అప్పుడే రాజీనామా చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు: అశోక్ బాబు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సమర్పించిన రాజీనామాలు డ్రామాలో భాగం కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఏపీఎన్జీవో భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంపీలు రాజీనామాలను ఆమోదించుకోవాలి అని సూచించారు.
ప్రజలకు న్యాయం చేయాలంటే ఉద్యమం కొనసాగించాలని ఏపీఎన్జీవో ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం అని అన్నారు. తాము కోరిన వెంటనే రాజీనామాలు చేసి ఉంటే ఈ పరిస్తితి వచ్చేది కాదని అశోక్ బాబు అన్నారు. గురువారం జరిగే ఐకాస భేటి తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. ప్రజలను కేంద్రమంత్రులు మానసికంగా ఆందోళనకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీలో అభిప్రాయ సేకరణకు బిల్లు ప్రవేశపెడితే వ్యతిరేకించాలని ఎమ్మెల్యేలను కోరుతామన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న ప్రకటనలు అయోమయం సృష్టిస్తున్నాయన్నారు. రేపు సీఎం కిరణ్ తో చర్చించిన తర్వాత ఎమ్మెల్యేలను హామీ ఇవ్వాలని కోరుతామన్నారు.