సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ముగియడంతో సీమాంధ్రకు రాజధాని ఎంపిక ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తే మేలన్న అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శివరామకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఉన్నతాధికారుల బృందం వస్తోంది. 9న విశాఖ, 10న రాజమండ్రి, 11న విజయవాడ, 12న గుంటూరు సందర్శించి 13న హైదరాబాద్‌లో అధికారులతో భేటీ అవుతుంది. 14న ఒంగోలు, తిరుపతి, కర్నూలు ప్రాంతాలను పరిశీలించి ఢిల్లీ తిరిగి వెళ్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కమిటీ ఇప్పటికే ఢిల్లీలో రెండుసార్లు సమావేశమైంది.
12 అనిల్ గోస్వామి రాక
విభజన ప్రక్రియను సమీక్షించడానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి 12న హైదరాబాద్ వస్తున్నారు. విభజన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఎప్పటికి పూర్తవుతుంది, వేగవంతం చేసే అవకాశాలు తదితరాలను పరిశీలించి సూచనలు చేయనున్నారు. గోస్వామితో పాటు హోం శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, 22 కమిటీల ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. విభజన ప్రక్రియను మే 15కల్లా పూర్తి చేయాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇప్పటికే డెడ్‌లైన్ విధించడం తెలిసిందే.
సీమాంధ్ర రాజధాని ఎంపిక... నేడు శివరామకృష్ణన్ కమిటీ రాక
Published Fri, May 9 2014 2:03 AM | Last Updated on Mon, Jun 18 2018 8:13 PM
Advertisement