employees bifurcation
-
ఏపీఏటీ ఉద్యోగుల విభజనపై తేల్చండి
ఉభయ రాష్ట్రాల సీఎస్‌లకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) ఉద్యోగులు, ఆస్తుల విభజనపై తేల్చాలని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఓ స్థాయీ నివేదికను కూడా సమర్పించాలని వారికి స్పష్టం చేసింది. నవంబర్ నెలకు ఏపీఏటీ నిర్వహణ వ్యయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను వచ్చే నెల 19కి వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీఏటీ సమర్పించిన నిర్వహణ బిల్లులను స్వీకరించేందుకు ఏపీ సర్కార్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. -
కొత్త జిల్లాల ఏర్పాటుదాకా ఎదురుచూపులే?
- ముందుకు కదలని నామినేటెడ్ పదవుల భర్తీ - నిరాశలో మునిగిపోతున్న గులాబీ శ్రేణులు సాక్షి, హైదరాబాద్: గులాబీ శ్రేణులకు మరికొంత కాలం నిరాశేనా.. కొత్త జిల్లాల ఏర్పాటుదాకా నామినేటెడ్ పదవుల భర్తీ లేనట్లేనా.. ఈ ప్రశ్నలకు అధికార టీఆర్ఎస్ నేతలు కొందరు అవుననే సమాధానం చెబుతున్నారు. పదవుల పందేరం మొదలు పెడితే పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలకు వేల సంఖ్యలో పదవులు లభించే అవకాశముంది. కానీ ఇది మరికొంత ఆలస్యమవుతుందన్న సమాచారంతో పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోతున్నాయి. మెజారిటీ కార్పొరేషన్లు విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూల్లలో ఉన్నాయి. వాటిలో ఇంకా ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపకాలు జరగలేదు. దీంతో కార్పొరేషన్లలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యమయ్యే అవకాశముందని చెబుతున్నారు. పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకు రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే దాకా పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ మొదలయ్యేలా లేదని సమాచారం. నామమాత్రంగా కొన్ని పదవులకు.. టీఆర్ఎస్ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా, నిరంజన్‌రెడ్డికి రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. పార్టీ పదిహేనో ప్లీనరీ ముందు ఆర్టీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను, అంతకుముందే రాష్ట్ర సాంస్కృతిక సారథికి చైర్మన్‌గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను, ఇటీవల ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా నియమించారు. తాజాగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సీఎం రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డిని నియమించారు. ఇక పెద్ద సంఖ్యలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండళ్ల భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దేవాలయ కమిటీల పరిస్థితీ అదే. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుదాకా నామినేటెడ్ పదవుల భర్తీకి బ్రేక్ వేయాలన్న భావనలో అధినాయకత్వం ఉందన్న విషయం తెలుసుకుని పార్టీ నేతలు నిరాశలో కూరుకుపోతున్నారు. ‘రెండేళ్లకుపైగా ఎదురు చూశాం. అందరి పరిస్థితీ అగమ్య గోచరంగానే ఉంది. 14ఏళ్లు పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేశాం. నమ్ముకున్న కార్యకర్తలకూ ఏం చెప్పలేకపోతున్నాం. పార్టీ పదవులు కూడా లేకుండా పోయాయి..’ అని టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉద్యోగుల విభజన తర్వాతే వైద్య పోస్టుల భర్తీ!
వైద్య, పారామెడికల్ అభ్యర్థుల ఆశలపై సర్కారు నీళ్లు అన్ని ఆసుపత్రుల్లో కలిపి 3 వేలకు పైగా ఖాళీలు కనీసం కొత్త పోస్టుల మంజూరుపైనా స్పందించని సర్కారు మరింత ఆలస్యం కానున్న నియామకాల ప్రక్రియ 2 వేల మంది ‘కాంట్రాక్టు’ ఉద్యోగుల జాబితా తయారు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వైద్య, పారామెడికల్ అభ్యర్థుల ఆశలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నీళ్లు చల్లింది. ఉద్యోగుల విభజన ప్రక్రియ ముగిశాకే.. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. అయితే కొత్తగా మంజూరైన పోస్టులను మాత్రం భర్తీ చేస్తామని సంకేతాలు ఇస్తోంది. ఈ నిర్ణయం వైద్య, పారామెడికల్ అభ్యర్థులకు శరాఘాతంగా మారింది. తుస్సుమన్న హడావుడి.. ఇటీవల వైద్య పోస్టులను భర్తీ చేస్తామని, ఖాళీల వివరాలను ఆగమేఘాల మీద అందజేయాలని అధికారులను ఆదేశించి సర్కారు హడావుడి చేసింది. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు ఖాళీల వివరాలను సేకరించి సర్కారుకు అందజేశారు. మొత్తంగా మూడు వేలకుపైగా వైద్య, పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. దీనికి సంబంధించి 300 వైద్యుల పోస్టులతో పాటు నర్సింగ్, ఇతర పారామెడికల్ పోస్టులతో జాబితా కూడా రూపొందించారు. కానీ వాటిని ఇప్పుడే భర్తీ చేయలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. భారీ లక్ష్యం.. చర్యలు శూన్యం వైద్య ఆరోగ్యశాఖను, ఆస్పత్రులను బలోపేతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేసింది. కానీ కీలకమైన సిబ్బంది నియామకాలపై మాత్రం దృష్టి సారించడం లేదు. ప్రతి జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని, 20 వేల నుంచి 25 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలని, ప్రతి నియోజకవర్గంలో వంద గ్రామాలకు ఉపయోగపడే విధంగా ఏరియా ఆసుపత్రి ఉండాలని గతంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పీహెచ్‌సీలను 30 పడకల ఆస్పత్రులుగా, ఏరియా ఆసుపత్రులను 100 పడకలుగా, జిల్లా ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చుతామనీ చెప్పారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే కనీసం 10 వేలకు పైగా వైద్య, పారామెడికల్ సిబ్బంది అవసరమని ఆ శాఖే అంచనా వేసింది. కానీ ఖాళీగా ఉన్న 3 వేల పోస్టుల భర్తీపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కొత్తగా మంజూరైన కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ, వరంగల్ ఎంజీఎంల్లోనే భర్తీకి చర్యలు చేపట్టింది. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యాక ఖాళీ పోస్టుల భర్తీ మొదలుపెడతామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి చెప్పారు. రెండు వేల కాంట్రాక్టు పోస్టులు వైద్య ఆరోగ్యశాఖలో రెండు వేల కాంట్రాక్టు పోస్టులున్నట్లు అధికారులు గుర్తించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు వెలువడిన తర్వాత రెండు వేల మందిలో ఎందరు అర్హులుగా తేలతారనేదానిపై చర్చ జరుగుతోంది. అనుభవం, రిజర్వేషన్ సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే క్రమబద్ధీకరణ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. -
'స్థానికత ఆధారంగానే విభజించండి'
న్యూఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగులను వారివారి స్థానికత ఆధారంగానే రెండు రాష్ట్రాలకు విభజించాలని తెలంగాణ ఎన్జీవోలు కోరారు. ఈ మేరకు టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ ఆధ్వర్యంలోని ఉద్యోగ సంఘం నేతలు సోమవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్. సి. గోయల్ కు విన్నవించారు. విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని టీఎన్జీవోలు కోరగా.. సాధ్యమైనంత త్వరలో ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు గోయల్ హామీ ఇచ్చారు. -
'తెలంగాణ ఒత్తిడికి కమల్ నాథన్ కమిటీ తలొగ్గింది'
హైదరాబాద్: ఉద్యోగుల విభజనపై కమల్‌నాథన్ కమిటీ సమర్పించిన జాబితాలో అవకతవకలున్నాయని ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. శుక్రవారం నాడు ఏపీ సచివాలయ ఉద్యోగులు కమిటీ జాబితాపై చర్చించడానికి సీఎస్ ను కలిశారు. తెలంగాణ ఉద్యోగుల ఒత్తిడికి కమల్‌నాథన్ కమిటీ తలొగ్గినట్టుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చెందిన పలువురు సీనియర్ అధికారులను తెలంగాణకు కెటాయించారని మురళీకృష్ణ ఆరోపించారు. ఆ కమిటీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నారు. ఇద్దరు డిప్యూటీ సెక్రటరీలు, ఇద్దరు అదనపు సెక్రటరీలు, ఓ అసిస్టెంట్ సెక్రటరీని తెలంగాణకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని విమర్శించారు. దీనిపై కోర్టుకు వెళతామని మురళీకృష్ణ పేర్కొన్నారు. -
'ఎక్కడి వాళ్లు అక్కడే పనిచేసేలా చూడాలి'
