ఉద్యోగులకు అండగా ఉంటాం : వైఎస్ జగన్
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులే లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదని, వాటిని కట్టిపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్జప్తి చేశారు.
ఉద్యమ పార్టీగా ఉన్నంత కాలం అన్నదమ్ముల్లా విడిపోదాం అంటున్న కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదని వైఎస్ జగన్మోహన్ సూచించారు.
సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు ఉద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. జీతాలు, జీవితాలపై భయాందోళనతో ఉన్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ భరోసా ఇవ్వాలన్నారు. భయాందోళనతో ఉన్న ఉద్యోగులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ఉమ్మడి రాజధానిలో పనిచేయాల్సిన ఉద్యోగుల మధ్య వాతావరణం కలుషితం చేయడం తీవ్రమైన అంశమని, విభజన సమస్యలపై మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రాంతాల వారీగా రెచ్చగొట్టే వైఖరిని ఉపేక్షించడం తగదని, సుహృద్భావ వాతావరణంలో విభజన ప్రక్రియ సాగకుంటే ఊరుకునే పరిస్థితి ఉండదని వైఎస్ జగన్ హెచ్చరించారు.