ఉద్యోగుల విభజన పూర్తయ్యాకే టీ ఇంక్రిమెంట్
* ఇంకా తేలని కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు
* వేచి చూస్తున్న తెలంగాణ సర్కారు
* ఉద్యోగుల సంఖ్య తేలకపోవడంతో ఇంక్రిమెంట్‌పై అస్పష్టత
* ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోయాకే దృష్టి సారించాలని యోచన
* రూ. 200 కోట్ల భారం పడవచ్చని ఆర్థిక శాఖ అంచనా
* మౌనంగా ఉండిపోయిన ఉద్యోగ సంఘాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంక్రిమెంట్‌కు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదు. ఉద్యోగుల విభజన పూర్తయితే తప్ప దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం కన్పించడం లేదు. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో, ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న నేపథ్యంలో.. ఇంక్రిమెంట్లను ప్రకటించడం వల్ల ఆంధ్రాలో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందన్న భావన ప్రభుత్వంలో ఉంది. అంతేకాక ఇక్కడ పనిచేస్తున్న అక్కడి వారికి ఇంక్రిమెంటు ఇవ్వడం ఎందుకన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
దీన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ ప్రభుత్వం ఇంక్రిమెంట్ ప్రకటనను జాప్యం చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల విభజనకు సంబంధించి నియమించిన కమలనాథన్ కమిటీ ఇప్పటికీ మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో.. ఇది ఇంకెంత కాలం సాగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర కేడర్‌లోని ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి కమలనాథన్ కమిటీ కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. గతవారంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన కమలనాథన్ ఒక నివేదిక రూపొందించారు. ఆ నివేదికపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఇంకా సంతకం చేయలేదు.
ఆ నివేదికలోని పలు అంశాలపై ఆయన అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ మార్గదర్శకాల ఖరారు ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. అదీకాక సీమాంధ్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచడంతో.. తెలంగాణకు ఆప్షన్ ఇవ్వాలనుకున్న ఉద్యోగులు సైతం తిరిగి ఆంధ్రకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఇక్కడకు రావడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలా ఉద్యోగుల విభజనపై పూర్తి స్పష్టత లేకుండా పోయింది. తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చే తెలంగాణ ఇంక్రిమెంట్‌తో దాదాపు 200 కోట్ల రూపాయల మేరకు భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగుల విభజన కసరత్తు పూర్తయితే తప్ప.. పూర్తి భారం కచ్చితంగా తెలియదని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ఇంక్రిమెంట్ కోసం గట్టిగా పట్టుపట్టలేని పరిస్థితి ఉంది. తమ సహచరులు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు డిమాండ్ చేస్తే.. ఇబ్బందులొస్తాయనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలు కూడా మౌనంగా ఉంటున్నాయి.