హైదరాబాద్: అక్టోబర్ 15 వరకూ సీమాంధ్రలో సమ్మెను కొనసాగిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఆదివారం సమైక్య గర్జనలో కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డ ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 2 వ తేదీ వరకూ గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు తెలుపుతామన్నారు. మూడ, నాలుగు తేదీల్లో సీమాంధ్ర ఎంపీల ఇళ్ల వద్ద వంటా వార్పు ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 5 వ తేదీన రహదారుల దిగ్బంధ చర్యలను, 5, 6 తేదీల్లో పెట్రోల్ బంకులు, ప్రైవేట్ బస్సుల నిలిపివేస్తామన్నారు. 7, 8 తేదీల్లో రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం, 9,10, 11 తేదీల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేపడతామన్నారు. మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు.
సీఎం స్థాయిలో చర్చలు జరిపితే వెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమీటీకి చట్టబద్దత లేదని ఈ సందర్భంగా తెలిపారు. అటువంటి కమిటీ ఎలా నివేదికలు ఇస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జీతం లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు...బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని అశోక్ బాబు తెలిపారు.