
అభిప్రాయం
భారతదేశం ఈనాడు సామాజిక, ఆర్థిక సంక్షోభంలో ఉంది. రూపాయి విలువ అంతకంతకూ పతనం కావడం దేశ ఆర్థిక వ్యవస్థ దుఃస్థితిని తెలియజేస్తుంది. యువత నైరాశ్యంలో, మత్తులో కునారిల్లుతోంది. స్త్రీలైతే నిరక్షరాస్యతలో, మత కర్మకాండల్లో, పనిలేని తనంతో ఉత్ప్రేరక రహిత జీవితం జీవిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థల్లో కులవివక్ష, అస్పృశ్యత ఇంకా కొనసాగుతున్నాయి.
కొన్ని వర్గాల వారే సంపదలను స్వాధీనం చేసుకోవడం పెరుగుతోంది. కొన్ని కులాల వారే వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపార వ్యవస్థల మీద తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కులం పేరుతో సాంఘిక, ఆర్థిక సంస్థలు, విద్యా వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. కుల ఆర్థిక వ్యవస్థ బలీయమైనదిగా రూపొందుతున్నదని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
హర్షద్ మెహతా లాంటి ఒక సామాన్య వ్యక్తి ప్రభుత్వ ఆర్థిక సంస్థలను వినియోగించుకొని వేల కోట్ల సొమ్మును ఏమార్చాడు. అదే చిన్న పొరపాట్లకే ఎస్సీ, ఎస్టీ సివిల్ సర్వీసు ఉద్యోగులు శిక్షలను అనుభవిస్తున్నారు. నూతన ఆర్థిక విధానం, ఉన్నత కులాలకు తమ ఆర్థిక, సామాజిక అధికారాన్ని పటిష్ఠపరుచుకోడానికి కొత్త అవకాశాల్ని ఏర్పరచింది. ఇటీవల ఒక ఏజెన్సీ భారతదేశంలోని వంద మంది ధనవంతుల పేర్లని వెల్లడించింది. వారిలో ఒక్కడు కూడా దళితుడు లేడు.
భారతదేశంలోని అస్పృశ్యతా భావం వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. కారణం భూమి పంప కాన్ని ప్రభుత్వాలు నిరాకరించడం! భూములను కార్పొరేట్లకే ధారా దత్తం చేస్తున్నారు కానీ, పేద ప్రజలకు పంచడం లేదు. ఇటీవల సీపీఎం మహాసభలు జరిగినా వారు అస్పృశ్యతా నివారణ మీద, దళితులకు సాగు భూమి పంచాలనే అంశం మీద, కులనిర్మూలనా అంశం మీద తీర్మానం చేయకపోవడం గమనించదగ్గ విషయం.
పెరగని శాస్త్రీయ భావనలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 45 మంది ప్రాణాలు కోల్పోవటం విషాదకరం. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని విపరీత ప్రచారం జరగటంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి చేరారు. అంత మందికి అవసరమైన ఏర్పాట్లు చేయకపోవటం వల్లే ఈ ఘోరం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి.
అదే రాష్ట్రంలో అంతకుముందు హత్రాస్‌లో జరిగిన ఒక అధ్యాత్మిక కార్యక్రమంలో బోలే బాబా పాద ధూళి కోసం జనం ఎగబడిన సందర్భంలో తొక్కిసలాట జరిగి, 121 మంది చని పోయారు. ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన భక్తుల తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం చెందారు. హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పో యిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఆధునిక కాలంలోనూ శాస్త్రీయ భావనలు దేశంలో వెల్లివిరియడం లేదు. సాంకేతిక, వైజ్ఞానిక భావచైతన్యం పెరగడం లేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
అంబేడ్కర్ బాట అందరూ తమ రాజకీయ మేనిఫెస్టోల్లో దళిత వర్గాల స్త్రీల గురించే హమీలిస్తున్నారు. కానీ చివరకు శూన్య హస్తాలే చూపిస్తు న్నారు. ఈ విషయంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1951 అక్టోబర్ 28న తన ముంబయి ఎన్నికల ప్రచారంలో ఇలా విశ్లేషించారు: ‘ప్రతి రాజకీయ పార్టీ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అని ప్రతి రాజకీయ పార్టీ వాగ్దానం చేస్తుంది. భారత్‌లో అసలు సమస్య పేదరికం. ప్రతి ఏటా కోట్లాది రూపాయిల విలువ గల ఆహార ధాన్యాలు దిగుమతి చేసు కోవాల్సి వస్తే ప్రజలు ఎలా నెట్టుకు రాగలుగుతారు? ఈ విషయా లన్నింటికీ ప్రభుత్వ ఆలోచనల్లో తావులేదు’ అన్నారు.
ఆనాటి నుండి ఈనాటి వరకు పాలక వర్గాల మనస్తత్వంలో ఏ విధమైన మార్పూ లేదు. దీన్ని ఎదిరించి నిలబడే దళిత బహు జనులకు స్వీయ రాజకీయ చైతన్యం కావాలని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. రాజ్యాధికారమే ప్రధానమైన ‘కీ’ అని, దళిత బహుజన రాజ్యాన్ని నిర్మించినప్పుడే సంపద పంపిణీ అవుతుందని అన్నారు. లేదంటే పరిస్థితుల్లో మార్పులు రాకపోగా, మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
‘ఇవాళ దళితుల పరిస్థితి ఏమిటి? నాకు తెలిసినంత వరకూ ముందు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. అదే నిరంకుశత్వం, అదే అణచివేత. పరిపాలనలో అంతకుముందున్న వివక్షే కొనసాగుతోంది’ అన్నారు. అయినా వారికి ఉపశమనం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. అంబేడ్కర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఉద్దేశించి ఈ విశ్లేషణ చేశారు. అవి ఇప్పటికీ స్పష్టంగా అన్వయం అవుతున్నాయి.
భారతీయుల బాధ్యత
నిజానికి దేశంలో నిరుద్యోగం, పేదరికం, స్త్రీ అణచివేత ఇంకా కొనసాగుతున్నాయి. మరో పక్క ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. కానీ తయారీ రంగానికి అవస రమైన సమస్త యంత్రాలనూ దిగుమతి చేసుకుంటున్నాం. పరి శోధన, అభివృద్ధి రంగంలో మనం చేస్తున్న వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో 1 శాతం కంటే తక్కువ! పరిశోధన అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు సమకూర్చడం, నవకల్పనలను ఇతోధికంగా ప్రోత్సహించడం, కార్మిక శ్రేణుల నైపుణ్యాలను మెరుగుపరచడం అవసరమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలూ ఏవీ అమలు జరగడం లేదు.
రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక సూత్రాలు విధ్వంసానికి గురి అవుతున్నాయి. సమాఖ్య భావన తగ్గడంతో రాష్ట్రాల అస్తిత్వాలు సంఘర్షణలో ఉన్నాయి. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గిస్తూ కేంద్రం ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునే క్రమం సాగుతోంది. మేలిమి చదువులు, తీరైన వసతులు, ఉపాధి అవకాశాల కల్పన, అసమా నతల నివారణ ద్వారా జనం బతుకుల్లో వెలుగులు నింపాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని ప్రలోభస్వామ్యంగా మారుస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద శక్తులు ఏకం కావలసిన సమయం ఆసన్నమయింది. దేశంలో ఉత్పత్తిని పెంచు కొని, దేశ గౌరవాన్ని పెంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీ యుని మీద ఉంది. ఈ క్రమంలో అంబేడ్కర్ ఆలోచనలను స్వీకరించి అభివృద్ధి భారతానికి బాటలు వేయాలి.
డా"కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు
మొబైల్: 98497 41695
Comments
Please login to add a commentAdd a comment