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయి 10నెలలైనా ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం దారుణమని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం పేర్కొంది. ఇప్పటికైనా ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని పరిహాసం చేసినవాళ్లు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు తెలంగాణ సచివాలయంలో పనిచేసే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణ సచివాలయంలో ఇంకా ఆంధ్రా అధికారులు పనిచేస్తూ ప్రభుత్వానికి మచ్చ తేవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కీలకమైన ఆర్థికశాఖలో ఆంధ్రా ఉద్యోగుల ఆధిపత్యం కొనసాగుతోందని టీ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. -
పిల్లల స్థానికతపై కూడా స్పష్టత ఇవ్వండి: ఉద్యోగులు
హైదరాబాద్: ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏపీ సచివాలయ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబును కలిసి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్యోగులు మాట్లాడారు. తమ పిల్లల స్థానికతపై కూడా స్పష్టత ఇవ్వాలని చంద్రబాబును కోరినట్టు ఉద్యోగులు తెలిపారు. హెల్త్‌కార్డులు, పీఆర్సీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్క్షప్తి చేశామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం వెల్లడించారు. -
'ఉద్యోగుల విభజనలో అనిశ్చితి తొలగించాలి'
హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో అనిశ్చితి తొలగించాలని ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ సూచించారు. కమలనాథన్ కమిటీతో ఏపీ సచివాలయం ఉద్యోగులు సమావేశమైన తర్వాత మాట్లాడుతూ.. ఈనెల 25లోగా ఉద్యోగుల విభజన పూర్తిచేయాలని కమిటీకి తెలియచేశామని ఆయన అన్నారు. ఉద్యోగుల విభజన తర్వాత కూడా అనిశ్చితి కొనసాగితే మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతామని ఏపీ ఉద్యోగుల సంఘం హెచ్చిరించింది. ఉద్యోగుల విభజన, మార్గదర్శకాల ఏర్పాటు కోసం కమలనాథన్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. -
ఉద్యోగుల విభజన పూర్తయ్యాకే టీ ఇంక్రిమెంట్
* ఇంకా తేలని కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు * వేచి చూస్తున్న తెలంగాణ సర్కారు * ఉద్యోగుల సంఖ్య తేలకపోవడంతో ఇంక్రిమెంట్‌పై అస్పష్టత * ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోయాకే దృష్టి సారించాలని యోచన * రూ. 200 కోట్ల భారం పడవచ్చని ఆర్థిక శాఖ అంచనా * మౌనంగా ఉండిపోయిన ఉద్యోగ సంఘాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంక్రిమెంట్‌కు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదు. ఉద్యోగుల విభజన పూర్తయితే తప్ప దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం కన్పించడం లేదు. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో, ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న నేపథ్యంలో.. ఇంక్రిమెంట్లను ప్రకటించడం వల్ల ఆంధ్రాలో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందన్న భావన ప్రభుత్వంలో ఉంది. అంతేకాక ఇక్కడ పనిచేస్తున్న అక్కడి వారికి ఇంక్రిమెంటు ఇవ్వడం ఎందుకన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ ప్రభుత్వం ఇంక్రిమెంట్ ప్రకటనను జాప్యం చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల విభజనకు సంబంధించి నియమించిన కమలనాథన్ కమిటీ ఇప్పటికీ మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో.. ఇది ఇంకెంత కాలం సాగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర కేడర్‌లోని ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి కమలనాథన్ కమిటీ కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. గతవారంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన కమలనాథన్ ఒక నివేదిక రూపొందించారు. ఆ నివేదికపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఇంకా సంతకం చేయలేదు. ఆ నివేదికలోని పలు అంశాలపై ఆయన అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ మార్గదర్శకాల ఖరారు ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. అదీకాక సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచడంతో.. తెలంగాణకు ఆప్షన్ ఇవ్వాలనుకున్న ఉద్యోగులు సైతం తిరిగి ఆంధ్రకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఇక్కడకు రావడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలా ఉద్యోగుల విభజనపై పూర్తి స్పష్టత లేకుండా పోయింది. తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చే తెలంగాణ ఇంక్రిమెంట్‌తో దాదాపు 200 కోట్ల రూపాయల మేరకు భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగుల విభజన కసరత్తు పూర్తయితే తప్ప.. పూర్తి భారం కచ్చితంగా తెలియదని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ఇంక్రిమెంట్ కోసం గట్టిగా పట్టుపట్టలేని పరిస్థితి ఉంది. తమ సహచరులు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు డిమాండ్ చేస్తే.. ఇబ్బందులొస్తాయనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలు కూడా మౌనంగా ఉంటున్నాయి. -
