రియల్ బూమ్.. ఢాం | Land Retail Gets down now | Sakshi
Sakshi News home page

రియల్ బూమ్.. ఢాం

Published Sun, May 25 2014 1:58 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

రియల్ బూమ్.. ఢాం - Sakshi

రియల్ బూమ్.. ఢాం

హైదరాబాద్, రంగారెడ్డిలో భారీగా పడిన రియల్ ఎస్టేట్
భూముల క్రయువిక్రయూల్లో స్తబ్ధత
గణనీయంగా తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు
విభజన తర్వాత సగానికి సగం తగ్గిన రాబడి
మెదక్ జిల్లాపైనా విభజన ప్రభావం
 కొంతకాలం గడిస్తేనే మళ్లీ  పుంజుకుంటుందంటున్న రియల్టర్లు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని, శివారు ప్రాంతాల్లో రియల్ భూం ఢాం అంది!  విభజన ఎఫెక్ట్‌తో హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశం నుంచి నేలకు దిగింది. భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విభజన ప్రకటన చేశాక రిజిస్ట్రేషన్లు సగానికి సగం పడిపోయాయి. ప్రత్యేకించి నగర శివార్లలో ఏర్పడిన వెంచర్లవైపు ఎవరూ కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. తెలంగాణలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అనుసరించే విధానాలను బట్టి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఆ రంగం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రియల్టర్లు చెబుతున్నారు.
 
 రూ. 564 కోట్ల నుంచి రూ. 274 కోట్లకు..
 
 అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలో 2013 మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 564.17 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది (2014) అదే నెలల్లో రిజిస్ట్రేషన్ల రాబడి రూ.274.47 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని విభజించాక ఏకంగా సగానికిపైగా రాబడి తగ్గిపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాను విడిగా చూస్తే గతేడాది మార్చిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.313.84 కోట్లు ఉండగా... ఈ ఏడాది మార్చిలో ఈ ఆదాయం ఏకంగా రూ.121.12 కోట్లకు పడిపోయింది. ఇక ఒక్క హైదరాబాద్‌ను చూస్తే గతేడాది మార్చిలో రిజిస్ట్రేషన్ల ద్వారా 112.69 కోట్ల రాబడి రాగా... ఈ ఏడాది మార్చిలో అది ఏకంగా 46.73 కోట్లకు దిగజారింది.
 
 గతేడాది ఏప్రిల్‌లో రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.103 కోట్లు రాగా.. ఈ ఏడాది అదే నెలలో రూ.68.07 కోట్లకు పడిపోయింది. విభజన ప్రక్రియ జరిగిన ఫిబ్రవరి నెలతో పోలిస్తే తర్వాతి నెలల్లోనూ భారీగా తేడా కనిపించింది. రంగారెడ్డి, హైదరాబాద్‌ల్లో రిజిస్ట్రేషన్ల రాబడి ఫిబ్రవరిలో రూ.277.35 కోట్లు ఉండగా... మార్చి నెలలో రూ. 167.85 కోట్లకు, ఏప్రిల్‌లో రూ.106 కోట్లకు పడిపోయింది. రంగారెడ్డి, హైదరాబాద్‌లకు ఆనుకొని ఉన్న మెదక్ జిల్లాపైనా విభజన ప్రభావం కనిపించింది. ఈ జిల్లాలో గతేడాది మార్చిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.45.80 కోట్లు కాగా... ఈ ఏడాది మార్చిలో అది రూ.14.99 కోట్లకు అంటే మూడో వంతుకు పడిపోయింది.
 
 కొత్త ప్రభుత్వ విధానాలతోనే: రియల్ ఎస్టేట్ రంగం ఇంత తీవ్రంగా పడిపోవడం... రిజిస్ట్రేషన్ల ఆదాయం సగానికిపైగా తగ్గడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. విభజన నేపథ్యంలో నెలకొన్న గందరగోళ పరిస్థితి వల్లే ఇక్కడ భూముల కొనుగోళ్లు పడిపోయాయని అంటున్నారు. ఈ పరిస్థితి మెరుగుపడాలంటే తెలంగాణలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే కీలకం అని రియల్టర్లు అంటున్నారు. ప్రభుత్వం పెట్టుబడుల పట్ల సానుకూలంగా వ్యవహరించి, పెట్టుబడులను ఆహ్వానించే తీరుపైనే రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు. హైదరాబాద్‌కు ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, వాతావరణ సమతుల్యత తదితర కారణాలతో రాబోయే ఏడాదిలోగా రియల్ రంగం యథాతథ స్థితికి వస్తుందన్న ధీమా వ్యక్తంచేశారు.
 హైదరాబాద్‌కు మించిన నగరం ఎక్కడుంది?: టి.శేఖర్‌రెడ్డి
 
 విభజన తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని తాను భావించడం లేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) అధ్యక్షులు టి.శేఖరరెడ్డి అంటున్నారు. విభజన జరిగిన తర్వాత ఈ రెండు మూడు నెలల కాలంలో రిజిస్ట్రేషన్లు పడిపోయాయని భావించడం లేదని చెప్పారు. ఆ నెలల్లో కొన్న భూములకు అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్లు జరగబోవని, రిజిస్ట్రేషన్లు ఏమేరకు జరిగాయో తర్వాత తెలుస్తుందని పేర్కొన్నారు. విభజన ప్రభావం ఎంతో కొంతమేర ఉండటానికి కారణం వేరే ఉందన్నారు. ‘‘విభజన జరగకముందు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లలో కొంత గందరగోళం ఉంది. అయితే విభజన జరిగాక అందరికీ స్పష్టత వచ్చింది. అయినా ఆసియాలోనే హైదరాబాద్ గొప్ప నగరం. దేశంలో ఇక్కడ ఉన్నన్ని వసతులు మరెక్కడా లేవు. మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడి భూములపైనా... ఇతరత్రా ప్రాజెక్టులు, పరిశ్రమలపైనా పెట్టుబడులు పెట్టడానికి ఎవరికీ అభ్యంతరాలు ఉండబోవు’’ అని ఆయన చెప్పారు. నూతన పరిశ్రమల స్థాపన కోసం వచ్చే పారిశ్రామికవేత్తలకు కొత్త ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించి, పదిహేను ఇరవై రోజుల్లోగా అనుమతులు ఇచ్చేట్లయితే హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు వల్ల రాబోయే 20 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని, దీనిద్వారా నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో ఊహించవచ్చన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement