విశ్లేషణ
కులానికీ, వర్ణానికీ ఉన్న సంబంధాన్ని సామాజిక శాస్త్ర పునాదిగా చర్చిస్తే గానీ కులానికి ఉన్న పట్టు మనకు అవగతం కాదు. వర్ణ వ్యవస్థ నాలుగు వర్ణాలను పేర్కొంది. అవర్ణులుగా పంచములను పేర్కొంది. ఐతే ఆ విభజన సిద్ధాంతం, ప్రయోగంలో భారతదేశంలో శాఖోపశాఖలుగా విస్తరించింది. అంబేడ్కర్ కులనిర్మూలనను శాస్త్రబద్ధంగా నమ్మారు. భారతదేశంలో కులం పునాదులను అర్థం చేసుకున్న తర్వాత కుల నిర్మూలనా సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము, ఒక నీతిని నిర్మించలేమని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను బోధించారు. సమానత్వపు విలువలను బోధించే భారత రాజ్యాంగమే కులనిర్మూలనా జీవన విధానానికి దిక్సూచి.
భారతదేశంలో కులం మూలాల గురించి చాలా చర్చ జరిగింది. కులం పునాదుల గురించి రాసిన వారిలో వి.ఎ.స్మిత్, జె.హెచ్.హట్టన్, హెచ్.హెచ్.రిజ్లీ, ఎస్.వి. కేత్కర్, జి.ఎస్.ఘుర్యే, జ్యోతిబా ఫూలే, బి.ఆర్.అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా లాంటి ఎందరో ఉన్నారు. హట్టన్ కులాన్ని ఇలా విశ్లేషించారు: ‘‘క్యాస్టు అనే మాట, కాస్టా అనే పోర్చుగీసు శబ్దం నుండి వచ్చింది. ‘కాస్ట’ అను శబ్దము ‘చాలు’, ‘జాతి’, ‘రకము’ అను పదముల అర్థమును తెలుపును. ఆ భాషలో ‘హోమెన్ డీబోవ కాస్టియ అను పద సమూహమునకు ‘మంచి కుటుంబంలోని మనిషి’ లేక ‘కులీనుడు’ అని అర్థము’’.
1563లో గార్సియా డి ఓర్టా ‘తన తండ్రి వృత్తి నుండి ఎవడూ మారడు. చెప్పులు కుట్టు ఒకే కులం వారంతా ఒకటే’ అని రాసిన నాటి నుండి ఈ ‘కాస్ట’ మాటను మనమిపుడు గ్రహించు పరిమితమైన ‘కులం (కాస్టు)’ అనే అర్థములో వాడుతున్నట్లు కనిపిస్తున్నది. హట్టన్ ‘కాస్ట్ ఇన్ ఇండియా’ అనే గొప్ప గ్రంథం రాశారు. అది ప్రపంచ వ్యాప్తంగా చాలా చర్చకు దారి తీసింది.
అలాగే రిజ్లీ కులం గురించి ఇలా రాశారు: ‘‘కులం కొన్ని కుటుంబాల సముదాయంగా లేదా కుటుంబ సమూహాల సముదాయంగా ఉండి సామాన్య (ఒకే) నామాన్ని కలిగి ఉంటున్నది. ఒకే మానవుని నుండి లేదా దైవాంశ గల పురాణ పూర్వీకుని నుండి వంశక్రమాన్ని చెప్పుకుంటున్నది. వారస త్వంగా వచ్చిన ఒకే వృత్తిని అనుసరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించుకుంటున్నది.’’.
కులం అనేది వర్ణ వ్యవస్థ నుండి రూపొందించబడిందని ఘుర్యే విశ్లేషించారు: ‘రంగు అను అర్థం గల ‘వర్ణం’ సమాజంలోని వర్గాలను వివరించుటకు వాడబడింది. తరువాత ‘జాతి’ పదం పుట్టుకతో వచ్చిన సమూహ సభ్యత్వమును ‘కులము’గా తెలుపుటకు ప్రత్యేక ముగా ఉపయోగించబడింది’. ‘ఒకడు దేనిలో పుడతాడో అది’ అని ‘జాతి’ శబ్దానికి వ్యుత్పత్తి అర్థం. దీనిని ‘వర్ణా’నికి సమానార్థంలో యోగ్యులైన ప్రాచీన సాధికారులు అడపా దడపా వాడారు.