చట్టప్రకారమే ఉద్యోగులకు ఆప్షన్లు
* సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల పోరానికి చంద్రబాబు భరోసా * కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన * బిల్లులో అవకతవకలను సవరించేలా కేంద్రంతో మాట్లాడతా సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగుల విభజన, ఆప్షన్లు ఉంటాయని, ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లూ పనిచేయవని తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ, కన్వీనరు వెంకట సుబ్బయ్య, కో ఆర్డినేటర్ రవీందర్ నేతృత్వంలో రెండు సంఘాల ప్రతినిధులు శుక్రవారం చంద్రబాబును ఆయన నివాసంలో వేర్వేరుగా కలిశారు. ఉద్యోగులు ఎవరి రాష్ట్రాలకు వారు వెళ్లాల్సిందేనని, ఆప్షన్లు ఉండవని, సీమాంధ్ర ఉద్యోగులను ఎవరినీ తెలంగాణ సచివాలయంలో అడుగుపెట్టనీయబోమని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగులు భయాందోళనలకు లోనవుతున్నారని వారు చంద్రబాబుకు చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరారు. ఉద్యోగుల విభజన కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారమే జరుగుతుందని, బెదిరిస్తే చట్టం మారదని, అనవసరంగా ఉద్యోగుల మధ్య వివాదాలు సృష్టించడం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా కేసీఆర్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా తాను చూసుకుంటానని, చట్టం, నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని, ఈ విషయంలో ఎవరూ అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల్లో కొందరి మూలాలు సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నాయని కేసీఆర్ అన్నంత మాత్రాన సరిపోద ని చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో తాను కేంద్రంతో కూడా మాట్లాడతానని తెలిపారు. రాజ్యాంగపరంగా మీకు ఉన్న హక్కును ఎవ్వరూ కాదనలేరని ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగుతుందనే ప్రచారం జరుగుతోందని, దీంతో సచివాలయ ఉద్యోగుల్లో కొంత భయాందోళన నెలకొందని నేతలు వివరించారు. అలాంటిది ఏమీ లేదని, తాను సచివాలయంలోని హెచ్ బ్లాక్‌కు వస్తానని, అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని బాబు చెప్పారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులో కొన్ని అవకతవకలు ఉన్నాయని, కేంద్రంతో మాట్లాడి వాటి సవరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు మాట్లాడవద్దు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల విభజన జరుగుతున్న సమయంలో సమగ్ర సమాచారం లేకుండా చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు మాట్లాడటం మంచిది కాదని కేసీఆర్‌కు చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సీమాంధ్ర ఉద్యోగులను బలవంతంగా రుద్దితే గేటు కూడా దాటనివ్వం... కాలు దువ్వితే కొట్లాటకైనా రెడీ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యమాన్ని భావోద్వేగాలతో ముడిపెట్టి సీట్లు, ఓట్లు సంపాదించుకున్నది చాలక అన్నదమ్ముల మధ్య కీచులాటలు, శాశ్వత వైరుధ్యం సృష్టించటం కేసీఆర్‌కు తగదని హితవు పలికారు. ఇరు ప్రాంతాల్లో సుహృద్భావ వాతావరణం పెంపొందించి అన్నదమ్ముల్లా కలిసుండే పరిస్థితులను నెలకొల్పాలే గానీ సీఎం స్థాయి వ్యక్తి శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా మాట్లాడటం భావ్యం కాదని చెప్పారు. ఇకనైనా ఇటువంటి ఉద్రిక్తతలు పెంచే ప్రసంగాలు మానేయాలని సూచించారు. -
ఉద్యోగులకు అండగా ఉంటాం : వైఎస్ జగన్
-
ఉద్యోగులకు అండగా ఉంటాం : వైఎస్ జగన్
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులే లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదని, వాటిని కట్టిపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్జప్తి చేశారు. ఉద్యమ పార్టీగా ఉన్నంత కాలం అన్నదమ్ముల్లా విడిపోదాం అంటున్న కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదని వైఎస్ జగన్మోహన్ సూచించారు. సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు ఉద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. జీతాలు, జీవితాలపై భయాందోళనతో ఉన్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ భరోసా ఇవ్వాలన్నారు. భయాందోళనతో ఉన్న ఉద్యోగులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధానిలో పనిచేయాల్సిన ఉద్యోగుల మధ్య వాతావరణం కలుషితం చేయడం తీవ్రమైన అంశమని, విభజన సమస్యలపై మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రాంతాల వారీగా రెచ్చగొట్టే వైఖరిని ఉపేక్షించడం తగదని, సుహృద్భావ వాతావరణంలో విభజన ప్రక్రియ సాగకుంటే ఊరుకునే పరిస్థితి ఉండదని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
కిరికిరి పెడితే కొట్లాటే..
టీ-ఉద్యోగులతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ ప్రాంత ఉద్యోగులు ఆ రాష్ట్రానికే పనిచేయాలి ఆంధ్రా ఉద్యోగులను సచివాలయం గేట్లు కూడా దాటనివ్వం.. మారుమూల ఉద్యోగులనూ విభజించాల్సిందే జిల్లా, జోనల్ కేడర్‌లో యథాస్థితిని అంగీకరించం.. ఇన్సర్వీస్గా సమ్మె కాలం.. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తాం విభజన బిల్లు పాసైన తర్వాత ఇచ్చిన ప్రమోషన్లు, రివర్షన్లు చెల్లవు.. గడువుకు ముందే పీఆర్సీ అమలు చేస్తాం తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులే ఉండరు.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ వేతనాలు ఇస్తాం సర్కారు ఏర్పడిన పది రోజుల్లో ప్రమోషన్లు.. అన్ని హామీలు నెరవేరుస్తానని కేసీఆర్ వెల్లడి విభజన వ్యూహం, విధానంపై చర్చ.. జూన్ 2 లోగా ఆంధ్రా ఉద్యోగుల సమాచారమివ్వాలని సూచన సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా ఉద్యోగుల విభజనపై దృష్టి సారించారు. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ర్ట ప్రభుత్వానికే పనిచేయాలని ఆయన తేల్చిచెప్పారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను తెలంగాణలో ఉంచితే సహించేది లేదన్నారు. కాదని కయ్యానికి కాలు దువ్వితే, కిరికిరి పెడితే తాము కూడా కొట్లాటకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ హెచ్చరించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన వ్యూహం, విధానంపై చర్చించడానికి తెలంగాణ ప్రాంత ఉద్యోగులతో ఆయన ఇక్కడి కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్ సెంటర్లో గురువారం సమావేశమయ్యారు. వివిధ శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు ఈ సమావేశానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో అన్ని స్థాయిల్లో ప్రస్తుతమున్న సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే పనిచేయాలని పునరుద్ఘాటించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులను కూడా స్థానికత ఆధారంగా విభజించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ సచివాలయం గేట్లు కూడా దాటనివ్వబోమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగుల జాబితాను టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన వార్‌రూమ్ కమిటీకి అందించాలని టీ-ఉద్యోగులకు సూచించారు. ఈ పర్యవేక్షణ కమిటీ శనివారం నుంచి పనిచేస్తుందని చెప్పారు. ఉద్యోగుల్లేకుంటే ఉద్యమమే లేదు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగులు త్యాగాలకు సిద్ధపడి రాజీలేని పోరాటం చేశారని, ఉద్యోగుల్లేకుంటే ఉద్యమమే లేదని కేసీఆర్ కొనియాడారు. సకల జనుల సమ్మె వంటి అద్భుత దృశ్యకావ్యాన్ని కళ్లెదుట ఆవిష్కరించారని గుర్తుచేశారు. ఈ సమ్మె కాలాన్ని ఇన్సర్వీసుగా పరిగణిస్తామని చెప్పారు. జీతం రాకపోతే మిత్తితో కలిపి ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలిస్తామని చెప్పారు. ఇంక్రిమెంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానమే బాగుందని, దాన్ని కొనసాగిస్తేనే ఉద్యోగులకు మేలు కలుగుతుందని కేసీఆర్ వివరించారు. గడువులోపే వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని చెప్పారు. ఆర్టీసీ, సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయి జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ, చైల్డ్ కేర్‌కు సంబంధించిన సడలింపుల విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రంగా ఉండే లంచ్‌రూమ్‌లు, టాయిలెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలకు వచ్చినప్పుడు అక్కడే టీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగులతో కచ్చితంగా సమావేశమవుతానని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం రాగానే శాఖలవారీగా డీపీసీలు ఏర్పాటుచేస్తామని, 10-12 రోజుల్లోనే పదోన్నతులు ఇస్తామన్నారు. ఆ తర్వాత వచ్చే రెండు నెలల్లోనే కింది స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీనిచ్చారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఐఏఎస్‌లు, కలెక్టర్ల వంటి అధికారుల దబాయింపులుండవని కేసీఆర్ పేర్కొన్నారు. వారు కూడా కింది స్థాయి ఉద్యోగులతో ప్రజాస్వామిక భాషలోనే మాట్లాడాలన్నారు. ఏ సమస్య ఉన్నా చర్చించుకుందామని హితవు పలికారు. సమస్యల పరిష్కారం కోసం ఇందిరాపార్కులు, దర్నా చౌక్ల అవసరమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. యథాతథ స్థితి ప్రసక్తే లేదు జిల్లా, జోనల్ కేడర్‌లో యథాతథ స్థితిని అంగీకరించే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎంత వరకైనా సిద్ధపడతామన్నారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరి కార్యాలయాల్లో వారు యూనియన్ నేతలకు జూన్ 2లోగా అందించాలని ఉద్యోగులకు కేసీఆర్ సూచించారు. దీనికోసం దేవీ ప్రసాద్ అధ్యక్షతన స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్ సహా 10 మందితో వార్‌రూమ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. అలాగే రాష్ర్ట విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ర్టంలో అమలైన ప్రమోషన్లు, రివర్షన్లు చెల్లవన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాగానే వీటిని సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు మీడియాలో వస్తున్న కథనాలు నిజం కావన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాతనే ఆ ప్రక్రియ ఉంటుందన్నారు. ఉద్యమ నేతగా ఉన్నా, ప్రభుత్వ అధినేతగా ఉన్నా ఆంధ్రా ఉద్యోగుల వైఖరిలో మార్పులేదన్నారు. తెలంగాణ ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడే ఉంటే శంకరగిరి మాన్యాలే ఆంధ్రాకు చెందిన ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగిస్తే వారికి శంకరగిరి మాన్యాలే గతి అని టీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల ముఖ్య నేతలతో ఇక్కడి కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి మీడియాను అనుమతించలేదు. విశ్వసనీయవర్గాల సమచారం ప్రకారం.. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాలపైనే కేసీఆర్ మాట్లాడారు. ‘ఉద్యోగుల విభజన ఇంకా జరగలేదు. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఆ ప్రక్రియ జరుగుతుంది. దీనిపై మీడియాలో వస్తున్నదంతా అవాస్తవం. వాటిని పట్టించుకోవద్దు. ప్రస్తుతానికి ప్రభుత్వాలు నడవడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే నాకు చెప్పారు. అఖిల భారత సర్వీసుల్లోని అధికారుల విభజన మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. మిగిలినవన్నీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనే ఉంటాయ’ని కేసీఆర్ వివరించారు. ‘ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చి పనిచేసుకొమ్మంటే ఎలా? కొత్త ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉండొద్దా? తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్నో ఉంటయి. ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి వంటి ఎన్నో రహస్యమైన పనులుంటయి. అవన్నీ లీకు కావా? అందుకే ఎవరితోనూ కయ్యం వద్దు. మంచిగా చెప్తం. తెలంగాణలో పనిచేసే ఆంధ్రా ఉద్యోగులను తీసుకోవాలని ఆంధ్రా ప్రభుత్వానికి ముందగా లేఖ రాస్తా. ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో హాయిగా పనిచేసుకోవాలంటున్నా. అయినా వినకుండా బలవంతంగా ఇక్కడే ఉద్యోగులుంటే వారికి శంకరిగిరి మాన్యాలే గతి. జీతాలు, పెన్షన్లు రాకుండా చూద్దాం. ప్రాధాన్యత లేని లూప్లైన్లో వారిని వేద్దాం. ఇంకేమన్నా ఇబ్బందులుంటే పెడతం. వారు కోర్టుకు పోతరు. అవన్నీ నడుస్తనే ఉంటయి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించినా.. ఎవరి స్థానికత ఏమిటో పక్కనే పనిచేస్తున్న ఉద్యోగులకు తెలియకుండా పోదు. ఏ ఉద్యోగి ఎక్కడి వారో అన్ని వివరాలను సేకరించండి. ఆంధ్రా ఉద్యోగి అయితే పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో కూడా మనం ఏర్పాటు చేసిన వార్‌రూమ్ కమిటీకి చెప్పండి. అవన్నీ జూన్ 2లోగా చేస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే పంపిణీలో మాట్లాడుతం. ఎక్కడి వారిని అక్కడకు పంపుతం. అయినా బలవంతంగా ఎవరైనా ఉంటామంటే ప్రధానికి చూపించడానికి సాక్ష్యాలు పట్టుకరండి’ అని కేసీఆర్ సూచించారు. మంత్రి పదవి ఎవరికి? ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన ఒకరిని మంత్రిని చేసుకుందామని ఉద్యోగులతో సమావేశంలో కేసీఆర్ చెప్పారు. దీనికి స్పందించిన ఉద్యోగులు... ప్రస్తుతం తమ తరఫు నుంచి టీఆర్ఎస్లో ఓ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ ఉన్నారని, వారిద్దరికీ మంత్రి పదవులను ఇవ్వాలని కోరారు. సరే చూద్దాంలే అని కేసీఆర్ దాటవేశారు. ఇక కొందరు ఉద్యోగులు.. ఇళ్ల స్థలాలు, బదిలీలు, ప్రమోషన్లు వంటి విషయాల గురించి ప్రస్తావించినప్పుడు కేసీఆర్ నుంచి మౌనమే సమాధానమైంది. పుంటికూర చాలదా? ‘స్థానికతను గుర్తించడానికి 50 ఏళ్ల నుంచి రాద్ధాంతం చేస్తున్నరు. టీడీపీ హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇది చర్చకు వచ్చింది. నేను అప్పుడే అన్నా. సచివాలయంలో సాయంత్రం పని అయిపోయినంక ఒక చేతిలో పుంటికూర పట్టుకుని, మరోచేతిలో ఆనెపు కాయను పట్టుకుని గేటుకాడ నిలబడుదాం. గేటుకాడికి వచ్చిన ఉద్యోగికి పుంటికూర చూపించి ఇది ఏందని అడుగుతం. పుంటికూర అన్నోళ్లను తెలంగాణ దిక్కు, గోంగూర అన్నోళ్లను ఆంధ్రాకు పంపిద్దామని అప్పుడే చెప్పిన. ఇప్పుడు కూడా స్థానికత విషయంలో పెద్ద లొల్లి అవసరం లేదు. ఎవరెక్కడివాళ్లో వట్టిగనే తెలుస్తది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు దేవీ ప్రసాద్, సి.విఠల్, కారెం రవీందర్ రెడ్డి, ఎస్.ఎం.హుస్సేని ముజీబ్, కృష్ణ యాదవ్, ఎం.మణిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌కు కమల్‌నాథన్ కమిటీ
మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఉద్యోగుల విభజనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహాంపై చర్చించేందుకు కమల్‌నాథన్ కమిటీ నేటి సాయంత్రం ఛత్తీస్‌గఢ్ పయనమవుతుంది. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగల విభజన అంశంపై ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో కమల్‌నాథన్ కమిటీ సమావేశమై చర్చించనుంది. కమల్‌నాథన్ వెంటనే ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పీవీ రమేష్ కుమార్, రామకృష్ణారావులతోపాటు మరికొంత మంది అధికారులు ఛత్తీస్‌గఢ్ వెళ్లనున్నారు.