వైజాగ్‌ను రాజధాని చేయాలి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్‌ను రాజధానిగా చేయాలని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ పుణ్యమాని రాష్ట్రం రెండు ముక్కలైందని, ఒక రాష్ట్రానికి కే సీఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆదాయ వనరులున్న తెలంగాణాలో కేసీఆర్ నిరాడంబరంగా ప్రమాణం స్వీకారం చేస్తే, లోటు బడ్జెట్, సమస్యలతో ఉన్న రాష్ట్రంలో బాబు రూ.30 కోట్లతో ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌కు ఉన్న విజ్ఞత బాబుకు లేకపోవడం శోచనీయమన్నారు. బాబు ప్రమాణ స్వీకారానికి ఇంత హడావుడి చేయడంలో ఆంతర్యమేమిటని, దాని వల్ల సీమాంధ్రకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు.
నవ్యాంధ్ర నిర్మాణం, నూతన రాజధాని పేరుతో విరాళాలు సేకరిస్తూ, మరో పక్క ప్రమాణ స్వీకారానికి నిధులు దుర్వినియోగం చేస్తున్నార న్నారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర పాలన సాగిస్తానన్న బాబు గుంటూరులో ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం కుటుంబ ఆస్థుల విలువ పెంచుకోవడం కోసమేన ని ఆరోపించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం తదితర హామీల అమలు, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటికే విద్య, వైద్యం, మౌళిక వసతుల పరంగా 88శాతం అభివృద్ధి చెందిన వైజాగ్‌ను రాజధానిగా చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. సమావేశంలో మొదలవలస లీలామోహన్ తదితరులు పాల్గొన్నారు.