అభిప్రాయం
నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ 3.0 ప్రభుత్వం 2024–25కి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి సమాయత్తమవుతోంది. దీనిమీద అందరిలోనూ ఆసక్తి నెలకొని వుంది. అణగారిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రపంచ వ్యాప్తమైన ఆర్థికాభివృద్ధిలో భారతదేశం భాగస్వామ్యం కాగలుగుతుందని అంబేడ్కర్ ఏనాడో చెప్పారు. షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన జరగాలంటే, వారికి భూములను పంచే ముఖ్య విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా అంబేడ్కర్ సూచించారు. దానికి బడ్జెట్‌లో ప్రాధాన్యమివ్వాలి. కుల నిర్మూలనకు, స్త్రీ సాధికారతకు, వ్యవసాయ కూలీలను వ్యవసాయదారులుగా మలిచేందుకు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసేలా, కొత్త ఉద్యోగాలు కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు జరపాలి.
2024–25 సంవత్సరానికి కేంద్రంలోని నూతన ఎన్డీఏ ప్రభుత్వం జూలై 22, 23 తేదీల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా దళితుల్లోనూ, స్త్రీలలోనూ, ఆదివాసీలలోనూ కొత్త ఆశలు కలుగుతున్నాయి. మొత్తం పార్లమెంట్‌లో 111 మంది దళిత ఎంపీలు ఉన్నారు. అస్పృశ్యతా నిర్మూలనకు, కుల నిర్మూలనకు, స్త్రీ సాధికారతకు, వ్యవసాయ కూలీలను వ్యవసాయదారులుగా మలిచే అంశాల పట్ల దేశంలో ఎంతో ఆసక్తి నెలకొనివుంది.
ఈ క్రమంలో ముఖ్యంగా స్త్రీ సాధికారత భారతదేశంలో చాలా అవసరంగా కనిపిస్తుంది. పురుషుల సంఖ్యతో దాదాపు సమానంగా ఉన్న స్త్రీలలో 20 కోట్ల మందికి పనిలేదు. ముఖ్యంగా దళిత స్త్రీలకు సొంత భూమి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. భూమి చరిత్ర చూస్తే భూస్వామ్య ఆధిపత్య కులాలకే భూమి ఉంది. భూమి ఉత్పాదకతపై వారికి పూర్తి అవగాహన ఉండేది. సమాజంలో వారు బలమైన వర్గంగా వ్యవహరించేవారు. అందుకే కేంద్ర పాలకులు వారిని విస్మరించడం కానీ, వారితో వైరం పెట్టుకోవడం కానీ జరిగేది కాదు. తరతరాలుగా పాలకవర్గాలు అగ్రకులాలకు భూ వసతిని కల్పించడంలోనూ, వాటికి నీటి వసతి కల్పించడంలోనూ జాగరూకతతో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ భూపరిమితి చట్టాన్ని 1958లో అప్పటి ప్రభుత్వం తెచ్చింది. అది జూన్ 1961లో అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకూ దానికి తూట్లు పడుతూనే వున్నాయి. ప్రధానమైన విషయం ఆంధ్రప్రదేశ్ వ్యావసాయిక రాష్ట్రం. ఇందులో 69.7 శాతం మంది వ్యవసాయ కూలీలు. అందులో 90 శాతం మంది దళితులు. ఈ దళితులకు ఉన్నత స్థాయి కలిగించాలంటే తప్పకుండా వీరికి భూమి ఇవ్వాలి. రాను రాను వ్యవసాయ కూలీపని మీద శిథిలమౌతున్న వృత్తులవారందరూ ఆధారపడుతున్నారు.
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భూమి రేటు విపరీతంగా పెరగడం వల్ల ఏ వ్యవసాయ కూలీలైతే భూమిని చదును చేసి వ్యవసాయీకరించారో వారు భూమి కొనలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. అలాగే కృష్ణా డెల్టాలో అసలు మిగులు భూమి లేదని అధికారులు ప్రకటిస్తున్నారు. ఇటు వ్యవసాయ కూలి పని లేక, అటు ప్రభుత్వం భూమి ఇవ్వక, గ్రామాల్లో ఉండే పరిస్థితులు లేక తీవ్రమైన వలసలకు దళితులు గురి అవుతున్నారు.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కనీసం రూ.1,000 కోట్లు అయినా భూమి కొనుగోలు పథకానికి కేటాయించవలసిన అవసరం ఉందని సామాజిక ఆర్థిక శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు. ఈ విషయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మొదటి ప్రణాళిక సంఘంలోనే భూమి కొనుగోలు పథకానికి 20 కోట్ల కేటాయింపు చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి.
అంబేడ్కర్ 1954 సెప్టెంబర్ 6వ తేదీన రాజ్యసభలోని చర్చల్లో ఇలా నివేదించారు: ‘‘ఆర్యా! నేనిప్పుడు షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన సమస్యను ప్రస్తావిస్తున్నాను. చదువుతో పాటుగా ఉద్యోగాలు కూడా షెడ్యూల్డ్ కులాల ఆర్థిక హోదా పెరుగుదలకు ఎక్కువ ప్రాధాన్యమైనవి. అయితే ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల ఆర్థిక హోదా పెరుగుదలకు ఏమి అవకాశాలున్నాయి? షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన లాభదాయకమైన వృత్తులలో ప్రవేశం పొందే అవకాశం మీదనే ఆధారపడి ఉందని స్పష్టమైంది.
లాభదాయకమైన వృత్తుల్లోకి ద్వారాలు తెరవబడనంత వరకు, వారి ఆర్థిక విమోచన జరిగే వీలు లేదు. వారు బానిసలుగానే మిగిలి పోతారు. బానిసలు కాకపోయినా, గ్రామాలలో భూస్వాముల సేవకులుగా మిగిలిపోతారు. ఆ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఆర్యా! నిస్సందేహంగా షెడ్యూల్డ్ కులాల వారికి ప్రభుత్వంవారు భూమిని పంచే ముఖ్యమైన విషయంపై దృష్టి ఉంచాలి. భూస్వాముల పొలాలపై పరిమితిని విధించి, అంతకన్నా ఎక్కువ ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దానిని షెడ్యూల్డ్ కులాల వారికి ఇవ్వాలి. రెండవదేమిటంటే అమ్మకానికి వచ్చిన భూమిని కొనుక్కోవటం కోసం వారికి ఋణాలివ్వాలి.’’
ఇకపోతే స్త్రీలకు భారతదేశ వ్యాప్తంగా కుటీర పరిశ్రమలు రూపొందించి వాటిని వస్తూత్పత్తి కేంద్రాలుగా రూపొందించాలి. అక్కడ తయారైన వస్తువులకు ప్రపంచ మార్కెట్‌లో స్థానం ఏర్పాటు చేయగలిగితే మన స్త్రీలు చైనాను మించిపోతారు. నిజానికి గత రెండు దశాబ్దాలుగా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చైనా నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల గ్రాడ్యుయేట్ యువతలో నిరుద్యోగ రేటు 42 శాతానికి పెరిగింది. దీని వల్ల నిరుద్యోగులలో నిరాసక్తత, సోమరితనం పెరుగుతున్నాయి.
