అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆవశ్యకం
పూర్వ రాష్ట్రంలో ఉన్న సంపదనంతా హైదరాబాద్‌కే తరలించడం వల్ల వచ్చిన పెనుముప్పు ఒకే ప్రాంతం మీద దృష్టి పెడితే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కృష్ణా, గుంటూరు జిల్లాలో రాజధానిని నిర్మిస్తే, కర్నూలును ఉప రాజధానిని చేయాల్సిన అవసరముంది.
నేడు సీమాంధ్ర రాష్ట్రంగా రూపొందడం ఒక గొప్ప చారిత్రక అవసరం. ఈ పదమూడు జిల్లాలు ఒక రాష్ట్రంగా ఏర్పడటం వల్ల పరిపాలనా సౌలభ్యంతో పాటు ఆయా జిల్లాల్లో ఉండే మానవ వనరులు, ప్రకృతి వనరులు, మానవ శ్రమ కొత్తపుం తలు తొక్కడానికి అవకాశముంది. ఎన్నో ప్రసిద్ధి చెందిన రాజ్యాలు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించాయి. చారిత్రకంగా సీమాంధ్ర ఎంతో ప్రాధాన్యమున్న ప్రాం తం. 960 కిలోమీటర్ల సముద్ర తీరం వాణిజ్యానికి అపార అవకాశాలను కల్పిస్తోంది.
ఫ్రెంచ్, డచ్, ఇంగ్లిష్ పాలకులు ఈ సముద్ర తీర ఓడ రేవుల నుండే కోస్తాంధ్రలోకి ప్రవేశించారు. బౌద్ధ సంస్కృతి సీమాంధ్ర మొత్తంలో పరిఢవిల్లడం వల్ల లౌకికవాద భావజాలం కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో విరాజిల్లింది. ఇంతటి ప్రాధాన్యతగల ప్రాంతంలోని నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం ఈ ప్రాంత వాసుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.
అయితే పూర్వ రాష్ట్రంలో ఉన్న సంపదనంతా హైదరాబాద్‌కే తరలించడం వల్ల వచ్చిన పెనుముప్పు ఒకే ప్రాంతం మీద దృష్టి పెడితే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్య పట్టణాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాలో నిర్ణయిస్తే, ఉప ముఖ్యపట్టణాన్ని తప్పకుండా కర్నూలు జిల్లాలో కూడా నిర్మించవలసిన అవసరముంది. ఎందుకంటే రాయలసీమ రాష్ట్రం మొత్తంమీద వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి జిల్లాల్లో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. సముద్ర మట్టం నుంచి ఈ ప్రాంతం 250 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంది. ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం 858 మి.మీ కాగా, ఉత్తరాంధ్రలో వర్షపాతం అత్యధికంగా 1250 మి.మీ ఉంది. రాయలసీమలో మాత్రం 800 మి.మీ కన్నా తక్కువ వర్షపాతమే నమోదవుతోంది.
అందువల్లే సీమ కరువు ప్రాంతంగా ఉంది. సీమలో ప్రధానంగా పండిస్తున్న వేరుశనగ, కొర్ర జొ న్న పంటలకు కనీస స్థాయిలో కూడా నీరు అందడం లేదు. సాలీనా 30 శాతానికి మించి పంటలు పండించే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరు. పైగా రాయలసీమలో ఖరీఫ్ పంటకాలంలో వర్షపాతం 365.8 మి.మీ మాత్రమే. ఇది కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండదని సీమ విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి రాజధానిని సీమాంధ్రలో ఏ ప్రాంతంలో నిర్ణయించినా సీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకత ప్పదు. అలాగే ఖనిజ సంపదకు ఆలవాలమైన ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలను అభివృద్ధి చేస్తే విశాఖపట్నం ముంబైలాగా అభివృద్ధి కాగలదు.
కాగా, రాజధాని విషయంలో పాలకులు విస్మరిస్తున్న అంశం దళిత సమస్య. రాయలసీమలో ఎస్‌సి, ఎస్‌టి కులాలు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ అంటరానితనం కులవివక్ష, అస్పృశ్యత యథేచ్ఛగా కొనసాగడానికి కారణం పేదరికం, నిరక్షరాస్యతే. ఇకపోతే గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్క శాతం భూమి కూడా దళితులకు లేదంటే ఎంత వివక్ష కొనసాగుతుందో అర్థమవుతుంది. ఇక్కడి దళితుల్లో 60 శాతం మందికి ఇళ్లస్థలాలు లేవు. ప్రతి ఇంటిలోనూ డిగ్రీ చదివిన పిల్లలంతా నిరుద్యోగులుగా జీవిస్తున్నారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి ఉపన్యాసాల్లో ఎక్కడా దళితుల ప్రస్తావన కానీ, ఎస్సీ సబ్ ప్లాన్ ప్రస్తావన గానీ చేయడం లేదు.
సీమాంధ్ర అన్ని జిల్లాల్లోనూ దళిత బహుజన మైనార్టీల ప్రజలు వెనుకబడి ఉన్నారు. వీరికి జీవనభృతిని, ఉపాధిని, విద్యను, భూవసతిని కల్పించడం వల్ల మాత్రమే సీమాంధ్ర మళ్లీ గొప్ప రాష్ట్రంగా నిలబడుతుంది. తమ సొంత కులాలకు మాత్రమే మేలు జరిగే పద్ధతుల్లో ఆలోచిస్తే మిగిలిన కులాలన్నీ అణగారిపోతాయి. మళ్లీ కొత్త ఉద్యమాలు వస్తాయి. ఒకే కులాన్ని, ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. దీనివల్ల మళ్లీ ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఉద్యమాలు బలంగా వస్తాయి.పైగా కార్పొరేట్ విద్యా సంస్థలకే పెద్ద పీట వేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుండటంతో ప్రభుత్వ విద్య అంతరించి పోయే ప్రమాదం ఉంది.
అంతిమంగా.. పాలకులు ప్రజలకు ఆశలు రేపెట్టకూడదు. పాలకులు ప్రజలను శ్రమజీవులుగా, శక్తివంతులుగా మార్చాలి. మానవ వనరులకు మానవ శ్రమను సమన్వయం చేసినప్పుడే ఉత్పత్తి వర్ధిల్లుతుంది. ప్రభుత్వమూ వర్ధిల్లుతుంది. అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేసుకోవలసిన చారిత్రక సందర్భం ఇది.
(వ్యాసకర్త దళిత ఉద్యమకారుడు) కత్తి పద్మారావు