కొత్త జిల్లాల ఏర్పాటుదాకా ఎదురుచూపులే?
- ముందుకు కదలని నామినేటెడ్ పదవుల భర్తీ
- నిరాశలో మునిగిపోతున్న గులాబీ శ్రేణులు
సాక్షి, హైదరాబాద్: గులాబీ శ్రేణులకు మరికొంత కాలం నిరాశేనా.. కొత్త జిల్లాల ఏర్పాటుదాకా నామినేటెడ్ పదవుల భర్తీ లేనట్లేనా.. ఈ ప్రశ్నలకు అధికార టీఆర్‌ఎస్ నేతలు కొందరు అవుననే సమాధానం చెబుతున్నారు. పదవుల పందేరం మొదలు పెడితే పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలకు వేల సంఖ్యలో పదవులు లభించే అవకాశముంది. కానీ ఇది మరికొంత ఆలస్యమవుతుందన్న సమాచారంతో పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోతున్నాయి.
మెజారిటీ కార్పొరేషన్లు విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూల్‌లలో ఉన్నాయి. వాటిలో ఇంకా ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపకాలు జరగలేదు. దీంతో కార్పొరేషన్లలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యమయ్యే అవకాశముందని చెబుతున్నారు. పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకు రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే దాకా పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ మొదలయ్యేలా లేదని సమాచారం.
నామమాత్రంగా కొన్ని పదవులకు..
టీఆర్‌ఎస్ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా, నిరంజన్‌రెడ్డికి రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. పార్టీ పదిహేనో ప్లీనరీ ముందు ఆర్టీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను, అంతకుముందే రాష్ట్ర సాంస్కృతిక సారథికి చైర్మన్‌గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను, ఇటీవల ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా నియమించారు. తాజాగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సీఎం రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డిని నియమించారు.
ఇక పెద్ద సంఖ్యలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండళ్ల భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దేవాలయ కమిటీల పరిస్థితీ అదే. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుదాకా నామినేటెడ్ పదవుల భర్తీకి బ్రేక్ వేయాలన్న భావనలో అధినాయకత్వం ఉందన్న విషయం తెలుసుకుని పార్టీ నేతలు నిరాశలో కూరుకుపోతున్నారు. ‘రెండేళ్లకుపైగా ఎదురు చూశాం. అందరి పరిస్థితీ అగమ్య గోచరంగానే ఉంది. 14ఏళ్లు పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేశాం. నమ్ముకున్న కార్యకర్తలకూ ఏం చెప్పలేకపోతున్నాం. పార్టీ పదవులు కూడా లేకుండా పోయాయి..’ అని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.