Katti padmarao
-
స్త్రీ సాధికారతతోనే దేశ పురోగతి
ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల రాజకీయ ఉన్నతి పెరుగుతున్నది. స్త్రీలలో వస్తున్న నిరంతర చైతన్యం, పెరుగుతున్న సానుకూల దృక్పథం, అంకిత భావం, పోరాట శక్తి వారిని మునుముందుకు నడిపిస్తున్నాయి. పార్లమెంటులో స్త్రీలు అధిక సంఖ్యలో ఉన్నప్పుడే వారి ప్రతిపాదనలు, హక్కులు నెరవేరతాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. స్త్రీ విద్యావంతురాలయితే ఆరోగ్యం, పరిసరాలు, సామాజిక ఘర్షణలన్నింటినీ చక్కగా అవగాహన చేసుకోగలుగు తుంది. స్త్రీలు తమ అస్తిత్వానికి సంబంధించి రాజీపడరు. వారు ఆత్మగౌరవ నిధులు. వారిలో జీవన ప్రతిభ ఎక్కువ. అందుకే వారు నాయకులుగా సులభంగా రాణించగలరు. అందుకే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో స్త్రీలకు గణనీయంగా స్థానాలు కేటాయించాలి. స్త్రీ అత్యున్నతంగా విద్యావంతురాలైన కేరళ రాష్ట్రంలో సమాజ వికాసం గొప్పగా ఉంది. స్త్రీ విద్య తక్కువ వున్న రాజస్థాన్‌లో ఇంకా స్త్రీ పట్ల దురాచారాలు కొనసాగుతుండగా, కేరళ స్త్రీ ప్రపంచ ఎల్లలను తాకుతున్నది. కేరళలో ఇంగ్లీషు విద్యను కూడా స్త్రీలకు నేర్పగలిగారు. స్త్రీలకు ఏ భాష అయినా త్వరగా వస్తుంది. ఈ రోజున యాంకర్స్‌లో స్త్రీలు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇటీవల రిపబ్లిక్ డే పరేడ్‌లో జరిగిన విన్యాసాలలో అసమా నమైన ప్రతిభా పాటవాలు వారు చూపారు. స్త్రీలు ఈ రోజు శాస్త్ర రంగంలో, సాంకేతిక రంగంలో, జ్ఞాన రంగంలో అత్యున్నత దశలో ఉండడానికి కారణం వారికి విద్యార్జన శక్తి అత్యుత్తమంగా ఉండటమే! ‘నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను’ అని ప్రముఖ తత్వ వేత్త డెకార్ట్ అన్నట్లుగా... ‘నేను బాధను అనుభవిస్తున్నాను, కాబట్టే నేను ఉన్నాను’ అనుకొనే స్వభావం, బాధలో సౌఖ్యాన్ననుభవించే గుణం స్త్రీల స్వభావంలోనే ఉందనే నిందను స్త్రీవాదులు ఎదుర్కొ న్నారు. నటాలీ షైన్ అనే న్యూయార్క్ మానసిక వైద్యురాలు చెప్పి నట్లు, ‘స్త్రీ మానసిక శాస్త్రం ఒక సమగ్ర దర్శనంగా రూపొందినప్పుడే స్త్రీకి ఉన్న అన్ని కోణాలు, అంతరాంతరాల్లో ఆమె ఆలోచన సమగ్రంగా దర్శితమవుతాయి.’ స్త్రీలను సాహిత్యం, మనస్తత్వ శాస్త్రంతో పాటు మతం బలంగా పురుష పెత్తనం కిందికి నెట్టింది. అది హిందూమతంలోనే కాదు, అన్ని మతాల్లోను కొనసాగింది. స్త్రీ మానసికంగా బలహీన మైనదని చెబుతున్నవన్నీ అబద్ధాలు. ఆమె ఒక పని తీసుకుంటే ఆ పని పూర్తి అయ్యేవరకు నిదురపోదు. ప్రపంచంలో మానసిక తత్వవేత్తలు అందరూ ఇప్పుడు స్త్రీ ఆత్మ స్థైర్యం మీద సానుకూలంగా స్పందిస్తు న్నారు. అందుకే ఆమె ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పోతున్నది. నిజా నికి స్త్రీ ఒక తల్లిగా, ఒక చెల్లిగా కుటుంబ నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాదు... ఆమె రాజ్య, ప్రభుత్వ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నదని అర్థమవుతుంది. ఈనాడే కాదు, స్వతంత్ర భావాలు కలిగిన స్త్రీలు ఆయా దేశాల్లో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ముందుకు వెళ్ళారు. క్లియో పాత్రా (ఈజిప్ట్), క్వీన్ ఎలిజబెత్ (బ్రిటన్), కేథరిన్ ది గ్రేట్ (రష్యా), మేడమ్ డె పాంపెడర్ (ఫ్రాన్స్), సిరిమావో బండారునాయకే (శ్రీలంక), మార్గరెట్ థాచర్ (బ్రిటన్), ఇవా పెరాన్(అర్జెంటీనా), గోల్డా మెయిర్ (ఇజ్రాయెల్) లాంటి నాయకురాళ్ళు పితృస్వామ్య వ్యవస్థలోనే రాజ కీయ ఆధిపత్యాన్ని వహించగలిగారు. ఇకపోతే 17వ లోక్‌సభలో స్త్రీల సంఖ్య పెరగడం గుణాత్మకమైన మార్పు అనక తప్పదు. యువకులు, విద్యావంతులైన నాయకులతో కూడిన సభగా 17వ లోక్‌సభ నిలిచింది. గతంలో కంటే లింగ నిష్పత్తి మెరుగైంది. లింగ నిష్పత్తిలో చాలా దేశాల కంటే వెనుకంజలో ఉన్న ప్పటికీ మెరుగుదల కనిపించింది. మొదటిసారి ఎంపీలు దాదాపు సగం (260 మంది) ఉన్నారు. తిరిగి ఎన్నికైన ఎంపీల సంఖ్య కూడా పెరిగింది. 70 ఏళ్లు పైబడిన ఎంపీలు తగ్గి, 40 ఏళ్ళ కంటే తక్కువ వయస్సుగల ఎంపీలు పెరిగారు. ఎంపీల సగటు వయస్సు 54 ఏళ్లుగా ఉంది. తొలి లోక్‌సభలో 26 శాతం మంది యువ ఎంపీలు ఉంటే, 16వ లోక్‌సభ నాటికి 40 ఏళ్ల లోపు వారు 8 శాతం మందే ఉన్నారు. ఇప్పుడు 12 శాతానికి పెరిగింది. పిన్నవయస్సుగల సభ్యురాలిగా 25 ఏళ్లకు ఎంపీగా ఎన్నికైన బిజూ జనతా దళ్ నేత చంద్రాణి ముర్ము (ఒడిషా) నిలిచారు. వయోవృద్ధుడిగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ ఎంపీ షఫీకుర్ రెహమాన్ బర్క్ (90) ఉన్నారు. పురుషుల కంటే తక్కువ వయస్సు గల మహిళా ఎంపీలు ఈ సభలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు 716 మంది ఉంటే, 78 మంది ఎన్నికయ్యారు. 2014లో 62 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అయితే చాలా దేశాల్లో మహిళా ఎంపీల శాతం ఎక్కువగా ఉంది. రువాండాలో 61 శాతంగా, దక్షిణాఫ్రికాలో 43 శాతంగా, బ్రిటన్‌లో 32 శాతంగా, అమెరికాలో 24 శాతంగా, బంగ్లాదేశ్‌లో 21 శాతంగా ఉంది. 17వ లోక్‌సభ ఎంపీల్లో 39 శాతం మంది తమ వృత్తిని రాజకీయాలు, సామాజిక సేవగా పేర్కొన్నారు. వ్యవసాయం చేస్తామని 38 శాతం మంది, వ్యాపారవేత్తలమని 23 శాతం మంది వెల్లడించారు. ఇకపోతే స్త్రీలు తమ విద్యా సంపత్తితో పాటు రాజకీయ అవ గాహనను కూడా పెంచుకోవాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు అన్నీ స్త్రీ, పురుషుల సమానత్వాన్ని చాటి చెబుతున్నాయి. 2016లో నిర్వహించిన లింగ సమానత్వ సూచిలో 87వ ర్యాంక్ పొందిన ఇండియా... 2023 నాటికి 146 దేశాల్లో 144వ స్థానానికి పరిమితమయ్యింది. 2021 నాటికి దేశంలో కార్మికుల్లో స్త్రీల శాతం (19.2) మాత్రమే అని ప్రపంచ బ్యాంకు నివేదించింది. 2022–23కు 37 శాతానికి పెరిగిన ప్పటికీ, బంగ్లాదేశ్, చైనా లాంటి దేశాలతో పోలిస్తే బాగా వెనుకబడి ఉంది. చైనా ఇప్పుడు 61 శాతం స్త్రీ శ్రామిక శక్తిని కలిగింది. ఈ విష యాలన్నీ పార్లమెంటులో ఎత్తిచూపి నిలవేయాలంటే దళి తులు ఎక్కువగా పార్లమెంటు, అసెంబ్లీ సభ్యులు కావలసి ఉంది. వ్యాపార రంగంలోనూ, విద్యా రంగంలోనూ, శాస్త్ర రంగంలోనూ, సాంకేతిక రంగంలోనూ స్త్రీలు మరింతగా ఎదగాలంటే రాజకీయరంగంలో స్త్రీల సంఖ్య పెరగాలి. మరో పక్క మహిళలపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు పెరుగు తున్నాయి. వాస్తవంలో మహిళలపై దాష్టీకాల ఘటనలు అధిక సంఖ్యలో ఉంటాయనీ, చాలా వరకు అవి బయటకు రావనీ పరిశీలనలు చెబుతున్నాయి. అసంఘటితరంగంలో ఈ వేధింపులు మరింత అధికంగా ఉంటాయని అధ్యయ నాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క పని ప్రదేశం అని ఏముంది... ఆర్టీసీ బస్సులు, వ్యాపార సముదాయాలు, రహదారులు, ఇలా అన్ని చోట్లా మహిళలు లైంగిక వేధింపులకు గుర వుతున్నారు. పనిచేసే చోట ఇలాంటి అకృత్యాలకు గురయ్యే మహిళల్లో దాదాపు 69 శాతం మంది బయటకు చెప్పుకోవడానికి సైతం సంకో చిస్తున్నారని ‘ఉమెన్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ సర్వే వెల్లడించింది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం కొరవడటం, వృత్తిపర మైన ఎదుగుదలకు అవరోధంగా మారుతుందన్న భయంతో బాధిత మహిళల్లో చాలామంది ఫిర్యాదు చేయడానికి వెనకంజ వేస్తు న్నారు. ఉద్యోగం మాన్పించేస్తారన్న భయంతో చాలామంది కుటుంబ సభ్యులకు సైతం చెప్పుకోవడం లేదు. ఇకపోతే పురుషుల మానసిక వ్యవస్థలలో వస్తున్న వికృతమయిన మార్పులవల్ల బాలికలపై కూడా దాడులు పెరుగుతున్నాయి. 11, 12 సంవత్సరాల బాలికలపై దాడులు జరుగుతున్న ప్రాంతాలలో ముంబయి, అమృత్సర్, వడోదరా, అహ్మదాబాద్, మీరట్ ముందు వరుసలో ఉన్నాయి. చివరకు తండ్రే కూతురిని వేధించే అసహ్య కరమైన కేసులు కూడా బయటకు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో రాజ్యాధికారంలో స్త్రీల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్లో స్త్రీల విద్య, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య అభివృద్ధికి తగిన నిధులు కేటాయించలేదని మహిళా ఎంపీలు చైతన్యవంతంగా మాట్లాడుతున్నారు. ఇది శుభ పరిణామం. స్త్రీ సాధికారత జాతీయ పురోగతికి తోడ్పడుతుంది. కరుణ, ప్రేమ, ప్రజ్ఞల విస్తృతికి తోడ్పడుతుంది. ఆ దిశగా మనమందరం నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం
ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అరుదైన భారతీయుడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్. అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటూ, విద్యను ఆయుధంగా ఎంచి ఎన్నో ఉన్నత డిగ్రీలు పొంది దేశానికి రాజ్యాంగ రచనలో దీపధారి అయ్యారు. దళితులూ, ఆదివాసీలూ, మహిళలూ, ఇతర అణగారిన వర్గాలకు ఆయన ఒక ధైర్య వచనం. తన కాలంలోనే గాక, ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా రక్తపాతాన్ని నివారించి, నిర్మాణాత్మక సామాజిక విప్లవాన్ని నడిపిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం ఆయన. ఆ మహాను భావుడి జ్ఞాపకార్థం 125 అడుగుల భారీ విగ్రహాన్నీ, ఓ స్మృతి వనాన్నీ నిర్మించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారాశుల ఆదరణను చూరగొంటోంది. జనవరి 19వ తేదీన విజయవాడ ‘అంబే డ్కర్ నగర్’గా వెలుగొందుతుంది. ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాణంలో స్వాతంత్య్రం తర్వాత కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెలుగొందిన అంబేడ్కర్ శిల్ప నిర్మాణం అత్యు న్నతమైంది, విస్తృతమైంది. దక్షిణ భారతదేశానికి నడిబొడ్డున ఉన్న విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం, ఆవిష్కరణ, స్మృతివన వికాసం చెరపలేని సంఘటనలు. అశోకుని సాంచీ స్తూపానికి ఎంత పేరు వస్తుందో విజయవాడలోని స్మృతివనానికీ అంతే పేరు వస్తుందనడం అతిశయోక్తి కాదు. బౌద్ధమతాన్ని స్వీకరించి బౌద్ధునిగా మహాపరినిర్వాణం పొందిన అంబేడ్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ విగ్రహం కానీ, స్మృతివనం కానీ ప్రపంచ బౌద్ధ పర్యా టకులను ఆకర్షించడం తథ్యం. నిజానికి బౌద్ధానికి ఈ ప్రాంతం కొత్తేమీ కాదు. అశోకుని కాలంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి బౌద్ధం విస్తరించింది. అమరావతి స్తూపం మొదటి దశ నిర్మాణాలు మౌర్యుల వాస్తు నిర్మాణాలనే పోలి ఉండటం, అనేక విద్దాంక నాణెములు (పంచ్ మార్క్డ్ కాయిన్స్) లభించడం, అశోకుని కాలపు నాటి బ్రాహ్మీ లిపిలోనే కొన్ని శాసనాలు లభించడాన్ని బట్టి ఆయన కాలంలోనే బౌద్ధం ఇక్కడికి వ్యాపించిందని చెప్పవచ్చు. అలాగే అప్పట్లోనే ఇవ్వాళ దళితులుగా వ్యవహరించ బడుతున్న జన సమూహాలు బౌద్ధాన్ని అవలంబించాయి. అమరావతి స్తూపంపై ఉన్న... ఓ చర్మకారుడు స్తూపానికి ఇచ్చిన దానాన్ని తెలియచేసే శాసనం ఇందుకు మంచి ఉదాహరణ. దళితులు, కులవృత్తులవారే ఆ నాటి స్తూప నిర్మాణానికి రాళ్లు, మట్టినీ మోశారు. అద్భుత శిల్పాలను మలిచారు. అందుకే భారతదేశ చరిత్రలో మొదటి సాంస్కృతిక విప్లవం బౌద్ధం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. హిందూ మతోన్మాదం బౌద్ధ శిల్పాలను, స్తూపాలను, చైత్యాలను, ఆశ్రమాలను హింసాత్మకంగా కూల్చివేసింది. కానీ మళ్లీ డా‘‘ బీఆర్ అంబేడ్కర్ శిల్పంలో ఒక ప్రత్యామ్నాయ ప్రకాశిత, విభాసిత శిల్ప కాంతులు వెల్లివిరుస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహమే ఒక విశ్వవిద్యాలయంలా ఉంటుంది. ఆయన వేలు ఒక ప్రశ్నోపనిషత్తు. ఆయన విగ్రహం విద్యా వికాసానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ప్రపంచ మానవుడు. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహం భారత దేశ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. లండన్ మ్యూజియం లైబ్రరీలో ఆయన చిత్రపటం ప్రపంచ మేధావుల పంక్తిలో మెరుస్తుంది. లండన్ ఇండియన్ హౌస్‌లో ఆయన బంగారు విగ్రహం ఆయన జీవన సాఫల్యానికి గుర్తుగా వుంది. అంబేడ్కర్ పోరాటం ద్వారానే అధికార ప్రతిష్ఠ జరుగుతుందని నొక్కి వక్కాణించాడు. దళితులను దేవుడిపైన లేక సూపర్ మ్యాన్ పైన ఆధారపడవద్దని హెచ్చరించాడు. ‘మీపై మీరు విశ్వాసం ఉంచుకొని నడవండి. ఎవరిపైనా ఆధార పడకండి. నిజాయితీగా ఉండండి. ఎప్పుడూ సత్యాన్ని ఆశ్రయించండి. దేనికీ లోబడకండి. ఎవరికీ తలవంచకండి’ అని అంబేడ్కర్ పిలుపు నిచ్చాడు. అంబేడ్కర్ ఒక ప్రవక్త, దార్శనికుడు. ఆయన ఒక జీవన వ్యవస్థల నిర్మాత. అణగారిన ప్రజల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు. ఆయన జీవించిన కాలంలోనే గాక ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. జాన్డ్యూ యిని అధ్యయనం చేసిన అంబేడ్కర్ ప్రజాస్వామ్య లౌకికవాది. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా, రక్తపాతాన్ని నివారించి, నిర్మా ణాత్మక సామాజిక విప్లవాన్ని ఆయన నడిపించారు. ఇకపోతే అంబేడ్కర్ పార్క్‌ను మాయావతి గవర్నమెంట్ 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందించింది. ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆ పార్కు విస్తరించింది. అంబేడ్కర్, మహాత్మాఫూలే, పెరియార్, నారాయణ్ గురూ, సాహూ మహరాజ్ వంటి వారినే కాకుండా ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఎందరో పోరాట వీరుల విగ్రహాలను ఆ పార్క్‌లో ఆవిష్కరించారు. ప్రత్యామ్నాయ సంస్కృతికి ఆ పార్కు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది. వ్యక్తిత్వ నిర్మాణానికి సాంస్కృతిక విప్లవ పునరుజ్జీవానికి సాహిత్యంతోపాటు శిల్పసంపద కూడా ఎంతో ఉప యుక్తం. కొన్ని శిల్పాలు మానవ మస్తిష్కాన్ని ప్రజ్వలింపచేస్తాయి. భారతదేశంలోని ఆర్కిటెక్చర్ ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్కిటెక్చర్లను సమన్వయం చేసుకుంది. భారతదేశానికి వలస వచ్చిన కుషానులు, అరబ్బులు, తురుష్కులు, పారసీకులు ఎందరో భారతీయ శిల్ప సౌందర్యానికి మురిసిపోయారు. వారి శిల్పనైపుణ్యాలు, భారతీయ శిల్ప నైపుణ్యానికి సమన్వయించారు. ‘గాంధార శిల్పం’ వంటివి రూపు దిద్దుకున్నాయి. మన అమరావతి శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. భారతదేశంలో ఈనాడు ప్రత్యామ్నాయ శిల్పసంపద అభివృద్ధి చెందు తోంది. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు ఉన్న డా‘‘ బీఆర్ అంబే డ్కర్ నిలువెత్తు విగ్రహం స్ఫూర్తితో ప్రతి ఊరిలో అంబేడ్కర్ విగ్రహం ఉండాలని ‘ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ’ కృషి చేసింది. అనేక గ్రామాలకు ఆ మహానుభావుడి విగ్రహాలను అందించింది కూడా! ఈ సందర్భంగానే అంబేడ్కర్ 150 అడుగుల విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్ర సచివాలయం ముందు నిలపాలని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటం చేసింది. 40 రోజులు సచివాలయం ముందు ధర్నా చేసింది. అంబేడ్కర్ యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలూ సపోర్ట్ చేశాయి. అయితే అంబేడ్కర్ వ్యతిరేక భావ వాది, అగ్రవర్ణ కుల అహంకారి, రాజకీయ కపటి, మానవ వనరుల విధ్వంసకుడు, ప్రకృతి వనరుల దోపిడీదారు, నేర రాజకీయ కోవి దుడు, దళిత ద్రోహి నారా చంద్రబాబు నాయుడు అంబేడ్కర్ విగ్రహా నికి బదులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ సచి వాలయం ముందే అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్ర హానికి పూనుకొని నిర్మించింది. జనవరి 19వ తేదీన ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం ఒక చరిత్రాత్మక సంఘటన. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంతో విజయవాడకు ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రజ్వలనం వస్తుంది. అంతేగాకుండా చైనా, టిబెట్, థాయ్‌లాండ్, జపాన్, జర్మనీ, బర్మా, శ్రీలంక దేశాల నుండి యాత్రికులు వస్తారు. ఇక విజయవాడ భారతదేశానికే తలమానికమైన నగరంగా వెలుగొందుతుంది. కుల, మత, జాతి, లింగ భేదాలు తరమబడతాయి. ప్రపంచంలో పేరెన్నిక గన్న నగరాల్లో ఒకటిగా కీర్తించబడుతుంది. విద్యావ్యాప్తి పెరుగుతుంది. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేడ్కర్ నినా దాన్ని ఈ నిలువెత్తు విగ్రహం పదే పదే గుర్తుచేసి ప్రజారాశులను చైతన్యవంతం చేస్తుంది. అంబేడ్కర్ స్మృతివనం ఏమి చెప్తుందంటే పిల్లల్ని విద్యావంతులు చేసుకోండి. కుల, మత భేదాలు లేని సమసమాజాన్ని నిర్మించుకోండి. హింసలేని కరుణ, ప్రజ్ఞ, నీతి, ఆత్మీయత, అనుబంధం కలిగిన భారత రాజ్యాంగ సూత్ర నిబద్ధమైన ఒక సమాజాన్ని నిర్మించుకోండని ఎలుగెత్తి చాటుతుంది. ఇక విజయవాడ అంబేడ్కర్ నగర్ అవుతుంది. ప్రపంచ కీర్తిని పొందుతుంది. అంబేడ్కర్ స్మృతివనంలోని లైబ్రరీ,అంబేడ్కర్ చిత్రపటాల దృశ్య మాలిక సందర్శనం, అంబేడ్కర్ సమా వేశ మందిరం ప్రపంచ పర్యాటకులకు దృశ్యమాన సౌందర్యం. జ్ఞానభాండాగార సదృశం. బహుముఖ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిద ర్శనం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఓ వెలుగుతున్న ప్రత్నా మ్నాయ వెలుగుల సంద్రం. ఆ వెలుగుల తరంగాలలో మనమూ ప్రకాశిద్దాం. ప్రజ్వరిల్లుదాం, ప్రమోదిద్దాం. ఇక పదండి ముందుకు అంబేడ్కర్ ఆశయాలతో... కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 (రేపు విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ) -
చరిత్ర అంటే బోర్డు మీది రాతా?
చరిత్ర అనేది బోర్డ్ మీద చాక్‌పీస్‌తో రాసిన రాత కాదు. ఎలా అంటే అలా చెరపడం, కొత్తది రాయడం కుదరదు. చరిత్ర తెలియనివాళ్లే ఇప్పుడు ‘ఇండియా’ స్థానంలోకి ‘భారత్’ను తెస్తున్నారు. నిజానికి భారత్ అనే పదం ప్రాచీనమైనది కాదు. ప్రసిద్ద చరిత్రకారులు తాము రాసిన చరిత్రకు ‘ఇండియన్ హిస్టరీ’ అనే పేరు పెట్టారు. వేదాల మీద ఆధారపడి చరిత్రను, సంస్కృతిని నిర్మించాలనుకునేవాళ్లు కేవలం వేదాల దగ్గరే ఇండియన్ హిస్టరీ ఉందనుకుంటున్నారు. అందువల్లే వారు భారతదేశ చరిత్రను కుదించాలని చూస్తున్నారు. అనేక భాషలు, సంస్కృతులు, జాతులు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యాంగ బద్ధమైన ‘ఇండియా’ నామవాచకాన్ని మార్చడం అహేతుకం. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని సంస్కృతీకరణకు గురి చేస్తోంది. దీనికి కారణం పాలకులకు భారతదేశ చరిత్ర తెలియకపోవడమే. నిజానికి భారత్ అనే పదం ప్రాచీనమైనది కాదు. ప్రసిద్ద చరిత్రకారులు డి.డి. కోశాంబి, రొమిల్లా థాఫర్, ఆర్.ఎస్. శర్మా, ఝూ, బి.ఎస్.ఎల్.హనుమంతరావు వంటి వారంతా తాము రాసిన చరిత్రకు ‘ఇండియన్ హిస్టరీ’ అనే పేరు పెట్టారు. మనం ఒకసారి ప్రపంచ దేశాలలో ఉన్న లైబ్రరీలను వీక్షిస్తే... ముఖ్యంగా లండన్ మ్యూజియం లైబ్రరీలో హిస్టరీ మీద ఒక శాఖ ఉంటుంది. కన్నెమెరా లైబ్రరీ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ దేశాల నుండి పరిశోధకులందరూ అక్కడికి వస్తారు. అక్కడ ఇండియా అంటేనే స్పందిస్తారు. ‘భారత్’ శబ్దం ఎక్కడా కనపడదు. యక్షులు, కింపురుషులు, గంధర్వులు భారతదేశంలో ప్రాచీన జాతులు. ఈనాటి దళితులు వారి వారసులే. వారు నదీ దేవతలను సృష్టించారు. వెన్నెలను ఆరాధించారు. ఆర్యులు అంతకుముందు ఉన్నటువంటి జాతుల మొత్తం వారసత్వాన్ని తమదిగా చెప్పు కొన్నారు. దళితులకు సంబంధించిన అనేక చారిత్రక అంశాలను ఆర్యులు సొంతం చేసుకున్నారు. మనది ‘సింధూ నాగరికత’ అంటారు. సింధూ శబ్దం అతి ప్రాచీనమైనది. ఇండియాలో మానవ జాతి పరిణామానికి సంబంధించిన ప్రాచీన పరిణామ దశలన్నీ దళితుల్లో కనిపిస్తున్నాయి. మోర్గాన్ చెప్పినట్టు మానవజాతి పరిణా మంలో జీవనోపాధి, ఆహారం, పాలనాంగం, ప్రభుత్వం, భాష, కుటుంబం, మతం, గృహనిర్మాణం, సంపద కీలకపాత్ర వహిస్తాయి. ఈ దశలన్నీ దళితుల జీవన విధానంలో ఉండడం వలన, బి.ఆర్.అంబేడ్కర్ నిర్వచించినట్లుగా వీరు ఇండియన్స్ అనేది నిర్ధారణ అవుతుంది. హిందువుల మత సాహిత్యంలో వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్య కాలు, ఉపనిషత్తులు, సూత్రాలు, ఇతిహాసాలు, స్మృతులు, పురాణాలు ఉన్నాయి. వేద బ్రాహ్మణులు వేదాలకూ, ఇతర రకాల మత సాహిత్యానికీ మధ్య ప్రత్యేకత చూపాలని అభిప్రాయపడ్డారు. వేదాలను ఉన్నతమైనవిగా మాత్రమే కాకుండా పవిత్రమైనవిగా, తిరుగులేనివిగా చేశారు. చరిత్రకు మూలమైన శాసనాలు, వ్రాత ప్రతుల వంటి వాటిని పేర్కొనకుండా కేవలం వేదాల మీద ఆధారపడి చరిత్రను, సంస్కృతిని నిర్మించాలనుకునే సనాతన భావజాలకర్తలు కేవలం వేదాల దగ్గరే ఇండియన్ హిస్టరీ ఉందనుకుంటున్నారు. అందువల్లే వారు భారతదేశ చరిత్రను కుదించాలని చూస్తున్నారు. దక్షిణ భారత భాషల్లో ఏ భాషలోనూ భారత శబ్దం లేదు.ఇండియన్ లాంగ్వేజెస్ పుట్టు పూర్వోత్తరాల మీద కృషి చేసిన వారెవ్వరూ భారత్ శబ్దాన్ని పేర్కొనలేదు. నిజానికి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలకు మూలం ద్రావిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధి చెందాయి. వాఙ్మయ దృష్టితో కాకుండా, భాషా చారిత్రక దృష్టితో చూస్తే మధ్య ద్రావిడ ప్రాచీనమైనది. తెలుగు భాష ప్రభావం ఇప్పటికీ తెలుగు తెగలమీద ఉండటాన్ని గమనించాలి. ముఖ్యంగా కోయ భాషలో ఎన్నో తెలుగు పదాలున్నాయి. కోయ భాషమీద పరిశోధన చేసిన జె.కాయన్ ఈ విషయాన్ని చెప్పారు. కోయ జాతి అతి ప్రాచీనమైనదని సామాజిక శాస్త్ర చరిత్ర చెప్తున్న సత్యం. ఈ కోయ భాషలో విశేషంగా తెలుగు ఉండడం వల్ల రాతలేని తెలుగు అతి పురాతన కాలంలోనే ఉందని మనకు అర్థమౌతుంది. తెలుగు భాష ప్రాచీనతను తెలుసుకోవాలంటే, మనం తెలుగులో అతి ప్రాచీనులైన తెగలను పరిశీలించవలసిందే. ఇకపోతే ఆంధ్రజాతిని నాగులుగా పిలవడం, నాగజాతికీ, ఆర్య జాతికీ ఉన్న వైరుధ్యం భారతంలో వర్ణించబడింది. ప్రసిద్ధ చరిత్ర కారులు బి.ఎస్.ఎల్. హనుమంతరావు తన ఆంధ్రుల చరిత్రలో ఆంధ్రులు ఋగ్వేద కాలం నాటివారనీ, వారు నాగులుగా ఆర్యులతో పోరాడారనీ, ఖాండవ వన దహనం, సర్పయాగం తరువాత వింధ్య పర్వతాల ఇవతలికి వచ్చారనీ, వారే ఆంధ్రులుగా పిలువబడ్డారనీ రాశారు. నాగులకు, ఆర్యులకు జరిగిన తీవ్ర సంఘర్షణలో ‘ఖాండవ దహనం’, జనమేజయుడి ‘సర్పయాగం’ రెండు ముఖ్య ఘట్టాలు. ఈ ప్రమాదం నుండి తప్పించుకొన్న నాగులు దక్షిణంగా వలసవచ్చి కృష్ణా ముఖద్వారంలో స్థిరపడి ఉంటారు. అమరావతీ శిల్పాలలోని రాజులకు, రాణులకున్న సర్ప కిరీటాలు వారి జాతీయతకు చిహ్నాలే. ఈ చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే, భారత్ కంటే ‘ఇండియా’యే పురాతనమైనది. భారత్ శబ్దం వలన ఇండియా తన ఐడెంటి టీని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది మనకు చాలా నష్టం. భారత దేశం, హిందూదేశం, ఇండియా... ఈ మూడు పేర్లలో జాతి, మత, లింగ, కుల, వర్ణ, ప్రాంతాలకు అతీతమైన పేరు ఇండియా. అంబేడ్కర్, ఫూలే, పెరియార్ ఈ దృక్పథంతోనే తమ గ్రంథాలు రాశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఇండియాను వెనక్కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది వారికి కూడా నష్టమే. అందరికీ నష్టమే. చరిత్ర అనేది బోర్డ్ మీద చాక్‌పీస్‌తో రాసిన రాత కాదు.ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తున్నా, సంస్కృతీకరణ ద్వారా దేశీయ ప్రజలను అవమానిస్తున్నారు. అనేక భాషలు, సంస్కృతులు, జాతులు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యాంగ బద్ధమైన ‘ఇండియా’ నామ వాచకాన్ని మార్చడం అహేతుకం. దేశంలోని ప్రజా స్వామ్య, లౌకికవాద, సామ్యవాద శక్తులందరూ ఇండియాను బలపరు స్తున్నారు. అధిక జనుల అభిప్రాయమే చారిత్రక సత్యం. పేర్లు మార్చడం ద్వారా చరిత్ర మారదు. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
సామాజిక బందీల విముక్తి ప్రదాత!
ప్రపంచంలోని వివిధ సమాజాలు తమకు నచ్చిన తాత్త్విక మార్గాల్లో ప్రయాణిస్తూ మనుగడ సాగించడం అనాదిగా వస్తున్నదే. అయితే కొన్ని సమాజాల్లో అనేక సమూహాలు తమ ఇష్టానికి వ్యతిరేకంగా బందీలై కనీస మానవ హక్కులకూ దూరమయ్యాయి. భారతీయ సమాజంలోని అస్పృశ్యులూ, ఆదివాసులూ, మహిళలూ, ఇతర అణగారిన సమూహాల వారు అటువంటి వారిలో కొందరు. తత్త్వశాస్త్రానికి మూల జీవం మానవ దుఃఖ నివారణ. ఇందుకోసం బుద్ధుడు, సోక్రటీస్, మార్క్స్ వంటి వారు ఎంతగానో ప్రయత్నించారు. ఇటువంటి తాత్త్వికులను అధ్యయనం చేసి అంబేడ్కర్ తన ఉపన్యాసాలు, రచనల ద్వారా పీడిత, తాడిత జనుల ఉద్ధరణకు ప్రయత్నించారు. ఆయన ఫిలాసఫీ భారత రాజ్యాంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. అంబేడ్కర్ ప్రాసంగికత నానాటికీ పెరుగు తుందనడానికి నవంబర్ 26వ తేది రాజ్యాంగ అవతరణ దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా జరగడం వల్ల మనకు అర్థమౌతోంది. అంబేడ్కర్ సిద్ధాంతాలు ప్రపంచ తాత్త్వికులకు సమ తుల్యమైనవి, తులనాత్మకమైనవి కూడా. అంబేడ్కర్ రచనా వైవి ధ్యంలో సోక్రటీస్, ప్లేటో, బుద్ధుడు, అరిస్టాటిల్ ఉన్నారు. ‘జ్ఞానవం తుడైనవాడు తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పకపోతే మూర్ఖుడ వుతాడు’ అనే సత్యాన్ని సోక్రటీస్ చెప్పాడు. అందుకు రాజ్యానికి, దేశానికి భయపడని నిర్భీతి తత్త్వాన్ని ఆయన ప్రదర్శించాడు. అదే తత్త్వం అంబేడ్కర్లో మనకు కనిపిస్తుంది. అందుకు సత్యాన్వేషణ, ధీశక్తి, శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధత అవసరం. వాటిని సోక్రటీస్ స్థాయిలో ఆధునిక యుగంలో వ్యక్తీకరించిన వాడు అంబేడ్కర్. ఆయన ముఖ్యంగా వేదాలకూ, స్మృతులకూ ప్రత్యామ్నా యంగా భారత రాజ్యాంగ దర్శనాన్ని రూపొందించాడు. అందుకు బుద్ధుని తత్త్వం ఆయనకు వాహిక. ఆయన సమాజంలో మానవతా స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం చేశాడు. అందుకు కారణం ఆయన హృదయ భావం, ఆయన చాలా సున్నిత హృదయుడు. ఆయన సున్నితత్వంలో కరుణ వుంది, ప్రేమ వుంది, ఆత్మీయత వుంది. అంకిత భావం వుంది. ఈ గుణాలు నాయకుణ్ణి ప్రవక్తగా తీర్చిదిద్దాయి. అందుకే ఆయన అణ గారిన ప్రజల తరఫున మాట్లాడాడు. ఈ దేశంలో కోట్లాదిమంది ప్రజలు అస్పృశ్యత అనే శాపంతో క్రుంగిపోయారు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఉపద్రవం ఇది. ప్రతి మానవుడికీ ఉండవలసిన ప్రాథమిక హక్కులు వారికి తిరస్క రించబడ్డాయి. నాగరికత, సంస్కృతి ఫలాల లబ్ధిని వారికి అంద నివ్వలేదు. అస్పృశ్యులే కాకుండా ఈ దేశంలో అంతే పెద్ద సంఖ్యలో ఆదిమ జాతులు, గిరిజన తెగలు ఉన్నాయి. నాగరిక, సాంస్కృతిక స్రవంతిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయకుండా వారిని ఆటవిక, సంచార జాతులలా తిరిగేలా వదిలి పెట్టారు కులీనులు. ఈ పరిస్థితిని మార్చడానికి ఆయన తన వాదాన్ని తాత్త్వికంగా మలిచాడు. కుల నిర్మూలనా వాదాన్ని ఇలా ప్రతిపాదించాడు. ‘‘కుల వ్యవస్థను సమర్థించడానికి వారసత్వం గురించీ, నరసంతతి శుద్ధి శాస్త్రం గురించీ చెత్తవాదన ఎంతో లేవనెత్తబడింది. నరవంశ శుద్ధిశాస్త్రం (యూజెనిక్స్) ప్రాథమిక సూత్రానికి కుల వ్యవస్థ అనుగుణంగా ఉంటే దానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఎందు కంటే స్త్రీ పురుషులను వివేకంతో జత కలపడం ద్వారా జాతి అభి వృద్ధిని సాధించడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే వివేక వంతమైన స్త్రీ, పురుష సంయోగాన్ని కుల వ్యవస్థ ఏ విధంగా సాధిస్తున్నదో అర్థం కావడం లేదు. కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన ఒక కృత్రిమ వ్యవస్థ. అది చేస్తున్నదల్లా వివిధ కులాల స్త్రీ పురుషులు కులాంతర వివాహాలను చేసుకోకుండా నిషేధించడం. ప్రకృతి సిద్ధమై నది కాదది, ఒక కులంలో ఏ ఇద్దరు కలసి వివాహం చేసుకోవాలని ఉన్నదో నిర్ణయించే పద్ధతి కాదది. జాతి శుద్ధి శాస్త్రం దృష్ట్యా ఒక కులమే ఒక ప్రత్యేక మూల జాతి అయితే... ఉపకులాల పుట్టుక కూడా అదే విధంగా అయి వుండాలి. అయితే ఉప కులాల మూలం కూడా యూజినిక్సే అని నిజంగా ఎవరైనా వాదించగలరా? అలాంటి వాదన పూర్తిగా అసంగతం.’’ ఇకపోతే ఈ కులనిర్మూలన సిద్ధాంత ఆచరణకు మహాత్మాగాంధీ రాజకీయంగా మతవాద ధోరణితో అడ్డు వచ్చారు. అంబేడ్కర్ సాంఘికంగా కుల నిర్మూలనా వాది. ఆర్థికంగా స్టేట్ సోషలిజం ప్రతిపాదకుడు. రాజకీయంగా బహుజన రాజ్య నిర్మాణ దక్షుడు. ఈ మూడింటినీ సాధించడానికి ఆయన బుద్ధునిలో సంఘ వాదాన్నీ, మహాత్మా ఫూలేలోని సాంస్కృతిక విప్లవ వాదాన్నీ పోరాట ఆయుధాలుగా మలచుకున్నాడు. అందువల్ల ఆయన కుల నిర్మూలనా పునాదులపై పునర్నిర్మించే తత్త్వశాస్త్ర నిర్మాతగా ముందుకొచ్చాడు. జ్యోతిబా ఫూలే స్త్రీల కోసం చేసిన ఉద్యమం అంబేడ్కర్‌ను ఎంతగానో ప్రభావితం చేసింది. స్త్రీని విముక్తి చేయడం భారత పునరుజ్జీవ నోద్యమంలో ప్రధానాంశంగా ఆయన భావించాడు. హిందూ సంస్కరణవాదులు ప్రతిపాదించే పద్ధతిలో విధవా వివాహాలు, సతీసహగమన నిర్మూలన వంటి సంస్కరణల వలే కాక స్త్రీల హక్కులకు సంబంధించిన అంశం మీద ఆయన ఎక్కు పెట్టాడు. స్త్రీని భావ దాస్యం నుండి విముక్తి చేయడం, సాంఘిక, ఆర్థిక, సాంస్కృ తిక, రాజకీయ భాగస్వామ్యాన్ని పురుషులతో సమానంగా స్త్రీలకు కల్గించడానికి ఆయన తీవ్రమైన కృషి చేశాడు. అంబేడ్కర్ తనకు ముందున్న భారతీయ పాశ్చాత్య తత్త్వశాస్త్రాలన్నింటినీ చదివి భారత దేశ పున ర్నిర్మాణానికి పూనుకున్నాడు. అంబేడ్కర్‌లోని మరొక కోణం సామాజిక వ్యక్తిత్వ మనో విశ్లేషణ. ఈ ప్రత్యేకతను ప్లేటోలోని రచనా వైవిధ్యం, జ్ఞానతృష్ణ, సంభాషణా ప్రావీణ్యత, అంతరాంతర పరిశీలనల నుండి ఆయన సంతరించుకున్నారు. తత్త్వశాస్త్రానికి మూల జీవమైన మానవ దుఃఖ నివారణ పట్ల సోక్రటీస్ ఎంత వేదన పడ్డాడో, అంబేడ్కరూ అంత వేదన పడ్డాడు. వ్యక్తిగతమైన దుఃఖాన్ని అధిగమించి, సామాజిక దుఃఖాన్ని గుర్తించి, దాని నివారణ కోసం సిద్ధాంతపరంగా, ఆచరణ పరంగా కృషి చేసినవారు సోక్రటీస్, అంబేడ్కర్లు. ఎంత క్లిష్టతరమైన పరిస్థితులు వచ్చినా వారు సత్య నిరూపణ కోసం ముందడుగు వేస్తారు. ఇకపోతే అంబేడ్కర్ విద్యా తాత్త్విక వాది. ఆయన తన ప్రతిభా సంపత్తితో అçస్పృశ్యుల గురించి అనేక కమిషన్లకు వివరాలు అందించి అనేక హక్కులు సాధించాడు. ఏ పాఠశాల అయితే తనకు ప్రవేశాన్ని నిరాకరించిందో తనను తరగతి గదిలో బయట కూర్చో బెట్టి, బైట పాఠాలు చెప్పిందో, అదే భారతంలో తన ప్రజలను విద్యావంతులను చేయడానికి... అన్ని ప్రభుత్వ పాఠశాలల ద్వారాలు తెరిపించగలిగాడు. ఆయన ఒక్కడుగా ఒక సైన్యంగా పని చేశాడు. అంబేడ్కర్‌కు అధ్యయనంతో పాటు లోతైన అవగాహన, అనుభవం, ఆచరణ వున్నాయి. అందుకే ఆయన మాటలు సత్య నిష్టం అయ్యాయి. బుద్ధుని ధార్మిక సూత్రాలను, నీతి సూత్రాలను అంబే డ్కర్ రాజ్యాంగంలో అవసరం అయిన చోటంతా పొందుపరుస్తూ వెళ్ళాడు. ఈనాడు అంబేడ్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం అనే పేరు మీద భారత చరిత్ర పరిశోధనా మండలి (ఐసీహెచ్ఆర్) హిందూ పునరుద్ధరణవాద పత్రాన్ని రాష్ట్రాల గవర్నర్లకు, విశ్వవిద్యాలయాలకు పంపింది. అంటే అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సూత్రాలను దెబ్బతీయాలనే ప్రయత్నం జరగు తోందన్న మాట! రాజ్యాంగం పీఠికలో చెప్పబడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దెబ్బతీయాలనే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం బౌద్ధ యుగాన్ని దెబ్బతీయడానికి కౌంటర్ రివల్యూషన్‌గా వచ్చిన గుప్తుల కాలం నాటి మతోద్ధరణ వాదం లాగా వుంది. అంబేడ్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాన్ని ప్రచారం చేయా లనే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని సామా జిక సామ్యవాద భావాన్ని దెబ్బతీయలేరనేది కూడా మరో ప్రక్క రుజువవుతూ వస్తోంది. మతం ఎప్పుడూ తత్త్వశాస్త్రానికి ప్రత్యా మ్నాయం కాలేదు. మతం కొందరికే పరిమితమైంది. రాజ్యాంగం అందరిని సమన్వయీకరించుకుంటుంది. ఆ శక్తి దానికుంది. ప్రపంచ తాత్త్విక దృక్పథం నుంచి ఏర్పడింది రాజ్యాంగం. అంబేడ్కర్‌వాదులు, మార్క్స్వాదులు, లౌకికవాదులు, ప్రజా స్వామ్యవాదులు ఐక్యంగా అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని తప్పక కాపాడుకుంటారు. ఈ యుగం అంబేడ్కర్‌ది. ఆయన నిర్మిం చిన తాత్త్విక సామాజిక మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు మొబైల్: 98497 41695 (నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి) -
‘భావజాల’ విముక్తే ప్రత్యామ్నాయానికి దారి
భారతదేశం ఈనాడు అంబేడ్కర్ మార్గంలో నడవాలా? గాంధీ మార్గంలో నడవాలా? అనే పెద్ద ప్రశ్న దేశంలోని పార్టీల ముందు ఉంది. భారత దేశంలో ఈనాడు రాజకీయ కూటములు ఎక్కువ ఏర్పడు తున్నాయి. బీజేపీ కూటమి గాంధీ, సర్దార్ వల్లభాయి పటేల్ భావజాలాల్లో నడుస్తోంది. కాంగ్రెస్ కూటమి గాంధీ, నెహ్రూ భావజాలాల్లో నడుస్తున్నది. కేసీఆర్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి వారితో ఏర్పడుతుందని చెబుతున్న మూడవ కూటమి ఇంకా తన భావజాలాన్ని ప్రస్పుటం చేయలేదు. కానీ భారతదేశంలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో మౌలికమైన మార్పు రావాలంటే తప్పకుండా అంబేడ్కర్ భావజాలమే ఈనాడు భారతదేశానికి అవసరం. బీజేపీ పైకి గాంధీ పేరు చెప్తున్నా అది హిందూ మతోన్మాద భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ మార్గంలో నడుపుతోంది. హిందూ మతోన్మాదాన్ని భారతదేశంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సరిగ్గా అంచనా వేశారు. హిందూ మతాన్ని నిర్మూలించకుండా భారతీయ సామాజిక విప్లవం విజయవంతం కాదనీ, హిందూ మతోన్మాదం ప్రమాదకరమైనదనీ అంబేడ్కర్ నొక్కి వక్కాణించాడు. భారత సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోయిన బౌద్ధ ఉద్యమంలోని మాన వతా వాదాన్ని ఆయన పరివ్యాప్తం చేశాడు. కమ్యూని స్టులు ప్రాచీన భారత సామాజిక ఉద్యమకారులను, ఆధునిక సామాజిక ఉద్యమకారులైన మహాత్మాఫూలే, అంబేడ్కర్, పెరియార్ వంటి వారినీ; వారి సిద్ధాంతా లనూ నిర్లక్ష్యం చేశారు. దాని ఫలితంగా భారతదేశంలో ఈనాడు మతోన్మాదం తెట్టెం కట్టుకుపోయింది. మతోన్మాదులు, సామ్రాజ్యవాదుల అండ తీసుకొని మరింతగా బలపడటం ప్రారంభించారు. ఇక దీనికి రాజ్య వ్యవస్థ తోడైందంటే ఎంత ప్రమాదమో చూడండి! అంబేడ్కర్ విషయానికి వస్తే... మొదటి నుండి ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రత్యామ్నా యంగా... భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, విద్యా, తాత్విక రంగాలలో ప్రామాణికమైన కాంగ్రెస్ నాయకులు మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూలను ఎదిరిస్తూ వచ్చాడు. తన ‘వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హావ్ డన్ టు ది అన్‌టచ్‌బుల్స్’ అనే గ్రంథంలో కాంగ్రెస్ నాయకుల నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. నిజానికి కాంగ్రెస్‌లో అంత ర్గతంగా హిందూయిజం వుంది. బీజేపీ తమ సిద్ధాంతకర్తలుగా కాంగ్రెస్ నాయకులను తలకెత్తు కోవడంలోని ఆంతర్యం అదే. అంబేడ్కర్ అసలు హిందూమతం అంటే ఏమిటి? హిందూ మత భావజాలంతో నడిచేవి అసలు పార్టీలు అవుతాయా? అని ప్రశ్నించాడు. నిషేధాల శిక్షాస్మృతినే హిందూ మతంగా చలామణీ చేసి ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించడం జరుగుతోందని అంబే డ్కర్ అన్నారు. ఒక వర్గానికి ఒక న్యాయం, మరొక వర్గానికి మరొక న్యాయం... వీటిలో ఎప్పటికీ మార్పు లేకుండా చేసి అన్యాయాన్ని శాశ్వతీకరించడం మరీ దురన్యాయం అన్నారాయన. లేని ‘హిందూ’ మతాన్నీ, వాదాన్నీ గాంధీ తలకెత్తుకున్నాడు. దానితో ముస్లిం లీగ్ విజృంభించింది. మతవాద రాజకీయాలు, స్వాతంత్య్ర ఉద్యమాలతోనే హిందూ రాజకీయ వాదం ప్రారం భమైంది. హిందూ శబ్దం వేదాల్లో లేదు. భారత, రామాయణ, భాగవత అష్టాదశ పురాణాల్లో లేదు. వైదిక మతం, బ్రాహ్మణమతం ఉన్నాయి కానీ హిందూ మతం లేదు. ఇప్పుడు బీజేపీ హిందూ మతోన్మాదాన్నీ, కాంగ్రెస్ హిందూ సాంప్రదాయ వాదాన్నీ ముందుకు తెస్తున్నాయి. ఇప్పటికే అంబేడ్కర్ హిందూ ప్రత్యా మ్నాయ రాజకీయ వ్యవస్థను రూపొందించారు. ఆయన కొత్త మ్యానిఫెస్టోలు ఎప్పటికప్పుడు రచిం చారు. అంబేడ్కర్ రాజకీయ ఉద్యమంలో బౌద్ధ తత్వ ప్రభావం వుంది. బౌద్ధ తాత్వికతలో వున్న సమసమాజ నిర్మాణ భావన ఆయనలో వ్యక్తమయ్యింది. అంబేడ్కర్ మానవతావాది. హేతువాది సామ్య వాది. ఆయన జాన్‌డ్యూయీ శిష్యుడు. జాన్‌డ్యూయి లోని ప్రజాస్వామ్య భావాలనూ, కారల్ మార్క్స్‌లోని సామ్యవాద భావాలనూ, కబీరులోని మానవతావాద భావాలనూ ఆయన రాజకీయాలతో సమన్వయిం చారు. ఆయన నిర్మించిన రాజకీయ పార్టీలో సామ్య వాద భావాలు నిండి వున్నాయి. మార్క్స్ భావజాలాన్ని కూడా ఆయన తన రాజకీయ ప్రణాళికలో చేర్చాడు. మార్క్సియన్ పద్ధతిలో కాకపోయినా, భారతీయ సామాజిక విప్లవకారుడిగా సమసమాజం కోరుతున్న అంబేడ్కర్ కుల నిర్మూలనా వాదం వర్గపోరాటానికి సజీవశక్తి అనడంలో అతిశయోక్తి లేదు. అంబేడ్కర్ కొన్ని అంశాల్లో మార్క్స్‌తో విభేదించాడు. కొన్ని అంశాల్లో అంగీకరించాడు. అంగీకరించిన ప్రధాన అంశం ‘సమ సమాజం’. అంగీకరించని అంశం సాధించే పద్ధతిలోనే బలప్రయోగం లక్ష్యం. ఇద్దరిదీ సమ సమాజమే. సాధించే పద్ధతిలోనే కొంత తేడా వుంది. ఇద్దరి సామా జిక తత్త్వవేత్తల వైరుద్ధ్యాలను, సమన్వయాలను పరి శీలించి భారత సామాజిక విప్లవానికి వారిరువురి సిద్ధాంతాలను ఉపయుక్తం చేసుకోవలసిన ‘సమ సామాజిక వాదులు’ ఆ చారిత్రక బాధ్యతను విస్మరిం చారు. కులవాదం మీద అంబేడ్కర్ విశ్లేషణలను మార్క్స్ మీద అంబేడ్కర్ చేసిన విశ్లేషణలుగా ప్రచారం చేసి అంబేడ్కర్‌ను మార్క్స్ వ్యతిరేకిగా చిత్రించడంలో హిందూ కమ్యూనిస్టులు కృతకృత్యులయ్యారు. అంబేడ్కర్, లోహియా, మార్క్స్‌ల భావజాలాల సమన్వయమే హిందూ భావజాల రాజకీయాలకు ప్రత్యామ్నాయం. దళిత బహుజన మైనార్టీ లౌకిక వాదులు ఈ మార్గంలో నడిస్తేనే భారతదేశానికి భావ జాల విముక్తి. భావజాల విముక్తి వల్లే రాజకీయాలకు ప్రత్యామ్నాయ యుగం ఆవిర్భవిస్తుంది. ఆ దిశగా పయనిద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నేత మొబైల్: 98497 41695 -
రక్తక్షేత్రం వెలుగులో దళిత ఉద్యమ ప్రజ్వలనం
కారంచేడు తర్వాత దక్షిణ భారతంలోనే పేర్కొనదగిన ఉద్యమం చుండూరు దళిత ఉద్యమం. గుంటూరు జిల్లాలో విజయవాడ – చెన్నై రైలు మార్గంలో ఉన్న ఊరు చుండూరు. 1991 ఆగస్ట్ 6న దళితులను ఆధిపత్య కులాల వారు ఊచకోత కోసిన అమానవీయ ఘటన జరిగింది. అదే చుండూరు ఘటనగా ప్రసిద్ధి చెందింది. తెనాలి ప్రాంతంలో హరిత విప్లవం ద్వారా భూములు సస్యశ్యామలం అయినాయి. దళిత వాడ కూడా బలంగా ఉంది. మాలలు, మాదిగలు కలిసి సుమారు 500 కుటుంబాలు కాపురాలు ఉంటున్నాయి. వీరిలో కారంచేడు ఉద్యమం తర్వాత సామాజిక చైతన్యం వచ్చింది. ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లాడో, పిల్లో ఉన్నారు. కొందరు ఉద్యోగులూ ఉన్నారు. ఈ చైతన్యానికి ఆధిపత్య కులాలవారు తట్టుకోలేక పోయారు. ముఖ్యంగా హైస్కూళ్ళలో ఎస్సీ విద్యార్థులు పక్కపక్క బెంచీల్లో కూర్చోవడం, విద్యా సహకారాన్ని పొందడం... ఇవన్నీ అగ్రకుల గ్రామాల్లో చర్చనీయ అంశాలయ్యాయి. కొన్ని చోట్ల ప్రేమ ఘట్టాలు జరగటం కూడా విద్వేషం రావడానికి మూల కారణం అయ్యింది. ఫలితంగా 8 మంది దళితులు ఆధిపత్య కులాల వారి దాడిలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉద్యమంలో మరో ఇద్దరు దళితులు ప్రాణాలు కోల్పోయారు. వీరందరినీ ఊరు నడి బొడ్డున ‘రక్త క్షేత్రం’లో పాతి పెట్టాం. చుండూరు బాధితుల పక్షాన జరిగిన ఉద్యమానికి నేను నాయకత్వం వహించడం వలన అంబేడ్కర్ ఆలోచనల్ని జాతీయస్థాయి పోరాటంలో మమేకం చేసే అవకాశం కలిగింది. ఉద్యమం ముఖ్యంగా ఢిల్లీ అంబేడ్కర్ భవన్లో కొన్నివందల మంది ఆశ్రయం తీసుకుని, అక్కడ నుంచి బయలుదేరి బోట్ క్లబ్ వరకు 13 కిలోమీటర్లు ర్యాలీగా వచ్చి సాయంత్రం వరకూ ధర్నా నిర్వహించాం. 1991 అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు ఢిల్లీ కోటను ముట్టడించాం. ఢిల్లీలోని 120 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం బలపరచడంతో ఈ ఉద్యమానికి బలం చేకూరింది. మాజీ హోం మినిస్టర్ బూటా సింగ్, ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్న పార్లమెంట్ సభ్యులు రామ్ విలాస్ పాశ్వాన్, ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు సమస్య పట్ల అవగాహన కలిగించడంలో ముఖ్య పాత్ర వహించారు. అక్టోబర్ నాలుగవ తేదీ ప్రధానమంత్రి – ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. బాధిత కుటుంబాలతో పాటు నేనూ చర్చలకు హాజరయ్యాను. చర్చలు చుండూరు కేసు విచారణకు, దాడి జరిగిన చుండూరులోనే ప్రత్యేక కోర్టు పెట్టాలనేది ముఖ్యమైన డిమాండ్. 440 బాధిత కుటుంబాలకూ ఇళ్ళ స్థలంతో సహా ఒక ఇల్లు నిర్మించడం, ప్రతి కుటుంబానికీ ఒక ఎకరం పొలం ఇవ్వడం, బాధిత కుటుంబాలలో పదవ తరగతి ఉత్తీర్ణులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబాలలో 18 సంవత్సరాలు వయసు దాటిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడం, చుండూరులో ఒక రెసిడెన్షియల్ హైస్కూల్ ఏర్పాటు, 150 మంది ముద్దాయిలందరనీ అరెస్ట్ చేయడం వంటివి బాధితులు ప్రధానమంత్రిని చేసిన మరికొన్ని డిమాండ్లు. (క్లిక్: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి) చుండూరు ఉద్యమం భారతదేశ దళిత ఉద్యమానికి చుక్కాని. 111 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలని ఏకం చేసి రాష్ట్రపతి భవన్‌కు దళిత ఉద్యమం ర్యాలీ చేయించిన మహోన్నత చారిత్రక ఘటన. అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ ప్రత్యేక కోర్టు నివేదనను తిరస్కరించడంతో... రాష్ట్రపతి దళితుడు కావాలి అనే నినాదం చేయడం ద్వారా ఇప్పుడు ఒక నారాయణన్, ఒక గోవింద్, ఒక ద్రౌపదీ ముర్మూలు ఆ పీఠాన్ని అధిష్టించడానికి అవకాశం కల్పించిన ఉద్యమం. ‘ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీ యాక్ట్–1989’ ననుసరించి చుండూరులోనే ప్రత్యేక కోర్టును సాధించిన ఉద్యమం. కమ్యూనిస్టులూ కుల సమస్య గురించి చర్చించేలా చేసిన ఉద్యమం. మూడు దశాబ్దాల తర్వాత ‘రక్త క్షేత్రం’ ఆగస్ట్ 6ను దళిత బహుజన మైనారిటీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాడే బాధ్యతను మనకు అప్పజెబుతున్న రోజుగా భావిద్దాం. అంబేడ్కర్ మార్గంలో విజయ సోపానాన్ని అధిరోహించేద్దాం. (క్లిక్: ఆంగ్ల సహన పాఠం నేర్చుకుందామా?) - డాక్టర్ కత్తి పద్మారావు సామాజిక ఉద్యమకారుడు (చుండూరు ఘటనకు మూడు దశాబ్దాలు) -
సాంస్కృతిక వివ్లవ యోధుడు
మార్క్స్, లెనిన్, మావో అందరూ నాస్తికులే, హేతువాదులే, గతితార్కిక భౌతిక వాదాన్ని జీవితంగా మలుచుకొన్నవారే. మరి మన జీవితాల్లోనూ హేతువాద జీవన విధానం ఎందుకు లేదు అని సి.వి. ప్రశ్నించేవారు. ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆధునిక యుగ హేతువాద ఉద్యమ వైతాళికుడు, అలుపెరుగని కలం యోధుడు. ఆరు దశాబ్దాల పైగా అక్షర జ్వలనాలతో వెలిగిన జ్ఞాన సూర్యుడు సి.వి. (సి. వరహాలరావు) 88వ యేట విజయవాడలో తన నివాసంలో మంగళవారం రాత్రి చివరి శ్వాస విడిచారు. నలభై యేళ్ళ హేతువాద ఉద్యమం అనుబంధం మాది. భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసిన చార్వాక వాది సి.వి. హేతువాదిగా ప్రత్యామ్నాయ సాహితీ సృజ నను పుంఖానుపుంఖంగా చేసి, వేదాలు, ధర్మశాస్త్రాలు అధ్యయనం చేసి, అందులోని వైరుధ్యాలను బయటబెట్టిన సాహసి. మనుస్మృతి లోతులు చూసి, వర్ణ వ్యవస్ధ పునాదులను తవ్వి వేసి సమసమాజ భావనకు పతాకలెత్తిన హేతువాది సి.వి. కమ్యూనిస్టు ఉద్యమం నుంచి వచ్చిన సి.వి. కమ్యూనిస్టు సాంస్కృతిక, సాంఘిక, తాత్విక ఉద్యమాలను ఇంకా బలంగా నడపవలసి ఉందని ఆకాంక్షించారు. అస్పృశ్యతను, కులాన్ని పారదోలందే, మూఢాచారాల బూజును దులపనిదే వర్గపోరాటం కూడా విజయవంతం కాదని అంబేడ్కర్ ఆలోచనలను తన భాషలో పలికిన ఆధునిక వైతాళికుడాయన. మహాత్మాఫూలే, అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ల ఆలోచనలను తన రచనల్లో జ్వలితమైన భాషలో నినదించిన మహాకవి సి.వి. 1970 దశకం నుంచి 90వ దశకం వరకు తెలుగువాడిగా పెరియార్‌లా, మరో హోచ్మిన్లా ఉక్కునాలుకతో పలికిన ధైర్యశాలి. ఆయన రాసిన విషాద భారతం, దిగంబర కవిత్వానికి విప్లవ కవిత్వానికి మధ్య వారధి గట్టింది. ఆ తరువాత వర్ణం, కుల అభ్యుదయ విప్లవ జీవన విధానాల్లో కూడా దాగి వుందని గమనించి ‘వర్ణ వ్యవస్ధ’, ‘చార్వాక దర్శనం’, ‘సత్యకామ జాబాలి’, ‘మధ్యయుగాల్లో కులం’ వంటి లోతైన విమర్శనా గ్రంథాలు వ్రాశారు. సి.వి. కులనిర్మూలనా వాది, ఆయనొక గొప్పకవి, ఆయన వర్ణనా సామర్ధ్యం ‘పారిస్ కమ్యూన్’లో నరబలిలో మనకు అద్భుతంగా కనిపిస్తుంది. ఆయన అక్షరాలతో ఆయుధాలు తయారు చేస్తారు. అక్షరాల్లో సాయుధ సైనిక కవాతులు మనకు చూపిస్తారు. శ్రీశ్రీ కవిత్వంలోని పరుగు ఆయన కవిత్వంలో మనకు కనిపిస్తుంది. వేమన కవిత్వంలోని కులాధిపత్యంపై పోరు, కబీర్, చక్రధర్, నానక్, పోతులూరి వీరబ్రహ్మం భక్తి కవుల్లోని మానవతా వాదాన్ని ఆయన హేతువాద భావాల్లో చెప్పారు. భారతదేశ సామాజిక సాంస్కృతిక భారతాల్లోని వైరుధ్యాలను మన కళ్ళముందు సాక్షాత్కరింపజేశారు. నేను హేతువాదిని నాకు దేవుడు లేడు అని చాటుకున్న సి.వి. ఇటీవల ప్రజాశక్తి వారు ఆయన రచనలన్నీ ప్రచురించిన సభలో నన్ను ప్రేమతో కౌగిలించుకొన్న అనుభూతిని మరువలేను. ఆయన పురాణాల్లో అణగారిన పాత్రలకు జీవం పోశారు. సి.వి.ని నేను 1978లో మొదట చార్వాక ఆశ్రమం నిడమర్రులో చూశాను. నా మొదటి పుస్తకం ‘కులం పునాదులు’ ఆయన నేతృత్వంలో 1979లో అచ్చయింది. కొండవీటి వెంకటకవి, బి.రామకృష్ణ, సి.వి., ఈశ్వర ప్రభుగార్లు మా తరానికి ముందు హేతువాద భావజాల వ్యాప్తిలో మార్గాన్ని సుగమం చేశారు. ఎన్నో సదస్సుల్లో, సభల్లో సి.వి. నేను పాల్గొన్నాం. ఆయన నిరాడంబరత ఆదర్శనీయమైంది. ఆర్భాటాలు లేవు. స్నేహం, ఆత్మీయత, నిరంతర రచన, అధ్యయనం ఆయన దినచర్యలు. స్వాములు, యోగు లు, పరాన్న భుక్కులు మూఢాచారాలతో ప్రజలను దోచుకొంటున్న విధానాలను అధ్యయనం చేసేవారు. ఆయనది సాంఘిక సాంస్కృతిక పోరాటమే అయినా రాజకీయాల్లో వున్న ఫాసిజం మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ఆయన ఆవేదనంతా కమ్యూనిస్టు ఉద్యమం మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేయడంలో వెనకబడుతోందనన్నదే. మతోన్మాద సంస్ధలను కేవలం రాజకీయాల ద్వారా ఎదిరించలేం.. తప్పకుండా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి పదును పెట్టాలనేదే ఆయన భావన. పుక్కిట పురాణాలకు ప్రత్యామ్నాయంగా శాస్త్ర జ్ఞానం కావాలని సి.వి. ప్రబోధించారు. మార్క్స్, లెనిన్ మావో అందరూ నాస్తికులే, హేతువాదులే, గతితార్కిక భౌతిక వాదాన్ని జీవితంగా మలుచుకొన్నవారే. మరి మన జీవితాల్లో కూడా హేతువాద జీవన విధానం ఎందుకు లేదు అని సి.వి. ప్రశ్నించారు. ఇప్పుడు ఈ అవసరాన్ని మరింతగా గుర్తించే ప్రజాశక్తి ప్రచురణలు సి.వి.గారి మొత్తం గ్రంథాలను ప్రచురించాయి. అవార్డులకు, సన్మానాలకు, పొగడ్తలకు, ధనకాంక్షకు, ఆశ్రిత పక్షపాతానికి లోబడకుండా జీవించిన సి.వి. ఈనాటి ఉద్యమకారులందరికి జీవితాచరణలో ఆదర్శప్రాయుడు. అధ్యయనం, రాత ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాణానికి సోపానాలని ఆయన ఆచరించి చూపాడు. ఈనాడు అంబేడ్కర్ వాదులు, మార్క్స్ వాదులు, హేతువాదులు కలిసి పని చేయడానికి కావలసిన పునాది కృషిని సి.వి. చేశారు. తెలుగువారి మరో మహాత్మాఫూలే అయిన ఆయన కోరినట్టే మార్క్స్, అంబేడ్కర్, హేతువాద, లౌకిక వాద శక్తులన్నీ ఐక్యంగా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని ఆచరణాత్మకంగా నిర్మించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అవుతుంది. చరిత్ర నిర్మాతలకు మరణం లేదు. సి.వి.కి మరణం లేదు. - డాక్టర్. కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక కార్యకర్త, రచయిత మొబైల్ : 98497 41695 -
మనిషి రూపాలే ఆ అక్షరాలు
ఉర్దూతో విద్యాభ్యాసం మొదలైనా తెలుగు భాషాభిమాని అయ్యాడు నారాయణరెడ్డి. ఆయన కవిత్వంలో ఉర్దూ గజళ్లలోని మానవతావాద స్పర్శ ఉంది. అయితే ఆయన నిరాశను కాక ఆశావహ సందేశాన్ని ఇవ్వడానికే ప్రయత్నించాడు. తెలుగు కవిత్వంలో వేమన, గురజాడ, జాçషువ, శ్రీశ్రీ, సినారె వీరంతా కవిత్వంగా పుట్టి, కవిత్వంగా జీవించారు. శరీరం మట్టిలో కలుస్తుంది. అక్షరం ఆకాశ నక్షత్రమై వెలుగొందుతుంది. అక్షరానికి మరణం లేదు.. కవికీ మరణం లేదు.. ఆకాశం నుంచి భూమికి కవితా వెలుగులు ప్రసరింపజేసినవాడు.. తెలంగాణ మాగాణం నుంచి ఆకాశాన నక్షత్రమై వెలుగొందినవాడు. భూమి పొరలు చీల్చి కవితా జలతరంగమై పొంగినవాడు. కవిత్వాన్ని మానవతా గానం చేసి ఆలపించినవాడు. మానవత్వాన్ని జీవితాచరణగా మలచినవాడు. నిరంతర కవితాధ్యయన సంపన్నుడు డాక్టర్ సి. నారాయణరెడ్డి. సుబంధుడు అన్నట్టు ‘ప్రత్యక్షర శ్లేషమయ ప్రబంధ–విన్యాçస వైదగ్ధ్య నిధి: కవీనామ్’. మాటే శ్లేషగా పలికినవాడు. పలుకు పలుకులో పలుకుబడినీ, శ్రుతినీ మేళ వించి కవిత్వమై భాసించినవాడు. మహాకవి, పరిశోధకుడు, మహోపాధ్యాయుడు, మహావక్త. ‘విశ్వనాథనాయకుడు’లో ఆయనే అన్నట్టు ‘గుండెపై కుంపటి రగుల్కొనగ పరుగెత్తి–పశ్చిమాంభోధి గర్భమున సూర్యు డుదూకె– తన ప్రతాపమ్ము వార్ధక్యదోషోపహత–మైపోయె బ్రతుకెందుకని ముఖము తప్పించె– చిర్రుబుర్రను అల్పచిత్తుల ముఖస్థితికి–ప్రతిబింబమటు లెర్రవడెను పడమటిదిక్కు–ఒక భ్రష్టచేతసుని వికృతోహలకు బాహ్య రూపమోయన్నట్టు వ్యాపించెను తమస్సు’. మహాకవి నారాయణరెడ్డి సూర్యుడినీ, చీకటినీ తన కవిత్వంలో లోతుగా అభివ్యక్తి చేశాడు. ఆ పలుకు మీద ఎన్ని ప్రభావాలో! ఇతివృత్తం ఏదైనా దానిని సుసంపన్నం చేయటం ఆయన కవితాశైలి. విశ్వనా«థనాయకుని కావ్యం తంజావూరు రాజుల చరిత్ర నుంచి తీసుకున్నారు. విశ్వనా«థనాయకుని తల్లిని సృష్టించారు. ఈ కావ్యాన్ని అతి ప్రసిద్ధమైన ఖండగతి, మిశ్రగతి, త్రిశ్రగతి ఛందస్సులో రాశారు. ఈ కావ్యం జగత్ ప్రసిద్ధి కావటానికి కారణం సినారె అధ్యయం చేసిన, బోధించిన మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్తమాల్యద, పాండురంగ మహత్మ్యం, విజయ విలాసం గ్రంథాల అధ్యయన స్పృహ ఇందులో ఉండడమే. సినారె శ్రీనాథుడిని ఒడిసి పట్టారు. ఆ కవిసార్వభౌముడి సీసపద్యంలో ఉన్న గమకాన్ని తెలుగు వచన ఛందంలోకి ప్రవహింపచేశారు. అటు కృష్ణశాస్త్రినీ, ఇటు శ్రీశ్రీనీ తనలో ఇముడ్చుకొని భిన్నంగా సొంత శైలిని అభ్యసించారు. ఆయనది శ్రీనాధుని జీవనశైలి. ఆత్మాభిమానం కూడా ఎక్కువ. మహాకవి జాషువ అంటే ప్రాణం. జాషువ ప్రభావమూ ఆయన జీవన శైలి మీద, కవిత్వం మీద ప్రగాఢంగా ఉంది. సంభాషణలలో ఆయనే చెప్పినట్టు పుట్టిన ఊరు హన్మాజీపేటలో జానపదులు పాడే జక్కుల కథల నుంచి, హరికథల నుంచి శ్రుతి నేర్చుకున్నారు. భూమి ఉన్న వారి కుటుంబంలో పుట్టినా అహంకారాన్ని వీడి దళితవాడల్లో సంచరించాడు. ఆయన కవిత తపఃఫలం కవిత్వాన్ని అలవోకగా రాసినట్టు అనిపించినా అది వచ్చేది మాత్రం తపస్సు నుంచే. భూమిని చూసినా, కొండను చూసినా, నదిని చూసినా సినారె పొంగిపోతాడు. మనిషిని చూస్తే విచ్చుకుంటాడు. జ్ఞానపీఠ్ పురస్కారాన్ని తీసుకువచ్చిన ‘విశ్వంభర’ గురించి ఇలా అన్నారాయన: ‘ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి! కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతి శక్తుల వశీకరణం ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి! ఆదిమ దశ నుంచీ ఆధునిక దశ వరకూ మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు. మనిషి సాధన త్రిముఖం, కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగునా ఎదురుదెబ్బలు, క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు. ‘విశ్వంభర’ కావ్య రచనకు పూర్వం నాలో గీసుకున్న రేఖాచిత్రమిది. విశ్వంభరలో ఆయన మానవునిలో ఉండే అన్ని కోణాలను మనముందుకు తీసుకువచ్చాడు. మనిషి అంతర్మథనాన్ని గురించి మహత్తరంగా వర్ణించాడు. ప్రకృతినీ, మనిషినీ ఉజ్జ్వలంగా సమన్వయిం చాడు. కవిత్వానికి మానవతత్వం తోడైతే చిత్తదీప్తిని అభివ్యక్తి చేయగలిగిన మహత్తర గుణం ముందుకు వస్తుంది. మహా కవిత్వంలో ఉండే భావ గాంభీర్యం, రస ప్రతీతి లక్షణాలు విశ్వంభరలో కనిపిస్తాయి. అవి ఇలా సాగాయి: ‘అడుగు సాగుతున్నది అడుసులో నక్కిన ముళ్ళను తొక్కేస్తూ/ అడుగు సాగుతున్నది అడ్డగించిన మంచుబెడ్డలను కక్కిస్తూ/ కనిపిస్తున్నాయి అడుగు కంటికి మనుషుల తోళ్లు కప్పుకున్న తోడేళ్లు/ వినిపిస్తున్నాయి అడుగు చెవికి తునిగిపోతున్నా అరవలేని లేళ్లనోళ్లు. అడుగు గుండెలో ఉబికింది కడలిని ముంచేసే కన్నీరు/ అడుగు గొంతులో ఉరిమింది పిడుగులను మింగేసే హోరు’. ఈ కవిత్వం చదువుతుంటే చేమకూర వేంకటకవి ‘విజయ విలాసం’ చదివినట్టుంటుంది. రామరాజభూషణుడి వసుచరిత్రలా భాసిస్తుంది. కవి త్వంలో శ్రుతిబద్ధతే కాక అంతర్మ«థనం, వ్యక్తిత్వ ప్రకటన, ప్రకృతి అన్వయం మనకు కన్పిస్తాయి. ఉర్దూ ఉషస్సులో తెలుగు కవితా వాకిలికి సినారె జీవితంలో విద్యార్జన ఘట్టమూ అధ్యయనపూర్ణమైందే. చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత చాదర్‌ఘాట్ కళాశాలలో ఉర్దూ మాధ్యమంలోనే ఆయన (1948–49) ఇంటర్ పూర్తిచేశారు. నిజానికి ఉర్దూ భాష మనిషిని ఉన్నతునిగా మారుస్తుంది. సినారె కవిత్వంలోని సాంద్రతకూ, సూక్తుల అభివ్యక్తికీ కారణం ఉర్దూ కవిత్వమే. ఉర్దూ కవిత్వంలో ఆయనకున్న అభినివేశం మెుత్తం ఆయన కవిత్వంలో పరిమళిస్తుంది. కబీర్ అన్నట్టు ‘చక్కీ చలతీ దేఖ్ కర్దియా కబీరా రోయ్– దో పాటన్ కే బీచ్ మే సాబిత్ బచా న కోయ్’ (రెండు రాళ్ల మధ్య ధ్యానమంతా నలిగిపోతున్నది. ఏమీ మిగలలేదు. సుఖం, దుఃఖం, పుణ్యం, పాపం, పగలు, రాత్రి, వెలుతురు, చీకటి ఇవన్నీ కలగలసిన ప్రపంచం ద్వంద్వ జగత్తు. జనన మరణాలు సైతం రెండు. ఈ రెండింటి నడుమ చిక్కుకుని అమూల్యమైన జీవనకాలం మానవ జన్మ నష్ట పోయింది. లక్ష్యం సిద్ధంచలేదు– అని భావం. తిరుగుతున్న విసుర్రాయిని చూసి కబీర్ అలా అన్నాడు). ఉర్దూతో విద్యాభ్యాసం మొదలైనా తెలుగు భాషాభిమాని అయ్యాడు నారాయణరెడ్డి. ఆయన కవిత్వంలో ఉర్దూ గజళ్లలోని మానవతావాద స్పర్శ ఉంది. అయితే ఆయన నిరాశను కాక ఆశావహ సందేశాన్ని ఇవ్వడానికే ప్రయత్నించాడు. ఉర్దూ కవిత్వం నుంచి ఆయన చీకటిని పారద్రోలి, వెలుగును చిమ్మే అభ్యుదయ పద్ధతిని స్వీకరించాడు. వామపక్ష భావాలున్న అభ్యుదయానికి బౌద్ధాన్ని సమన్వయించాడు. అయితే ఆయన విప్లవకారులు మరణించినప్పుడు కన్నీటి సంద్రమై కూడా రగిలాడు. ‘ఉదయం నిన్నురితీస్తారని తెలుసు, ఆ ఉదయాన్నే ఉరి తీస్తారని తెలుసు, కాంతి పచ్చినెత్తురులా గడ్డకట్టునని తెలుసు, కాలం క్షణకాలం స్తంభించిపోవునని తెలుసు. న్యాయాన్నే శవంలాగ విసిరేస్తారని తెలుసు, ధర్మాన్నే చితి లోపల తగలేస్తారని తెలుసు. నీ నాదం జలధరాల నిండిపోవునని తెలుసు, నీ క్రోధం సాగరాల పొంగి పొరలునని తెలుసు. నీ చూపులు జ్యోతులుగా నీ శ్వాసలు ఝంఝలుగా, నీ స్మృతి జనసంస్కృతిగా నిలిచిపోవునని తెలుసు.’ అన్నారాయన. ఆయన రచనల్లో ‘మనిషి , మట్టి, ఆకాశం’ విశిష్టమైన కావ్యం. ఆయనది జీవన మథనం. ఆయన మనిషిని లోతుగా చూశాడు. మనిషిలోని వైరుధ్యాలను కవితాత్మకం చేశాడు. మనిషిలో ఉండే చీకటిని పారద్రోలి, మనిషిలో ఉన్న క్రాంతి నదులకు ఆనకట్టలు కట్టాడు. ఆయన నిత్యనూతనం. నిరంతర అక్షర సృష్టి ఆయనది. ఆయన పాటల్లోని కవిత్వం తెలుగు సినిమాలకు నూత్న శోభనిచ్చింది. మానవతా సందేశాన్ని, ప్రబోధ చైతన్యాన్ని, కుటుంబ నీతిని, స్త్రీ అభ్యుదయాన్ని, ఆత్మీయ బంధాన్ని అందించింది. మనిషిని నమ్మినవాడు సినారె జీవితంలో స్నేహభావం మెండు. బుద్ధుడు చెప్పిన ప్రేమ, కరుణ, ప్రజ్ఞలు ఆయన జీవిత గమనంలో కనిపిస్తాయి. ఆయన మనిషిని నమ్మాడు. మనిషే ఆయన కవిత్వానికి గీటురాయి. గురజాడ ప్రభావం ఆయన మీద బలంగా ఉంది. రాయప్రోలు సుబ్బారావు ప్రభావమూ ఉంది. ఆయన తెలుగు కవే అయినా సంస్కృత భాషా పదాలను కవిత్వంలో విరివిగా వాడారు. కొత్త తెలుగు పదబంధాలను సృష్టించారు. ‘మనిషి, మట్టి, ఆకాశం’లో ఆయన ఇలా అన్నాడు. ‘మడిచి చూస్తే మనిషి మెదడు పిడికెడు, తరిచి చూస్తే సముద్రమంత అగాధం ఆకాశమంత అనూహ్యం. ఎన్ని సజీవ భావధారలను తనలో కలుపుకుంటుందో ఎన్ని ప్రాణాం తక ప్రవృత్తుల తిమింగలాలను తన అడుగు పొరల్లో భద్రంగా దాచుకుంటుందో. పరవశించిందా అంతరిక్ష ఫాలంలో కొత్త నక్షత్రమై మెరుస్తుంది. కసి పుట్టిందా చీకటి పుట్టలోకి చొచ్చుకుపోయి ఊపిరితిత్తుల్లో విషం నింపుకుని వస్తుంది. సృష్టి ఎత్తునూ లోతునూ కొలిచే మానదండం మానవ మస్తిష్కం. మస్తిష్కమంటే ఒత్తితే సొనకారే గుజ్జు పదార్థం కాదు. అమూర్తంగా ప్రభవించే అద్భుతాలోచనల ప్రసూతి నిలయం’’. ఆయన అవార్డుల కంటే ఆయనే ఉన్నతుడు సినారె గారితో నాది 30 ఏళ్ళ సాహితీ బంధం. ఆయనకంటే 22 సంవత్సరాలు చిన్నవాడిని. అయినా అటువంటి తేడాలు ఎప్పుడూ చూపించలేదు. ఆయనకు కవిత్వమంటే ప్రాణం. కవిత్వం వినటమే ద్యానం. కవిత్వం చదవడమే గానం. అందుకే ఆయనకు కవితా మిత్రులే ఎక్కువ. సంభాషణలో ఎన్నో జీవన గా«థలు వర్ణిస్తారు. జీవనసూత్రాలు చెబుతారు. నా కవితా సంకలనాలు పది ఆయనే ఆవిష్కరించారు. నాకు ఆయన పేరున ఉన్న పురస్కారాలు వచ్చాయి. ఆయన పొందిన పదవులు, అవార్డుల కంటే ఆయన వ్యక్తిత్వం గొప్పది. డాక్టర్ నారాయణరెడ్డి జీవనశైలి ఆయన గుండెల్లో ఉండే భావోద్వేగాలను వ్యక్తావ్యక్తంగా ఉంచుతుంది. ఆయన ఉపన్యాసం సంగీత ధుని. ఆయన పాఠం గజల్ గానం. ఆయన ఎదుట మనిషిని నొప్పించడు. చెప్పదలచుకున్నది మాత్రం చతురంగా చెబుతారు. ప్రవక్త, తత్వవేత్త మరణిస్తే తిరిగి లేస్తారు. కవికైతే మరణమే రాదు. తెలుగు కవిత్వంలో వేమన, గురజాడ, జాçషువ, శ్రీశ్రీ, సినారె వీరంతా కవిత్వంగా పుట్టి కవిత్వంగా జీవిం చారు. శరీరం మట్టిలో కలుస్తుంది. అక్షరం ఆకాశ నక్షత్రమై వెలుగొందుతుంది. అక్షరానికి మరణం లేదు.. కవికీ మరణం లేదు.. వ్యాసకర్త సామాజిక కార్యకర్త, రచయిత డా.కత్తి పద్మారావు మొబైల్ : 98497 41695 -
కరణం బలరాంపై ధ్వజమెత్తిన ‘కత్తి’
గుంటూరు: రాష్ట్ర శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో మాజీ మంత్రి కరణం బలరాంకు టిక్కెట్టు ఇవ్వడం ఎంతవరకు సబబని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి పద్మారావు ప్రశ్నించారు. స్థానిక లుంబినీ వనంలోని నవ్యాంధ్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కరణం బలరాం హత్యలకు పాల్పడి జైలు జీవితం అనుభవించి వచ్చాక కూడా సొంత ఊరిలోని దళితవాడపై దాడి చేసి తగులబెట్టిన చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. శాసనమండలికి రాజ్యాంగం ప్రకారం మేధావులు, రాజ్యాంగ నిపుణులు, పండితులను ఎన్నుకోవాల్సి ఉందన్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని సీఎం కుమారుడు లోకేష్‌కు కూడా ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వడం ద్వారా వంశపారంపర్య రాజకీయాలకు చంద్రబాబు తెర తీశారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక సామాజిక వర్గం జులుం అధికమైందని, నూతన శాసనసభ కొలువు తీరిన రోజు అందువల్లే ప్రతిపక్షం స్వేచ్ఛగా వ్యవహరించలేని పరిస్ధితి కనిపించిందని అన్నారు. రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల నుంచి ప్రజలు వలస వెళుతున్న పరిస్థితులుంటే తొలి అర్ధ సంవత్సరంలో ప్రభుత్వం 12.23 శాతాన్ని వృద్ధి రేటుగా పేర్కొనడం శోచనీయమన్నారు. నూతనంగా నిర్మించిన శాసనసభలో కొలువు కావడం చారిత్రక ఘట్టమని, అయితే నూతన శాసనసభను కులాధిపత్యంతో కాకుండా ప్రజాస్వామిక, సామ్యవాద, లౌకిక భావ జాలంతో నడపాలని పద్మారావు సూచించారు. -
‘రోహిత్ మృతిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి’
పొన్నూరు : రోహిత్ మరణంపై ప్రస్తుత న్యాయసాధికార మంత్రి రామ్‌దేవ్ అటాలే, రాంవిలాస్ పాశ్వాన్, మాయావతి, సీతారామ్ ఏచూరితో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని నవ్యాంద్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రోహిత్ దళితుడు కాదనడం, అతని ఆత్మహత్య వెనుక స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ ప్రమేయం లేదని, తనకు తానే ఆత్మహత్యకు కారణమయ్యాడని అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎ.కె రూపస్‌వాల్ ఇచ్చిన రిపోర్టు సరియైంది కాదని తెలిపారు. ఈ రిపోర్టును నిర్వీర్యం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు ప్రమేయం స్పష్టంగా ఉందని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి సూసైడ్‌నోట్ దేశంలోని అన్ని పత్రికల్లో ప్రచురించడమే కాక బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీ చర్యలు ఉన్నట్లు నిర్థారించాయని పద్మారావు చెప్పారు. పార్లమెంటులోని 111 మంది దళిత ఎంపీలు ఆ నివేదిక అవాస్తవమని నిరాకరించాలని కోరారు. వీసీ అప్పారావును కాపాడేందుకే రోహిత్ దళితుడు కాదనే నివేదిక ఇచ్చారన్నారు. ప్రధానమంత్రే స్వయంగా రోహిత్ మరణం వెనుక ఉన్న కుల అంశాన్ని ప్రస్తావించడమే కాకుండా ఎర్రకోట మీద చేసిన ప్రసంగాన్ని మర్చిపోకూడదని తెలిపారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు సొంత సామాజిక వర్గానికి చెందిన వీసీ అప్పారావును రక్షించాలనే కాంక్షతోనే ఇటువంటి నివేదికలు తెచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసీటీ కేసులో ఉన్న వీసీని మరలా నియమించడం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. -
పెచ్చురిల్లుతోన్న మతోన్మాదం
దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తి పద్మారావు గాంధీనగర్ : బీజేపీ అధికారం చేపట్టాక విశ్వవిద్యాలయాల్లో దాడులు పెరిగాయని, మతోన్మాదం పెచ్చురిల్లుతోందని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు అన్నారు. అరండల్‌పేటలోని అంబేడ్కర్‌భవన్‌లో సాధన ఆధ్వర్యంలో మనువాదం– మతోన్మాదం అంశంపై శనివారం సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరిస్తున్నాయన్నారు. భారతదేశంలో మొదటి శాస్త్రవేత్తలు చర్మకారులేనని చెప్పారు. ఉత్పత్తిలో భాగస్వాములైనవారు వెనుకబడిన కులాల వారేనన్నారు. ఉత్పత్తిలో ఏ మాత్రం ప్రాధాన్యతలేని అగ్రకులాలు మతన్మోద దాడులకు దిగడం సిగ్గుచేటని చెప్పారు. సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ రత్నం మాట్లాడుతూ విద్యార్థులు, స్కాలర్స్ హక్కుల కోసం పోరాడుతున్న వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం సరికాదన్నారు. దురుద్ధేశంతోనే యూనివర్శిటీలో అంబేడ్కర్ సంఘం నాయకులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. యూనివర్శిటీలను మతోన్మాదానికి కేంద్రాలుగా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. రోహిత్ ఉదంతం ఇందులో భాగంగానే జరిగిందని చెప్పారు. రోహి™Œ lకుటుంబానికి న్యాయం జరిగే వరకు సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాషాయ మూకల దాడులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు పద్మ, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ప్రవీణ్, పీడీఎస్‌యూ కార్యదర్శి రవిచంద్ర, కేవీపీఎస్ నాయకులు మాల్యాద్రి, వినయ్‌కుమార్, క్రాంతికుమార్ పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాకు బాబు వ్యతిరేకి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో దళిత తత్వవేత్త కత్తిపద్మారావు పొన్నూరు: ‘నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.కోట్లు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి బడా కాంట్రాక్టర్లకు, విదేశీ కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరుస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ ప్యాకేజీ పాట పాడుతున్నారు.’ అని దళిత తత్వవేత్త కత్తి పద్మారావు ధ్వజమెత్తారు. ‘హోదా’పై బాబు అనుసరిస్తున్న కప్పదాటు వైఖరి, ప్రత్యేక హోదా సాధనతో కలిగే ప్రయోజనాలపై ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఆ విషయాలు చంద్రబాబుకు తెలియవా? చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రత్యేక హోదాపై కేంద్రానికి ఎన్ని లేఖలు రాశారు? ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలు సామాన్యులకు కూడా తెలుసు. చంద్రబాబుకు తెలియదా? ఆయన మాత్రం ప్రత్యేక ప్యాకేజీ పాట పాడుతున్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారు. పారిశ్రామిక వాడల ఊసేలేదు. అవి అభివృద్ధి చెందితే సంపద సృష్టించగలం. అయితే 13 జిల్లాల్లో ఎక్కడా ఆ ప్రయత్నాలు జరగడం లేదు. బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో హరిత విప్లవం, క్షీర విప్లవం, నీటి విప్లవం పూర్తిగా దెబ్బతిన్నాయి. పశువుల కొనుగోలుకు రుణాలు ఇస్తున్నా వాటికి గ్రాసం లభ్యం కాని పరిస్థితి. ఆస్ట్రేలియాలో వందల ఎకరాల్లో పశుగ్రాసం పెరుగుతోంది. రాష్ట్రంలో పశుగ్రాసం పెంచడానికి భూమి ఇవ్వలేదు. క్షీర విప్లవం ఏ విధంగా సాగుతుంది? పరిశ్రమలొస్తే నిరుద్యోగం ఉండదు.. దేశంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో పరిశీలించకపోవడం దురదృష్ణకరం. పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుంది. ఉత్పత్తులు పెరిగి అమ్మకాల ద్వారా సంపద సృష్టించుకొనే అవకాశం కలుగుతుంది. అయితే బాబు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. జర్మనీ, జపాన్, సింగపూర్, చైనా, మలేషియాల చుట్టూ తిరుగుతున్నారు. కేంద్రంతో రాష్ట్రానికి అవసరమైన వనరులు సమకూర్చే విషయంలో అనుబంధం తగ్గింది. రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్, హిందూ అజెండాపై మోదీతో అంతర్లీనంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. విదేశీ పర్యటనలు కాకుండా అదే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద చూపితే రాష్ట్రానికి ప్రత్యేకహోదా దక్కేది. జలరవాణాపై చిన్నచూపు.. రాష్ట్రానికి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అద్భుతమైన తీరరేఖ ఉంది. దీనికి తోడు విస్తారంగా నదులు ఉన్నాయి. ఈ క్రమంలో జలరవాణాపై దృష్టి సారించకుండా విమానయానం వైపు చూస్తున్నారు. విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికల రూపకల్పన చేస్తున్నారు. నౌకాయానాలు పెంచుకోవడం ద్వారా రవాణా ఖర్చు తగ్గి విదేశీ మారకద్రవ్యం పెరుగుతుంది. నాడు సుగంధ ద్రవ్యాల కోసం ప్రపంచం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. అందుకే అనేక ఓడరేవులను ఆంగ్లేయులు ఏర్పాటు చేశారు. ఓడ-రేవు స్పృహే చంద్రబాబుకు లేదు. ఆయన దృష్టంతా బయట నుంచి వస్తున్న డబ్బు పైనే. బడా వ్యాపారులైన గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కంభంపాటి రామ్మోహనరావు, సీఎం రమేశ్, సుజనాచౌదరి వంటి వారిపై ఉంది. 2019 ఎన్నికలను పొలిటికల్ ఎలక్షన్‌గా మార్చి ఓటుకు రూ.5 వేలు ఇచ్చి అయినా గెలవాలని తాయపత్రయపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు వాస్తవాలను గమనించాలి. ప్రత్యేక హోదా కోసం గళం విప్పాలి. -
'వ్యాపార కేంద్రంగా అమరావతి మారకూడదు'
గుంటూరు : ప్రపంచం గర్వించదగ్గ బౌద్ధ సంస్కృతికి నిలయమైన అమరావతి విదేశీయులు నిర్మించే వ్యాపార కేంద్రంగా మారకూడదని దళిత ఉద్యమనేత డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు. గుంటూరులో జాషువా 120వ జయంతి ఉత్సవ సభలో పాల్గొన్న కత్తి పద్మారావు మాట్లాడుతూ బౌద్ధ సంస్కృతి గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏం తెలుసునని ప్రశ్నించారు. ధనవంతులకే పరిమితమై పేద, ధనిక అంతరాలను మరింతగా పెంచే వాణిజ్య రాజధాని తెలుగు ప్రజలకు అవసరం లేదని, అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి సంతోషంగా జీవించే ప్రజా రాజధాని కావాలని స్పష్టం చేశారు. జాషువా రచనల స్ఫూర్తితో పేద, పీడిత, కార్మిక, కర్షక వర్గాలు ఇందు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో ఉన్న భూముల్లో 90 శాతం సీఎం చంద్రబాబు నాయుడు వర్గానికి చెందిన అగ్ర వర్ణాల చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. మన రాష్ట్రంలో రాజధానిని నిర్మించే ఇంజినీర్లు లేరన్నట్లు చంద్రబాబు సింగపూర్ వెళ్లి అక్కడి పాలకులను బతిమాలుతున్నారని, అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దగల సామర్థ్యం తెలుగు ఇంజినీర్లకు ఉందన్నారు. రైతుల నుంచి భూములు లాక్కుని తిరిగి వారికే పెన్షన్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. -
లగ్జరీని వదల్లేకే బాబు సీమాంధ్రకు రావట్లేదా?
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక కార్యదర్శి కత్తి పద్మారావు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. సీఎంగా బాబు హైదరాబాద్ నుంచి పాలన సాగించడమేంటని ఆయన ప్రశ్నించారు. గుంటూరు జిల్లా నంబూరులో ఆయన నిన్న మాట్లాడుతూ హైదరాబాద్‌లో అలవాటైన లగ్జరీని వదిలి ముఖ్యమంత్రి సీమాంధ్రకు రాలేకపోతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తినే సీఎంగా ఎన్నుకోవాలన్నారు. 85 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే సీమాంధ్రలో ఉన్నారని వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత మహాసభ తీర్మానించిందని, విగ్రహం ఏర్పాటుకు వర్సిటీలో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆవశ్యకం
పూర్వ రాష్ట్రంలో ఉన్న సంపదనంతా హైదరాబాద్‌కే తరలించడం వల్ల వచ్చిన పెనుముప్పు ఒకే ప్రాంతం మీద దృష్టి పెడితే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కృష్ణా, గుంటూరు జిల్లాలో రాజధానిని నిర్మిస్తే, కర్నూలును ఉప రాజధానిని చేయాల్సిన అవసరముంది. నేడు సీమాంధ్ర రాష్ట్రంగా రూపొందడం ఒక గొప్ప చారిత్రక అవసరం. ఈ పదమూడు జిల్లాలు ఒక రాష్ట్రంగా ఏర్పడటం వల్ల పరిపాలనా సౌలభ్యంతో పాటు ఆయా జిల్లాల్లో ఉండే మానవ వనరులు, ప్రకృతి వనరులు, మానవ శ్రమ కొత్తపుం తలు తొక్కడానికి అవకాశముంది. ఎన్నో ప్రసిద్ధి చెందిన రాజ్యాలు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించాయి. చారిత్రకంగా సీమాంధ్ర ఎంతో ప్రాధాన్యమున్న ప్రాం తం. 960 కిలోమీటర్ల సముద్ర తీరం వాణిజ్యానికి అపార అవకాశాలను కల్పిస్తోంది. ఫ్రెంచ్, డచ్, ఇంగ్లిష్ పాలకులు ఈ సముద్ర తీర ఓడ రేవుల నుండే కోస్తాంధ్రలోకి ప్రవేశించారు. బౌద్ధ సంస్కృతి సీమాంధ్ర మొత్తంలో పరిఢవిల్లడం వల్ల లౌకికవాద భావజాలం కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో విరాజిల్లింది. ఇంతటి ప్రాధాన్యతగల ప్రాంతంలోని నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం ఈ ప్రాంత వాసుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. అయితే పూర్వ రాష్ట్రంలో ఉన్న సంపదనంతా హైదరాబాద్‌కే తరలించడం వల్ల వచ్చిన పెనుముప్పు ఒకే ప్రాంతం మీద దృష్టి పెడితే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్య పట్టణాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాలో నిర్ణయిస్తే, ఉప ముఖ్యపట్టణాన్ని తప్పకుండా కర్నూలు జిల్లాలో కూడా నిర్మించవలసిన అవసరముంది. ఎందుకంటే రాయలసీమ రాష్ట్రం మొత్తంమీద వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి జిల్లాల్లో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. సముద్ర మట్టం నుంచి ఈ ప్రాంతం 250 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంది. ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం 858 మి.మీ కాగా, ఉత్తరాంధ్రలో వర్షపాతం అత్యధికంగా 1250 మి.మీ ఉంది. రాయలసీమలో మాత్రం 800 మి.మీ కన్నా తక్కువ వర్షపాతమే నమోదవుతోంది. అందువల్లే సీమ కరువు ప్రాంతంగా ఉంది. సీమలో ప్రధానంగా పండిస్తున్న వేరుశనగ, కొర్ర జొ న్న పంటలకు కనీస స్థాయిలో కూడా నీరు అందడం లేదు. సాలీనా 30 శాతానికి మించి పంటలు పండించే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరు. పైగా రాయలసీమలో ఖరీఫ్ పంటకాలంలో వర్షపాతం 365.8 మి.మీ మాత్రమే. ఇది కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండదని సీమ విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి రాజధానిని సీమాంధ్రలో ఏ ప్రాంతంలో నిర్ణయించినా సీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకత ప్పదు. అలాగే ఖనిజ సంపదకు ఆలవాలమైన ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలను అభివృద్ధి చేస్తే విశాఖపట్నం ముంబైలాగా అభివృద్ధి కాగలదు. కాగా, రాజధాని విషయంలో పాలకులు విస్మరిస్తున్న అంశం దళిత సమస్య. రాయలసీమలో ఎస్సి, ఎస్టి కులాలు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ అంటరానితనం కులవివక్ష, అస్పృశ్యత యథేచ్ఛగా కొనసాగడానికి కారణం పేదరికం, నిరక్షరాస్యతే. ఇకపోతే గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్క శాతం భూమి కూడా దళితులకు లేదంటే ఎంత వివక్ష కొనసాగుతుందో అర్థమవుతుంది. ఇక్కడి దళితుల్లో 60 శాతం మందికి ఇళ్లస్థలాలు లేవు. ప్రతి ఇంటిలోనూ డిగ్రీ చదివిన పిల్లలంతా నిరుద్యోగులుగా జీవిస్తున్నారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి ఉపన్యాసాల్లో ఎక్కడా దళితుల ప్రస్తావన కానీ, ఎస్సీ సబ్ ప్లాన్ ప్రస్తావన గానీ చేయడం లేదు. సీమాంధ్ర అన్ని జిల్లాల్లోనూ దళిత బహుజన మైనార్టీల ప్రజలు వెనుకబడి ఉన్నారు. వీరికి జీవనభృతిని, ఉపాధిని, విద్యను, భూవసతిని కల్పించడం వల్ల మాత్రమే సీమాంధ్ర మళ్లీ గొప్ప రాష్ట్రంగా నిలబడుతుంది. తమ సొంత కులాలకు మాత్రమే మేలు జరిగే పద్ధతుల్లో ఆలోచిస్తే మిగిలిన కులాలన్నీ అణగారిపోతాయి. మళ్లీ కొత్త ఉద్యమాలు వస్తాయి. ఒకే కులాన్ని, ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. దీనివల్ల మళ్లీ ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఉద్యమాలు బలంగా వస్తాయి.పైగా కార్పొరేట్ విద్యా సంస్థలకే పెద్ద పీట వేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుండటంతో ప్రభుత్వ విద్య అంతరించి పోయే ప్రమాదం ఉంది. అంతిమంగా.. పాలకులు ప్రజలకు ఆశలు రేపెట్టకూడదు. పాలకులు ప్రజలను శ్రమజీవులుగా, శక్తివంతులుగా మార్చాలి. మానవ వనరులకు మానవ శ్రమను సమన్వయం చేసినప్పుడే ఉత్పత్తి వర్ధిల్లుతుంది. ప్రభుత్వమూ వర్ధిల్లుతుంది. అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేసుకోవలసిన చారిత్రక సందర్భం ఇది. (వ్యాసకర్త దళిత ఉద్యమకారుడు) కత్తి పద్మారావు