
బాబా సాహెబ్ డా‘‘ బీఆర్ అంబేడ్కర్ 1956, అక్టోబర్ 14న నాగపూర్‌లో లక్షల మంది అనుచరులతో హిందూ మతాన్ని వదిలి, బౌద్ధం స్వీకరించారు. నాగపూర్ నాగజాతి ప్రజలు జీవించిన భూమి గనుక,వారంతా బౌద్ధులు గనుక, తాను బౌద్ధం స్వీకరించడానికి నాగ పూర్‌ను ఎంచుకున్నానని ఆయన ప్రకటించారు. అంతే గాని, నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ వారి ప్రధాన కార్యాలయం ఉంది గనుక, వారి ప్రాముఖ్యం తగ్గించడానికి తను ఆ పట్టణాన్ని ఎంచుకోలేదనీ వివరణ ఇచ్చారు. అయితే,ఆ తర్వాత 52 రోజులకే (డిసెంబర్ 6) అంబేడ్కర్ కన్ను మూశారు. ఆయన మరణం వెనుక ఓ కుట్ర ఉందనీ, ఆయన మరణించిన నాటి నుండి నేటి దాకా ఒక ఆరో పణ ఉంది. ఆ ఆరోపణ నిజం కాదని అటు భారత ప్రభుత్వం గానీ, ఇటు ఆరోపణలు ఎదుర్కొన్న వర్గాలు గానీ ఆధారాలు, వివరణలు ప్రజల ముందు పెట్టలేదు. అందువల్ల అనుమానాలు అనుమానాల్లాగే ప్రజల మన సుల్లో సజీవంగా ఉన్నాయి.
ఆ రోజుల్లో జీవించి ఉన్న ఇ.వి.ఆర్. పెరియార్ తన వార్తా పత్రిక ‘విడుదలై’లో ఇలా రాశారు. ‘డాక్టర్ అంబే డ్కర్ చనిపోయారని అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తోంది. గాంధీ మరణం వెనుక ఏ కారణం, ఏ కుట్ర ఉన్నాయో అలాంటివే అంబేడ్కర్ చనిపోవడం వెనక ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను’ అంటూ చాలా వివరంగా రాశారు. మొత్తం మీద ఆయన వెలిబుచ్చిన ఆవేదనలోని సారాంశం ఏమిటంటే – గాంధీ మరణానికి కారకులెవరో, వారే అంబేడ్కర్ మరణాకి కూడా కారకులని! అందుకు అవకాశమిచ్చే పలు అంశాలు కూడా ఆ రోజుల్లో చాలా బయటికి వచ్చాయి. ‘తన తండ్రికి విషమిచ్చి తెలియకుండా చంపేశారని’ స్వయానా అంబేడ్కర్ కుమారుడు యశ్వంత్ ఒక అభిప్రాయం వెలిబుచ్చారు.
అంబేడ్కర్ అభిమానులంతా యశ్వంత్‌ను బలపరిచారు. అంబేడ్కర్ మరణవార్త ఈ దేశ ప్రజలకు అనుమానాస్పదమైన వార్త అయింది. ‘తన తండ్రిది సహజ మరణం కాదనీ, హత్య అనీ – దోషులెవరో తేల్చాలనీ – అంబేడ్కర్ కుమారుడు యశ్వంత్ నాటి ప్రధాని నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ మరణం తర్వాత పదకొండవ రోజున, ఆయన అనుయాయులు ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. నాటి ప్రధాని, రాష్ట్ర పతులకు లిఖితపూర్వక నివేదికలు, విన్నపాలు అంద జేశారు. అంబేడ్కర్ మరణం వెనక ఏం జరిగిందో తేల్చాలని వారు డిమాండ్ చేశారు.
నాటి ప్రధాని నెహ్రూ స్పందించి నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కమిటీ భారత ప్రభుత్వానికి అందజేసిన రిపోర్టు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల ముందుపెట్టలేదు. ఒకవేళ రహస్యాలేవీ లేకపోతే, అది బయటపెడితే అన్ని అనుమానాలకూ తెరపడినట్ట య్యేది కదా! ఢిల్లీ పోలీస్ ఐజీ ఇచ్చిన వివరణను మాత్రం 1957 నవంబర్ 27 నాడు – అంటే దాదాపు సంవత్సరం తర్వాత, అప్పటి హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్‌తో పార్లమెంట్‌లో ఒక ప్రకటనగా ఇప్పించారు. ‘అంబేడ్కర్ మరణం సహజమైందని’– ఆ ప్రకటన సారాంశం! అదొక కంటి తుడుపు ప్రకటన అని దేశ ప్రజలు ఆనాడే భావించారు.
అసంతృప్తితో రగిలిపోయారు. ఆనాటి నుండి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వ్యాసాలు, పుస్త కాలు ప్రచురింప బడుతూనే ఉన్నాయి. అసహనం, అసంతృప్తి ఏదోరకంగా బయట పడుతూనే ఉంది. తాజాగా ఈ మధ్యే 2021 జనవరి 26 నాడు నాగపూర్ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు – అంబేడ్కర్ ఎలా చని పోయారో తేటతెల్లం చేయాలని పెద్దఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నా రంటే... ఆ తేదీన అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది గనుక! వారి పాత్ర లేకపోతే జనం వెళ్ళి వారి కార్యాలయం ముందు ఎందుకు నిరసన ప్రదర్శనలిస్తారూ? అర్థం చేసుకోవా ల్సిన విషయం!
నెహ్రూజీ తొలి ప్రధాని అయ్యారు కాబట్టి, సోష లిజానికి, వైజ్ఞానిక ప్రగతికి ఆయన ప్రాధాన్యమిస్తూ వచ్చారు. అప్పుడు వీరి ఆటలు అంతగా సాగలేదు. అయినా, వారి లక్ష్యసాధనకు వారు నిరంతరం కృషి చేస్తూనే వస్తున్నారు. దాని ఫలితాలను నేడు కూడా మనం చూస్తూనే ఉన్నాం! అంబేడ్కర్‌ది సహజ మరణమా? లేక హత్యా అనేది ఆరోజుల్లో బయటికి రాలేదు.
67 ఏళ్ళ తర్వాత, ఆధారాలన్నీ చెదిరిపోయిన తర్వాత, ఇప్పుడు బయటికి వస్తుందన్న నమ్మకం లేదు గానీ – గతంలో జరిగిన కొన్ని వాస్తవాలు ఈ తరానికి తెలియజేయడం అవసరం అనిపించింది. అయితే,బాబా సాహెబ్ అర్ధంతరంగా వదిలేసిన కర్తవ్యాలనూ, రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధననూ ఈ తరం యువతీ యువకులు ముందుకు తీసుకుపోవాల్సి ఉంది. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతూ ఉండా ల్సిందే!
డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత
(నేడు అంబేడ్కర్ వర్ధంతి)