనం అర్థం చేసుకోవచ్చు.
(హైదరాబాద్‌లో నేటి నుంచి ప్రారంభమౌతున్న ప్రపంచ బౌద్ధ వారసత్వ ఉత్సవాల సందర్భంగా...)
- మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213