కిరికిరి పెడితే కొట్లాటే.. | kcr fires on the episode of seemandhra employees | Sakshi
Sakshi News home page

కిరికిరి పెడితే కొట్లాటే..

Published Fri, May 23 2014 1:27 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

కిరికిరి పెడితే కొట్లాటే.. - Sakshi

కిరికిరి పెడితే కొట్లాటే..

టీ-ఉద్యోగులతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
ఏ ప్రాంత ఉద్యోగులు ఆ రాష్ట్రానికే పనిచేయాలి
ఆంధ్రా ఉద్యోగులను సచివాలయం గేట్లు కూడా దాటనివ్వం.. మారుమూల ఉద్యోగులనూ విభజించాల్సిందే
జిల్లా, జోనల్ కేడర్‌లో యథాస్థితిని అంగీకరించం..
ఇన్‌సర్వీస్‌గా సమ్మె కాలం.. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తాం
విభజన బిల్లు పాసైన తర్వాత ఇచ్చిన ప్రమోషన్లు, రివర్షన్లు చెల్లవు.. గడువుకు ముందే పీఆర్‌సీ అమలు చేస్తాం
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులే ఉండరు..
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ వేతనాలు ఇస్తాం
సర్కారు ఏర్పడిన పది రోజుల్లో ప్రమోషన్లు..
అన్ని హామీలు నెరవేరుస్తానని కేసీఆర్ వెల్లడి
విభజన వ్యూహం, విధానంపై చర్చ.. జూన్ 2 లోగా ఆంధ్రా ఉద్యోగుల సమాచారమివ్వాలని సూచన
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా ఉద్యోగుల విభజనపై దృష్టి సారించారు. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ర్ట ప్రభుత్వానికే పనిచేయాలని ఆయన తేల్చిచెప్పారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను తెలంగాణలో ఉంచితే సహించేది లేదన్నారు. కాదని కయ్యానికి కాలు దువ్వితే, కిరికిరి పెడితే తాము కూడా కొట్లాటకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ హెచ్చరించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన వ్యూహం, విధానంపై చర్చించడానికి తెలంగాణ ప్రాంత ఉద్యోగులతో ఆయన ఇక్కడి కొంపల్లిలోని ఆర్‌డీ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం సమావేశమయ్యారు. వివిధ శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు ఈ సమావేశానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు.
 
 ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో అన్ని స్థాయిల్లో ప్రస్తుతమున్న సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే పనిచేయాలని పునరుద్ఘాటించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులను కూడా స్థానికత ఆధారంగా విభజించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ సచివాలయం గేట్లు కూడా దాటనివ్వబోమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగుల జాబితాను టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన వార్‌రూమ్ కమిటీకి అందించాలని టీ-ఉద్యోగులకు సూచించారు. ఈ పర్యవేక్షణ కమిటీ శనివారం నుంచి పనిచేస్తుందని చెప్పారు.
 ఉద్యోగుల్లేకుంటే ఉద్యమమే లేదు
 
 తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగులు త్యాగాలకు సిద్ధపడి రాజీలేని పోరాటం చేశారని, ఉద్యోగుల్లేకుంటే ఉద్యమమే లేదని కేసీఆర్ కొనియాడారు. సకల జనుల సమ్మె వంటి అద్భుత దృశ్యకావ్యాన్ని కళ్లెదుట ఆవిష్కరించారని గుర్తుచేశారు. ఈ సమ్మె కాలాన్ని ఇన్‌సర్వీసుగా పరిగణిస్తామని చెప్పారు. జీతం రాకపోతే మిత్తితో కలిపి ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలిస్తామని చెప్పారు. ఇంక్రిమెంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానమే బాగుందని, దాన్ని కొనసాగిస్తేనే ఉద్యోగులకు మేలు కలుగుతుందని కేసీఆర్ వివరించారు. గడువులోపే వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని చెప్పారు. ఆర్టీసీ, సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
 
 ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయి జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ, చైల్డ్ కేర్‌కు సంబంధించిన సడలింపుల విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రంగా ఉండే లంచ్‌రూమ్‌లు, టాయిలెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలకు వచ్చినప్పుడు అక్కడే టీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగులతో కచ్చితంగా సమావేశమవుతానని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం రాగానే శాఖలవారీగా డీపీసీలు ఏర్పాటుచేస్తామని, 10-12 రోజుల్లోనే పదోన్నతులు ఇస్తామన్నారు. ఆ తర్వాత వచ్చే రెండు నెలల్లోనే కింది స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీనిచ్చారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఐఏఎస్‌లు, కలెక్టర్ల వంటి అధికారుల దబాయింపులుండవని కేసీఆర్ పేర్కొన్నారు. వారు కూడా కింది స్థాయి ఉద్యోగులతో ప్రజాస్వామిక భాషలోనే మాట్లాడాలన్నారు. ఏ సమస్య ఉన్నా చర్చించుకుందామని హితవు పలికారు. సమస్యల పరిష్కారం కోసం ఇందిరాపార్కులు, దర్నా చౌక్‌ల అవసరమే లేదని ఆయన వ్యాఖ్యానించారు.
 
 యథాతథ స్థితి ప్రసక్తే లేదు
 
 జిల్లా, జోనల్ కేడర్‌లో యథాతథ స్థితిని అంగీకరించే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎంత వరకైనా సిద్ధపడతామన్నారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరి కార్యాలయాల్లో వారు యూనియన్ నేతలకు జూన్ 2లోగా అందించాలని ఉద్యోగులకు కేసీఆర్ సూచించారు. దీనికోసం దేవీ ప్రసాద్ అధ్యక్షతన స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్ సహా 10 మందితో వార్‌రూమ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. అలాగే రాష్ర్ట విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ర్టంలో అమలైన ప్రమోషన్లు, రివర్షన్లు చెల్లవన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాగానే వీటిని సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు మీడియాలో వస్తున్న కథనాలు నిజం కావన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాతనే ఆ ప్రక్రియ ఉంటుందన్నారు. ఉద్యమ నేతగా ఉన్నా, ప్రభుత్వ అధినేతగా ఉన్నా ఆంధ్రా ఉద్యోగుల వైఖరిలో మార్పులేదన్నారు. తెలంగాణ ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టనని కేసీఆర్ స్పష్టం చేశారు.
 
 ఇక్కడే ఉంటే శంకరగిరి మాన్యాలే
 
 ఆంధ్రాకు చెందిన ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగిస్తే వారికి శంకరగిరి మాన్యాలే గతి అని టీఆర్‌ఎస్ అధినేత, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల ముఖ్య నేతలతో ఇక్కడి కొంపల్లిలోని ఆర్‌డీ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి మీడియాను అనుమతించలేదు. విశ్వసనీయవర్గాల సమచారం ప్రకారం.. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాలపైనే కేసీఆర్ మాట్లాడారు. ‘ఉద్యోగుల విభజన ఇంకా జరగలేదు. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఆ ప్రక్రియ జరుగుతుంది. దీనిపై మీడియాలో వస్తున్నదంతా అవాస్తవం. వాటిని పట్టించుకోవద్దు. ప్రస్తుతానికి ప్రభుత్వాలు నడవడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే నాకు చెప్పారు. అఖిల భారత సర్వీసుల్లోని అధికారుల విభజన మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. మిగిలినవన్నీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనే ఉంటాయ’ని కేసీఆర్ వివరించారు. ‘ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చి పనిచేసుకొమ్మంటే ఎలా? కొత్త ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉండొద్దా? తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్నో ఉంటయి. ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి వంటి ఎన్నో రహస్యమైన పనులుంటయి.
 
 అవన్నీ లీకు కావా? అందుకే ఎవరితోనూ కయ్యం వద్దు. మంచిగా చెప్తం. తెలంగాణలో పనిచేసే ఆంధ్రా ఉద్యోగులను తీసుకోవాలని ఆంధ్రా ప్రభుత్వానికి ముందగా లేఖ రాస్తా. ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో హాయిగా పనిచేసుకోవాలంటున్నా. అయినా వినకుండా బలవంతంగా ఇక్కడే ఉద్యోగులుంటే వారికి శంకరిగిరి మాన్యాలే గతి. జీతాలు, పెన్షన్లు రాకుండా చూద్దాం. ప్రాధాన్యత లేని లూప్‌లైన్లో వారిని వేద్దాం. ఇంకేమన్నా ఇబ్బందులుంటే పెడతం. వారు కోర్టుకు పోతరు. అవన్నీ నడుస్తనే ఉంటయి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించినా.. ఎవరి స్థానికత ఏమిటో పక్కనే పనిచేస్తున్న ఉద్యోగులకు తెలియకుండా పోదు. ఏ ఉద్యోగి ఎక్కడి వారో అన్ని వివరాలను సేకరించండి. ఆంధ్రా ఉద్యోగి అయితే పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో కూడా మనం ఏర్పాటు చేసిన వార్‌రూమ్ కమిటీకి చెప్పండి. అవన్నీ జూన్ 2లోగా చేస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే పంపిణీలో మాట్లాడుతం. ఎక్కడి వారిని అక్కడకు పంపుతం. అయినా బలవంతంగా ఎవరైనా ఉంటామంటే ప్రధానికి చూపించడానికి సాక్ష్యాలు పట్టుకరండి’ అని కేసీఆర్ సూచించారు.
 
 మంత్రి పదవి ఎవరికి?
 ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన ఒకరిని మంత్రిని చేసుకుందామని ఉద్యోగులతో సమావేశంలో కేసీఆర్ చెప్పారు. దీనికి స్పందించిన ఉద్యోగులు... ప్రస్తుతం తమ తరఫు నుంచి టీఆర్‌ఎస్‌లో ఓ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ ఉన్నారని, వారిద్దరికీ మంత్రి పదవులను ఇవ్వాలని కోరారు. సరే చూద్దాంలే అని కేసీఆర్ దాటవేశారు. ఇక కొందరు ఉద్యోగులు.. ఇళ్ల స్థలాలు, బదిలీలు, ప్రమోషన్లు వంటి విషయాల గురించి ప్రస్తావించినప్పుడు కేసీఆర్ నుంచి మౌనమే సమాధానమైంది.
 
 పుంటికూర చాలదా?
 ‘స్థానికతను గుర్తించడానికి 50 ఏళ్ల నుంచి రాద్ధాంతం చేస్తున్నరు. టీడీపీ హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇది చర్చకు వచ్చింది. నేను అప్పుడే అన్నా. సచివాలయంలో సాయంత్రం పని అయిపోయినంక ఒక చేతిలో పుంటికూర పట్టుకుని, మరోచేతిలో ఆనెపు కాయను పట్టుకుని గేటుకాడ నిలబడుదాం. గేటుకాడికి వచ్చిన ఉద్యోగికి పుంటికూర చూపించి ఇది ఏందని అడుగుతం. పుంటికూర అన్నోళ్లను తెలంగాణ దిక్కు, గోంగూర అన్నోళ్లను ఆంధ్రాకు పంపిద్దామని అప్పుడే చెప్పిన. ఇప్పుడు కూడా స్థానికత విషయంలో పెద్ద లొల్లి అవసరం లేదు. ఎవరెక్కడివాళ్లో వట్టిగనే తెలుస్తది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు దేవీ ప్రసాద్, సి.విఠల్, కారెం రవీందర్ రెడ్డి, ఎస్.ఎం.హుస్సేని ముజీబ్, కృష్ణ యాదవ్, ఎం.మణిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement