సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల తుది పంపిణీకి సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనపై కమలనాథన్ కమిటీ దృష్టి సారిం చింది. రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ, మార్గదర్శకాలపై కమలనాథన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సలహా కమిటీని కేంద్ర ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన కమిటీ సమావేశం కానుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్, కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనవర్మ ఇందులో పాల్గొంటారు. ఈ సమావేశం లో ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసి ప్రజల ముందు ఉంచుతారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలను కమిటీ పరిగణనలోకి తీసుకుని తుది మార్గదర్శకాలను రూపొందించి ప్రధాని ఆమోదానికి పంపనుంది.
ఆయన ఆమోదం అనంతరం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగుల తుది పంపిణీ ప్రక్రియను కమిటీ చేపట్టనుంది. రెండు రాష్ట్రాల్లో కేటగిరి వారీగా కేడర్ సంఖ్య ఎంత ఉండాలనేది కమలనాథన్ కమిటీ నిర్ధారిస్తుంది. అనంతరం ఉద్యోగుల నుంచి నిర్ధారించిన కేటగిరిల్లో అప్షన్లను స్వీకరించనున్నారు. ప్రధానంగా దంపతులు, త్వరలో పదవీ విరమణ చేయనున్న వారు, ఎస్సీ, ఎస్టీలు, కొన్ని రకాల రోగాలతో బాధపడుతున్న వారి నుంచి ఆప్షన్లను స్వీకరించనున్నారు. ఉద్యోగుల పంపిణీపై అభ్యంతరాలుంటే తెలియజేసేందుకు కొంత సమయం ఇస్తారు. అనంతరం ఉద్యోగుల తుది పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అయితే కొత్త ప్రభుత్వాల సలహాలు, సూచనల మేరకు కమిటీ ముందుకు సాగాల్సి ఉంటుంది. నిబంధనలను అతిక్రమించడానికి వీలుండదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.