ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అరుదైన భారతీయుడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్. అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటూ, విద్యను ఆయుధంగా ఎంచి ఎన్నో ఉన్నత డిగ్రీలు పొంది దేశానికి రాజ్యాంగ రచనలో దీపధారి అయ్యారు. దళితులూ, ఆదివాసీలూ, మహిళలూ, ఇతర అణగారిన వర్గాలకు ఆయన ఒక ధైర్య వచనం. తన కాలంలోనే గాక, ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా రక్తపాతాన్ని నివారించి, నిర్మాణాత్మక సామాజిక విప్లవాన్ని నడిపిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం ఆయన. ఆ మహాను భావుడి జ్ఞాపకార్థం 125 అడుగుల భారీ విగ్రహాన్నీ, ఓ స్మృతి వనాన్నీ నిర్మించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారాశుల ఆదరణను చూరగొంటోంది.
జనవరి 19వ తేదీన విజయవాడ ‘అంబే డ్కర్ నగర్’గా వెలుగొందుతుంది. ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాణంలో స్వాతంత్య్రం తర్వాత కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెలుగొందిన అంబేడ్కర్ శిల్ప నిర్మాణం అత్యు న్నతమైంది, విస్తృతమైంది. దక్షిణ భారతదేశానికి నడిబొడ్డున ఉన్న విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం, ఆవిష్కరణ, స్మృతివన వికాసం చెరపలేని సంఘటనలు. అశోకుని సాంచీ స్తూపానికి ఎంత పేరు వస్తుందో విజయవాడలోని స్మృతివనానికీ అంతే పేరు వస్తుందనడం అతిశయోక్తి కాదు. బౌద్ధమతాన్ని స్వీకరించి బౌద్ధునిగా మహాపరినిర్వాణం పొందిన అంబేడ్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ విగ్రహం కానీ, స్మృతివనం కానీ ప్రపంచ బౌద్ధ పర్యా టకులను ఆకర్షించడం తథ్యం.
నిజానికి బౌద్ధానికి ఈ ప్రాంతం కొత్తేమీ కాదు. అశోకుని కాలంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి బౌద్ధం విస్తరించింది. అమరావతి స్తూపం మొదటి దశ నిర్మాణాలు మౌర్యుల వాస్తు నిర్మాణాలనే పోలి ఉండటం, అనేక విద్దాంక నాణెములు (పంచ్ మార్క్‌డ్ కాయిన్స్) లభించడం, అశోకుని కాలపు నాటి బ్రాహ్మీ లిపిలోనే కొన్ని శాసనాలు లభించడాన్ని బట్టి ఆయన కాలంలోనే బౌద్ధం ఇక్కడికి వ్యాపించిందని చెప్పవచ్చు. అలాగే అప్పట్లోనే ఇవ్వాళ దళితులుగా వ్యవహరించ బడుతున్న జన సమూహాలు బౌద్ధాన్ని అవలంబించాయి.
అమరావతి స్తూపంపై ఉన్న... ఓ చర్మకారుడు స్తూపానికి ఇచ్చిన దానాన్ని తెలియచేసే శాసనం ఇందుకు మంచి ఉదాహరణ. దళితులు, కులవృత్తులవారే ఆ నాటి స్తూప నిర్మాణానికి రాళ్లు, మట్టినీ మోశారు. అద్భుత శిల్పాలను మలిచారు. అందుకే భారతదేశ చరిత్రలో మొదటి సాంస్కృతిక విప్లవం బౌద్ధం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. హిందూ మతోన్మాదం బౌద్ధ శిల్పాలను, స్తూపాలను, చైత్యాలను, ఆశ్రమాలను హింసాత్మకంగా కూల్చివేసింది. కానీ మళ్లీ డా‘‘ బీఆర్ అంబేడ్కర్ శిల్పంలో ఒక ప్రత్యామ్నాయ ప్రకాశిత, విభాసిత శిల్ప కాంతులు వెల్లివిరుస్తున్నాయి.
అంబేడ్కర్ విగ్రహమే ఒక విశ్వవిద్యాలయంలా ఉంటుంది. ఆయన వేలు ఒక ప్రశ్నోపనిషత్తు. ఆయన విగ్రహం విద్యా వికాసానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ప్రపంచ మానవుడు. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహం భారత దేశ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. లండన్ మ్యూజియం లైబ్రరీలో ఆయన చిత్రపటం ప్రపంచ మేధావుల పంక్తిలో మెరుస్తుంది. లండన్ ఇండియన్ హౌస్‌లో ఆయన బంగారు విగ్రహం ఆయన జీవన సాఫల్యానికి గుర్తుగా వుంది. అంబేడ్కర్ పోరాటం ద్వారానే అధికార ప్రతిష్ఠ జరుగుతుందని నొక్కి వక్కాణించాడు. దళితులను దేవుడిపైన లేక సూపర్ మ్యాన్ పైన ఆధారపడవద్దని హెచ్చరించాడు.
‘మీపై మీరు విశ్వాసం ఉంచుకొని నడవండి. ఎవరిపైనా ఆధార పడకండి. నిజాయితీగా ఉండండి. ఎప్పుడూ సత్యాన్ని ఆశ్రయించండి. దేనికీ లోబడకండి. ఎవరికీ తలవంచకండి’ అని అంబేడ్కర్ పిలుపు నిచ్చాడు. అంబేడ్కర్ ఒక ప్రవక్త, దార్శనికుడు. ఆయన ఒక జీవన వ్యవస్థల నిర్మాత. అణగారిన ప్రజల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు. ఆయన జీవించిన కాలంలోనే గాక ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. జాన్‌డ్యూ యిని అధ్యయనం చేసిన అంబేడ్కర్ ప్రజాస్వామ్య లౌకికవాది. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా, రక్తపాతాన్ని నివారించి, నిర్మా ణాత్మక సామాజిక విప్లవాన్ని ఆయన నడిపించారు.
ఇకపోతే అంబేడ్కర్ పార్క్‌ను మాయావతి గవర్నమెంట్ 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందించింది. ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆ పార్కు విస్తరించింది. అంబేడ్కర్, మహాత్మాఫూలే, పెరియార్, నారాయణ్ గురూ, సాహూ మహరాజ్ వంటి వారినే కాకుండా ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఎందరో పోరాట వీరుల విగ్రహాలను ఆ పార్క్‌లో ఆవిష్కరించారు. ప్రత్యామ్నాయ సంస్కృతికి ఆ పార్కు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది. వ్యక్తిత్వ నిర్మాణానికి సాంస్కృతిక విప్లవ పునరుజ్జీవానికి సాహిత్యంతోపాటు శిల్పసంపద కూడా ఎంతో ఉప యుక్తం.
కొన్ని శిల్పాలు మానవ మస్తిష్కాన్ని ప్రజ్వలింపచేస్తాయి. భారతదేశంలోని ఆర్కిటెక్చర్ ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్కిటెక్చర్‌లను సమన్వయం చేసుకుంది. భారతదేశానికి వలస వచ్చిన కుషానులు, అరబ్బులు, తురుష్కులు, పారసీకులు ఎందరో భారతీయ శిల్ప సౌందర్యానికి మురిసిపోయారు. వారి శిల్పనైపుణ్యాలు, భారతీయ శిల్ప నైపుణ్యానికి సమన్వయించారు. ‘గాంధార శిల్పం’ వంటివి రూపు దిద్దుకున్నాయి. మన అమరావతి శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. భారతదేశంలో ఈనాడు ప్రత్యామ్నాయ శిల్పసంపద అభివృద్ధి చెందు తోంది.
లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు ఉన్న డా‘‘ బీఆర్ అంబే డ్కర్ నిలువెత్తు విగ్రహం స్ఫూర్తితో ప్రతి ఊరిలో అంబేడ్కర్ విగ్రహం ఉండాలని ‘ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ’ కృషి చేసింది. అనేక గ్రామాలకు ఆ మహానుభావుడి విగ్రహాలను అందించింది కూడా! ఈ సందర్భంగానే అంబేడ్కర్ 150 అడుగుల విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్ర సచివాలయం ముందు నిలపాలని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటం చేసింది.
40 రోజులు సచివాలయం ముందు ధర్నా చేసింది. అంబేడ్కర్ యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలూ సపోర్ట్ చేశాయి. అయితే అంబేడ్కర్ వ్యతిరేక భావ వాది, అగ్రవర్ణ కుల అహంకారి, రాజకీయ కపటి, మానవ వనరుల విధ్వంసకుడు, ప్రకృతి వనరుల దోపిడీదారు, నేర రాజకీయ కోవి దుడు, దళిత ద్రోహి నారా చంద్రబాబు నాయుడు అంబేడ్కర్ విగ్రహా నికి బదులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ సచి వాలయం ముందే అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్ర హానికి పూనుకొని నిర్మించింది. జనవరి 19వ తేదీన ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం ఒక చరిత్రాత్మక సంఘటన. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంతో విజయవాడకు ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రజ్వలనం వస్తుంది.
అంతేగాకుండా చైనా, టిబెట్, థాయ్‌లాండ్, జపాన్, జర్మనీ, బర్మా, శ్రీలంక దేశాల నుండి యాత్రికులు వస్తారు. ఇక విజయవాడ భారతదేశానికే తలమానికమైన నగరంగా వెలుగొందుతుంది. కుల, మత, జాతి, లింగ భేదాలు తరమబడతాయి. ప్రపంచంలో పేరెన్నిక గన్న నగరాల్లో ఒకటిగా కీర్తించబడుతుంది. విద్యావ్యాప్తి పెరుగుతుంది. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేడ్కర్ నినా దాన్ని ఈ నిలువెత్తు విగ్రహం పదే పదే గుర్తుచేసి ప్రజారాశులను చైతన్యవంతం చేస్తుంది.
అంబేడ్కర్ స్మృతివనం ఏమి చెప్తుందంటే పిల్లల్ని విద్యావంతులు చేసుకోండి. కుల, మత భేదాలు లేని సమసమాజాన్ని నిర్మించుకోండి. హింసలేని కరుణ, ప్రజ్ఞ, నీతి, ఆత్మీయత, అనుబంధం కలిగిన భారత రాజ్యాంగ సూత్ర నిబద్ధమైన ఒక సమాజాన్ని నిర్మించుకోండని ఎలుగెత్తి చాటుతుంది. ఇక విజయవాడ అంబేడ్కర్ నగర్ అవుతుంది. ప్రపంచ కీర్తిని పొందుతుంది.
అంబేడ్కర్ స్మృతివనంలోని లైబ్రరీ,అంబేడ్కర్ చిత్రపటాల దృశ్య మాలిక సందర్శనం, అంబేడ్కర్ సమా వేశ మందిరం ప్రపంచ పర్యాటకులకు దృశ్యమాన సౌందర్యం. జ్ఞానభాండాగార సదృశం. బహుముఖ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిద ర్శనం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఓ వెలుగుతున్న ప్రత్నా మ్నాయ వెలుగుల సంద్రం. ఆ వెలుగుల తరంగాలలో మనమూ ప్రకాశిద్దాం. ప్రజ్వరిల్లుదాం, ప్రమోదిద్దాం. ఇక పదండి ముందుకు అంబేడ్కర్ ఆశయాలతో...
కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
(రేపు విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ)
Comments
Please login to add a commentAdd a comment