ఈ కులం మూలాల మీద జరిగిన చర్చ తరువాత కులం మూలాలు వర్ణ వ్యవస్థలో ఉన్నాయనేది స్పష్టమైంది. ఒంటి రంగును బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు ప్రత్యేకింపబడినట్లు తెలుస్తుంది. ‘కపిల వర్ణం బ్రాహ్మణుడు, అరుణ వర్ణం క్షత్రియుడు, గోధుమ వర్ణం వైశ్యుడు, కృష్ణ వర్ణం శూద్రుడు’ అని నామలింగాను శాసనం చెబుతుంది. ఈ సందర్భంగా సామాజిక శాస్త్రవేత్తలు పంచమ వర్ణం ఎలా పుట్టిందో చర్చించారు.
వర్ణశబ్దం ఋగ్వేదంలో ప్రార్థ, మలాని ఆర్యులకూ, దస్యులకూ తేడాని తేల్చేదిగా వాడారు. ఋగ్వేదం పదవ మండలం రచనా కాలానికి 4 వర్ణాలు పేర్కొన బడ్డాయి. నాలుగు వర్ణాలలో మూడు ఆర్య వర్ణాలు కాగా నాల్గవది ఆర్యేతర వర్గం. అందుకే ఈ నాల్గవ వర్ణం వారు బ్రహ్మ పాదాల నుండి జనించారని చెప్పబడింది. వీరు ఆర్య సమాజంలో కలిసి నాల్గవ మెట్టులో జీవించే సామాజిక చారిత్రక పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ వర్ణ సమాజానికి దూరంగా జీవించిన చండాలురు, పిపీలకాదులు, నిషాదులు పంచములుగా పిలవబడి ఆ తరువాత కాలంలో అస్పృశ్యులు అయి నారు. వీరిని ఋగ్వేద కాలంలో వైదికార్యులు అస్పృశ్యులుగా పరిగణించలేదు, పంచజనులుగా మాత్రమే పరిగణించారు.
వర్ణ వ్యవస్థ నాలుగు వర్ణాలను పేర్కొంది. అవర్ణులుగా పంచములను పేర్కొంది. ఐతే ఆ విభజన సిద్ధాంతం ప్రయోగంలో భారతదేశంలో శాఖోపశాఖలుగా విస్తరించింది. అవి శాఖలుగా ఉపశాఖలుగా వంశపారంపర్య తత్వంతో అంతశ్శాఖ వివాహ సంబంధాలు మాత్రమే కలిగి కుంచించుకు పోయాయి. ఆర్యులు వర్ణతత్వాన్ని భారతదేశానికి మోసుకు రాకముందు ఈ విధమైన విభజన భారతదేశంలో లేదు.
అంబేడ్కర్ భారతదేశంలో కులం పునాదులను అర్థం చేసుకున్న తర్వాత కుల నిర్మూలనా సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. ఈ సంద ర్భంగా ఆయన అప్పటికి ప్రసిద్ధంగా ఉన్న అన్ని పార్టీల సిద్ధాంతాల తోనూ, నాయకులతోనూ పోరాడారు. మహత్మాగాంధీకి సమాధాన మిస్తూ తన కులనిర్మూలనా వాదనను లేఖ ద్వారా తెలియజేశారు:
‘నా ఉద్దేశంలో హిందూ సమాజం కులరహిత సమాజం అయినప్పుడు మాత్రమే అది తనను తాను రక్షించుకొనే శక్తినీ, సామర్థ్యాన్నీ సంతరించుకోగలదు. ఆంతరంగికమైన బలం లేకుండా హిందువులకు స్వరాజ్యం వచ్చినా, అది మళ్ళీ దాస్యం వైపు ఒక అడుగు ముందుకు వెయ్యడమే కావచ్చు. బాగా ఆలోచించండి’ అని గాంధీకి విన్నవించారు.
అంబేడ్కర్ కులనిర్మూలనను శాస్త్రబద్ధంగా నమ్మారు. కులం చేత పీడింపబడుతున్న వారిలో అస్పృశ్యులుగా చెప్పబడుతున్న పంచమ వర్ణులు ప్రధానంగా ఉన్నారని గుర్తించారు. అస్పృశ్యతను పాటించడం వల్ల భారతదేశంలో సోషలిజం రాదని కూడా చెప్పారు. సోషలిస్టులు, కమ్యూనిస్టులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. బుద్ధుడు, మహత్మా ఫూలే స్ఫూర్తితో అంబేడ్కర్ తన సిద్ధాంతాలు రూపొందించు కున్నారు.