మత్తు మందుల వాడకం పెరగడానికి కూడ నిరుద్యోగితే కారణం. ఈ నిరుద్యోగుల్లో మహిళలు ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. స్త్రీల విద్య, ఉపాధి విషయాల గురించి అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్లులోనూ, ఆ తరువాత పార్లమెంట్ చర్చల్లోనూ ఎన్నో సలహాలు ఇచ్చారు. వాటిని పెడచెవిన పెట్టడం వల్లే ఈ రోజున స్త్రీలు చదువుకొని కూడా అటు వ్యవసాయపని చేయలేకా, ఇటు ఉద్యోగం దొరక్కా సంక్షోభంలో ఉండిపోయారు. నిరుద్యోగ నిర్మూలన కోసం బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసేలా, కొత్త ఉద్యోగాలు కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు జరపాలి. దళిత విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను దేశం మొత్తంగా మండలానికి ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి గురుకుల పాఠశాలల్లోనే దళితులకు సరైన విద్య, ఆహారం లభిస్తాయి.
ఈ బడ్జెట్‌లో కుల నిర్మూలన కోసం, కులాంతర వివాహితుల రక్షణ కోసం కూడా కేటాయింపులు తప్పకుండా అవసరం. కుల నిర్మూలనను ఒక ఉద్యమంగా చేపట్టడం వల్ల సమాజంలో విస్తృతమైన మార్పులు వస్తాయనీ, సామాజిక సమతుల్యత ఏర్పడుతుందనీ అంబేడ్కర్ స్పష్టం చేశారు. అందుకే సాంఘిక స్వాతంత్య్రాన్ని, మేధా స్వాతంత్య్రాన్ని, ఆర్థిక స్వాతంత్య్రాన్ని, రాజకీయ స్వాతంత్య్రాన్ని ప్రజలకు కలిగించాలంటే దానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు ఉండాలని సూచించారు.
దేశ బడ్జెట్ అనేది ఉత్పత్తి శక్తుల మానసిక, శారీరక సౌష్టవాన్ని పెంచే దిశగా ఉండాలన్నారు. తాగుడు, సిగరెట్, ఇతర వ్యసనాల నుండి దూరం చేసే నైతిక అధ్యయన కేంద్రాలు పెంచడం వల్ల సంపద మిగులు ఏర్పడుతుందని చెప్పారు. యువకుల నైపుణ్యాలను పెంచే కేంద్రాలను పెంచడం వల్ల వాళ్లు ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందగలుగుతారనీ, ఆధీనత భావాన్ని తగ్గించే దిశగా బడ్జెట్ ఉండాలనీ సామాజిక, ఆర్థికవేత్తలు కోరుతున్నారు.
శ్రమ నుండే మానవాళి అభివృద్ధి జరుగుతుంది. శ్రమ నుండే చైతన్యం వస్తుంది. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీలు కల్పించినా ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందరు. వారిలో ఉత్సాహాన్ని, జీవన భద్రతని కల్పించాలంటే వారు చేసే పనికి ప్రతిఫలం లభించాలి. ‘ప్రభుత్వం ఏదైనా ఇస్తే బతుకుదాం’ అనే పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టబడుతున్నారు. దీని వల్ల చాలా నష్టం కలగడమే కాక జాతుల్లో అలసత్వం పెరిగే ప్రమాదం ముంచుకొస్తుందని అంబేడ్కర్ ప్రజలకు ఉద్బోధించారు.
నిజానికి ఆయన భూమిని జాతీయం చేయండి, పరిశ్రమలను జాతీయం చేయండి అని పిలుపును ఇచ్చిన మేధావి. భారతదేశంలో అణగారిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రపంచవ్యాప్తమైన ఆర్థికాభివృద్ధిలో భారతదేశం భాగస్వామ్యం కాగలుగుతుందని చెప్పారు. విద్య, విజ్ఞానం, ఉత్పత్తి, భూపంపిణీ, సామాజిక అభివృద్ధి, పారిశ్రామికీకరణ, స్త్రీ అభివృద్ధి, యువశక్తి వినియోగం, వృద్ధుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, నదుల అనుసంధానం... వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగినపుడు భారతదేశం నిజమైన వికాసాన్ని, ప్రాభవాన్ని పొందుతుందని చెప్పారు. ఆ దిశగా పాలకులు, ప్రజలు నడుస్తారని ఆశిద్దాం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment