ఉద్యోగుల్లో ‘స్థానికత’ చిచ్చు
సచివాలయ సిబ్బందిలో పెరుగుతున్న దూరం
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజనకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగుల మధ్య చిచ్చు రేగుతోంది. శాఖల వారీగా ఉద్యోగుల పంపిణీ కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఇరు ప్రాంత ఉద్యోగుల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. సచివాలయ ఉద్యోగుల స్థానికత వివరాలను ఇటీవల వెల్లడించిన తర్వాత వాతావరణం మరింత వేడెక్కింది. సీమాంధ్ర ఉద్యోగులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో స్థానికతను మార్చుకున్నారంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసిన ఆరోపణలు మాటల యుద్ధానికి తెరలేపాయి. సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ సచివాలయం గేటు లోపలికి కూడా రానివ్వమంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఉద్యోగుల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనంటూ సీమాంధ్ర ఉద్యోగులూ ఘాటుగానే స్పందించారు. విభజనపై రెండు రోజులుగా సాగుతున్న ఈ రగడ గురువారం కూడా కొనసాగింది. ఇరు ప్రాంత ఉద్యోగులు తమ వాదనను గట్టిగా వినిపించారు.
తప్పుడు పత్రాలతో ఉండాలనుకుంటే అనుమతించం
ఉద్యోగుల స్థానికతకు సంబంధించి సీమాంధ్రులు సమర్పించిన సర్టిఫికెట్లలో తప్పుడు ధ్రువపత్రాలు ఉన్నాయని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు ఆరోపించారు. ప్లానింగ్ విభాగంలో 11 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తే అందులో తొమ్మిది మంది తప్పుడు పత్రాలనే సమర్పించినట్లు తేలిందన్నారు. తప్పుడు పత్రాలతో ఇక్కడే కొనసాగాలనుకుంటే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సమ్మె చేసిన ఉద్యోగులు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయాలనుకోవడం ఏ విధంగా ైనె తికత అనిపించుకుంటుందని నిలదీశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఇక్కడ కొనసాగే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జీఏడీ అధికారులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారని 2 రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
ఇక్కడే పుట్టి పెరిగితే స్థానికులు కారా?: మురళీకృష్ణ
ఉద్యోగుల కేటాయింపులు రాజ్యాంగం ప్రకారమే జరుగుతున్నా తప్పుబట్టడం సమంజసం కాదని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ అన్నారు. మార్గదర్శకాల ప్రకారం జరుగుతున్న విభజనను అందరూ అంగీకరించాల్సిందేనన్నారు. ఆప్షన్లు ఇస్తే ఒక్క సీమాంధ్ర ఉద్యోగి కూడా తెలంగాణలో ఉండరన్నారు. వివిధ కారణాల వల్ల మహా అయితే పది శాతం మంది మాత్రమే ఉండటానికి ఇష్టపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడే పుట్టి పెరిగిన వారిని కూడా స్థానికులు కాదనడంలో అర్థం లేదన్నారు. నిబంధనల మేరకు ఎవరు స్థానికులన్న స్పష్టత రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం జరగకపోయినా సీమాంధ్రకు వెళ్లి చెట్లకిందైనా ప్రశాంతంగా పనిచేసుకుంటామని చెప్పారు. కొంతమంది నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తమకూ ఆత్మాభిమానం ఉందని, తమ రాష్ట అభివృద్ధికి తాము పనిచేయాలనే ఆకాంక్ష ఉందన్నారు.
చంద్రబాబు స్పందించాలి: అశోక్‌బాబు
కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించడానికి ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నిరాకరించారు. తెలంగాణకు కాబోయే సీఎం హోదాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్ర కాబోయే సీఎం చంద్రబాబు స్పందించాలని చెప్పారు. కేసీఆర్ స్థాయికి తాను ప్రతి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కాగా, ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా బాధ్యతాయుతమైన నేతలు మాట్లాడటం సరికాదని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కో-చైర్మన్ మురళీమోహన్ అన్నారు. విభజన ప్రక్రియ సాఫీగా పూర్తి కావడానికి తెలంగాణ నేతలు సహకరించాలని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.