భూములను జాతీయం చేయండి, పరిశ్రమలను జాతీయం చేయండి, స్త్రీలకు సమాన హక్కులు కలుVýæజేయండి, బహుజనులు రాజ్యాధికారానికి సొంతంగా ఉద్యుక్తులు కండి అని ప్రబో ధిస్తూ వెళ్ళారు. రామ్ మనోహర్ లోహియా తన ‘కులాల సమస్య’ గ్రంథంలో భారత రాజకీయాలు కులాల గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నా యని రాశారు.
ప్రజా సోషలిస్టు, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు కూడా కులీనులు, ధనవంతుల గుప్పిళ్లలోనే ఉన్నాయి. ఒకప్పుడు పండిత నెహ్రూ కూడా దేశంలో విప్లవ నాయకుడుగానే ఉండేవారు. కాంగ్రెసులోని ఈ నాయకులే సమానత్వం గురించి మాట్లాడుతూ ఉండేవారు. కాని ఇప్పుడు వారు ఎలా మారిపోయారు? వర్గ స్వభావం, వర్గ పక్షపాతం ఎప్పుడూ అంతరించవు. రామ్ మనోహర్ లోహియా రాజకీయాల్లో కులాధిపత్యాన్ని నిర్మూలించి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలని చెప్పారు.
పెరియార్ రామ స్వామి నాయకర్ 1924 మార్చిలో కేరళలో అస్పృశ్యత నివారణ కోసం ‘వైకోమ్’ ఉద్యమం నడుపుతూ, ఆత్మగౌరవ పోరాటానికి పిలుపు నిచ్చారు. ‘‘ఆత్మగౌరవం పట్ల అవగాహన ఉంటేనే స్వతంత్రం గురించి మాట్లాడగలుగుతాం. అయితే ఇప్పుడు స్వతంత్రం గురించి మాట్లాడుతున్నవాళ్ళు ఆత్మగౌరవాన్ని విస్మరిస్తున్నారు. ఆత్మగౌరవం లేని స్వతంత్రానికి అర్థమే లేదు’’ అని ఆయన ఆనాటి కాంగ్రెస్ నాయకులకు చురకలు వేశారు. తన ఇరవై యేళ్ళ వయస్సులోనే కాంగ్రెస్ సభలో రామాయణం, మహాభారతం, పురాణాలు, శాస్త్రా లను తీవ్రంగా విమర్శించేవారు.
నిజానికి భారతదేశంలో కుల నిర్మూలనా ఉద్యమాలుగా నడిచిన బౌద్ధం, జైనం, సాంఖ్యం ప్రేరణతో... ఫూలే, పెరియార్, లోహియా భావజాలంతో అంబేడ్కర్ మార్గంలో నడిస్తే ప్రత్యామ్నాయ సంస్కృతి రూపొందుతుంది. బహుజన రాజ్యాధికారాన్ని అనతి కాలంలో సాధించుకోవచ్చు. భారతదేశ రాజకీయాల్లో, సామాజిక వ్యవస్థల్లో, అన్ని మతాల్లో, పార్టీల్లో కులతత్వం చొచ్చుకుపోవడానికి కారణం అంబే డ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అందుకోకపోవడమే. అందుకే కులం పునా దుల మీద ఒక జాతిని నిర్మించలేము, ఒక నీతిని నిర్మించలేమని అంబేడ్కర్ చెప్పారు. కులానికి ప్రత్యామ్నాయంగానే ఆయన లక్ష పేజీల వాఙ్మయాన్ని రచించారు. కులనిర్మూలనా సిద్ధాంతకర్తగా పేరు పొందారు. అంబేడ్కర్ రచించిన రాజకీయ ప్రణాళికల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను బోధించారు. ఆయన బౌద్ధ సూత్రాలతో భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. భారత రాజ్యాంగమే కుల నిర్మూ లనా జీవన విధానానికి దిక్సూచి. ఆ మార్గంలో నడుద్దాం!
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment