నగరంలో మానవతా బుద్ధిజం ప్రచారం
బుద్ధ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ స్థాపన
కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లో ఏర్పాటు
మన బౌద్ధ ప్రదేశాలపై దేశ, విదేశాల్లో గుర్తింపు
‘మనిషి మనసు నుంచే యుద్ధాలు పుట్టు కొస్తాయి.. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ప్రపంచ శాంతి స్థాపన సాధ్యం అవుతుంది’ అన్న బుద్ధుడి మాటలే వారికి స్ఫూర్తి.. ఆయన ప్రవచించిన పంచశీల లక్షణాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.. అంతేకాదు ఆయన బోధనలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి చేస్తున్నారు. ప్రజల్లో మానసిక ప్రశాంతతను నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రాల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లో బోధిసత్వ బుద్ధ్ధవిహార్ పేరుతో క్షేత్రాన్ని స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారే బుద్ధా లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ప్రతినిధులు.
మానవతా బౌద్ధ ధర్మం..
హైదరాబాద్ చాప్టర్ ప్రధాన కార్యాలయం ఫోగువాంగ్ షాన్ పేరుతో తైవాన్‌లో ఉంది. మానవతా బుద్ధిజాన్ని విరివిగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా మైండ్ కల్చర్‌ను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. ఈ సంస్థ హైదరాబాద్ శాఖకు ప్రధాన సలహాదారు అయిన డాక్టర్ బాలు సావ్లా 15 ఏళ్లుగా పని చేస్తున్నారు. రెండు సార్లు ఈ సంస్థకు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
విద్య, వైద్య సేవలు..
హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో విద్య, వైద్య పరమైన సేవలు అందిస్తున్నారు. ప్రజల్లో మానసిక ప్రశాంతత గురించి అవగాహన కలి్పస్తూనే చాలా ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.
దేశ, విదేశాల్లో ప్రచారం..
తెలంగాణలో బౌద్ధ మతం ఒకప్పుడు విరాజిల్లింది. బుద్ధుడు నడయాడిన ఘనమైన చరిత్ర మన నేలకు ఉంది. కాలక్రమేణా బౌద్ధమతం కనుమరుగైనప్పటికీ అప్పటి ఆనవాళ్లు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆ చరిత్ర గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు డాక్టర్ బాలు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, చైనా, కెనడా వంటి దేశాలప్రజలకు ఇక్కడి బౌద్ధ క్షేత్రాల గొప్పదనాన్ని చాటి చెబుతున్నారు.
మానసిక ప్రశాంతత అవసరం..
ప్రస్తుతం ఉన్న బిజీ జీవన విధానంలో మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. బుద్ధుడు చూపిన మార్గంలో వెళ్తే సులువుగా దాన్ని సాధించవచ్చు. ఇప్పటి తరానికి బుద్ధుడి బోధనలు ఎంతో అవసరం. – డాక్టర్ బాలు సావ్లా, బుద్ధ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్, హైదరాబాద్ శాఖ ప్రధాన సలహాదారు
Comments
Please login to add a commentAdd a comment