రాజధానిని నిర్ణయించేది కేంద్రమే
మాది సాధికార కమిటీ కాదు... సాంకేతిక వివరాలు మాత్రమే సేకరిస్తాం
సీమాంధ్ర రాజధాని కమిటీ స్పష్టీకరణ
సాక్షి, విశాఖపట్నం: సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వనరులకు సంబంధించిన సాంకేతికపరమైన వివరాల సేకరణ కోసమే తాము రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ డాక్టర్ రతన్‌రాయ్ చెప్పారు. రాజధానిపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. చైర్మన్ శివరామకృష్ణన్ రాకపోవడంతో ఈ కమిటీకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డెరైక్టర్ డాక్టర్ రతన్‌రాయ్ నేతృత్వం వహిం చారు. ఈ కమిటీ సభ్యులు శనివారం విశాఖ నగరం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రాజధాని ఏర్పాటుకు ఇక్కడ ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ప్రభుత్వ అతిథి గృహంలో కమిటీ సభ్యులు విలేకరులతో మాట్లాడారు. రాజధానికి అవసరమైన వనరులను పరిశీలించేందుకు తొలిసారిగా విశాఖ వచ్చినట్లు రాయ్ చెప్పారు. సీమాంధ్రలో ప్రధానమైన జిల్లాలను సందర్శించి అక్కడి మౌలిక వసతులు, సాంకేతిక అంశాలతో నివేదిక తయారు చేసి ఆగస్టు 31వ తేదీ నాటికి కేంద్ర హోం శాఖకు అందజేస్తామని తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. విశాఖ జిల్లాకు సంబంధించి అన్ని శాఖల నుంచి పూర్తి సమాచారం సేకరించినట్లు చెప్పారు. విశాఖ రాజధానిగా చేయడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని నావికాదళం అధికారులు చెప్పారా అని విలేకరులు ప్రశ్నించగా.. సాంకేతిక పరమైన అంశాల సేకరణకే తాము వచ్చామని, ఎవరి నుంచి అభిప్రాయాలను స్వీకరించలేదని రాయ్ చెప్పారు. రాజధానికి విశాఖ అనుకూలమా అని అడగ్గా.. రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఎక్కడెక్కడున్నాయో మాత్రమే ప్రభుత్వానికి నివేదిస్తామని, తుది నిర్ణయం కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఆదివారం రాజమండ్రి, విజయవాడతో పాటు గుంటూరు జిల్లాలో కూడా పర్యటించి అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని చెప్పారు. అవసరమైతే మరోసారి కూడా సీమాంధ్రలో పర్యటిస్తామన్నారు. అనారోగ్యం కారణంగా కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ రాలేకపోయారని, ఆయన త్వరలోనే తమతో పాలుపంచుకుంటారని తెలిపారు.
వివిధ ప్రాంతాల పరిశీలన
తొలుత ఈ బృందం విశాఖ నగర శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది. భూములు, నీరు, భవనాల లభ్యతపై ఆరా తీసింది. రెవెన్యూ యంత్రాంగం గతంలో ఇచ్చిన నివేదిక మేరకు మధురవాడ, ఆనందపురం, పెందుర్తి, పరవాడ, అచ్యుతాపురం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాల్ని పరిశీలించింది. సర్వే నంబర్లవారీగా ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు స్థలాలు ఖాళీగా ఉన్నాయి, అవి దేనికి అనుకూలంగా ఉంటాయో వివరాలు సేకరించింది. నగరాన్ని ఆనుకుని ఉన్న దేవాదాయ, వక్ఫ్, అటవీ భూములపై ఆరా తీసింది. మధ్యాహ్నం వుడా కార్యాలయంలో కలెక్టరేట్, వుడా, జీవీఎంసీ, రెవెన్యూ, భూగర్భ జల శాఖ, ఏయూ తదితర ప్రధాన విభాగాల ప్రతినిధులతో కమిటీ ప్రత్యేకంగా భేటీ అయింది. వారిచ్చిన నివేదికల్ని నిశితంగా పరిశీలించి, సందేహాలును నివృత్తి చేసుకుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఆదాయ, వ్యయాలపై ప్రత్యేకంగా చర్చించింది. ధరల సూచీ ఆధారంగా జీవీఎంసీ ఆస్తి పన్ను పెరగకపోవడంపై ఆరా తీసింది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ప్రాజెక్టుల ప్రగతి, భవిష్యత్ ప్రాజెక్టుల ప్రతిపాదనలను తెలుసుకుంది. ఏయూ పరిధిలోని విద్యా సంస్థలు, వాటి విస్తీర్ణంపైనా వర్సిటీ ఆచార్యులతో కమిటీ చర్చించింది.
వినతుల వెల్లువ
విశాఖలో రాజధానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని కోరుతూ పలు ప్రజా సంఘాల ప్రతినిధులు కమిటీకి వినతిపత్రాలు అందజేశారు. ప్రత్యేక జోన్ డిమాండ్ ఉన్న రైల్వే, మేజర్ పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయం, సువిశాల తీరప్రాంతం, పెట్రో కారిడార్, ఐటీతోపాటు పారిశ్రామికంగా అన్ని విధాలా అభివృద్ధికి అనువైన వాతావరణం ఇక్కడ ఉందని తెలిపారు. ప్రతిపాదనల్లో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాల్ని పేర్కొన్నారు. విశాఖను మించి రాజధానిగా అర్హతలున్న మరే నగరం సీమాంధ్రలో లేదని ఆ వినతుల్లో తెలిపారు. విశాఖలో పర్యటించిన కమిటీలో డాక్టర్ రాయ్‌తోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్ డెరైక్టర్ అరోమర్ రవి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అర్బన్ అఫైర్స్ డెరైక్టర్ జగన్ షా, న్యూఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్ ఆచార్య కె.టి.రవీంద్రన్, హైదరాబాద్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.తిమ్మారెడ్డి ఉన్నారు.