ఉద్యోగులు కష్టపడకుండా ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సీమాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా, విభజన ప్రక్రియలో కేంద్రానికి సహకరిస్తున్న సీమాంధ్ర ఎంపీలు, మంత్రుల తీరు దురదృష్టకరమని ఏపీఎన్జీవో సంఘం విమర్శించింది. విభజన దిశగా కేంద్రం మొండిగా ముందుకెళితే అంతకంటే మొండిగా తాము ఉద్యమిస్తామని స్పష్టంచేసింది. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. శాసనసభకు బిల్లు వచ్చిన రోజునే సమ్మెకు దిగాలని పలు ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని వెల్లడించారు.
ఈ విషయంలో మళ్లీ సమ్మె చేయడానికీ వెనకాడబోమని పేర్కొన్నారు. శాసనసభకు బిల్లు రాకుంటే ఉద్యమం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని కూడా త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. గతంలో మాదిరిగా ఉద్యోగులు కష్టపడేలా ఉద్యమం ఉండదని, ప్రభుత్వాలు కష్టపడే విధంగా ఉంటుందని చెప్పారు. ఆదివారం జరగనున్న జేఏసీ కార్యవర్గ సమావేశంలో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని తెలిపారు. బంద్‌లు, చలో హైదరాబాద్, చలో ఢిల్లీ తదితర కార్యక్రమాలకు రూపకల్పన చేసే యోచన ఉందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం రోజునే విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు సభ నుంచి బయటకురావాలని, రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు కోరుతున్న ప్యాకేజీల వల్ల సీమాంధ్రకు ఒరిగేదేమీ ఉండదన్నారు. గన్నవరం విమానాశ్రయాన్ని ఇన్నేళ్లుగా అభివృద్ధి చేయలేని సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు.. ఇప్పుడు ప్యాకేజీలు ఇస్తే అభివృద్ధి చేస్తామంటూ చెప్పడాన్ని వారు ఎద్దేవా చేశారు. హెల్త్‌కార్డుల జీవోలను ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే ఐఆర్ ప్రకటించాలని, వీలైనంత త్వరగా పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఈ ఏడాది జూలై 1 నుంచి అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్లపై త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు.